కాంగ్రెస్ స్థైర్యంపై మరో దెబ్బ.. కోలుకుంటుందా?
Breaking

కాంగ్రెస్​ పార్టీకి వరుస షాకులు సర్వసాధారణంగా మారిపోయాయి. రోజురోజుకు పార్టీ పరిస్థితి దయనీయంగా మారిపోతోంది. పుదుచ్చేరిలోనూ అధికారానికి దూరం కావడం ఇప్పుడు కాంగ్రెస్​ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తోంది. సమస్యల సుడిగుండంలో ఉన్న కాంగ్రెస్.. వచ్చే నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో ఏమేరకు ప్రభావం చూపుతుందో?

పార్టీ కీలక నేత జ్యోతిరాధిత్య సింధియా తిరుగుబాటుతో మధ్యప్రదేశ్... రెబల్ ఎమ్మెల్యేల కారణంగా కర్ణాటక... సొంత నేతల రాజీనామాతో పుదుచ్చేరి.... ఇలా అధికారంలో ఉన్న రాష్ట్రాలను కోల్పోవడం కాంగ్రెస్​కు ఆనవాయితీగా మారిపోయింది! వారం క్రితం పంజాబ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో దక్కిన విజయాన్ని ఆస్వాదించేలోపే కేంద్ర పాలిత ప్రాంతంలో అధికారాన్ని కోల్పోయింది. సొంత నేతలే పార్టీకి షాక్ ఇస్తూ ప్రభుత్వాన్ని కూలదోసే కార్యక్రమానికి ఆద్యులుగా మారడం వల్ల.. పుదుచ్చేరిలో చతికిలపడిపోయింది కాంగ్రెస్.

2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత క్రమంగా గ్రాఫ్ కోల్పోతోంది హస్తం పార్టీ. దాదాపు అన్ని ఎన్నికల్లో డీలా పడింది. ప్రస్తుతం రాజస్థాన్, ఛత్తీస్​గఢ్, పంజాబ్ రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. మహారాష్ట్ర, ఝార్ఖండ్​లో కాంగ్రెస్ భాగస్వామ్యంలోని కూటమి అధికారంలో ఉన్నా.. ఆయా రాష్ట్రాల్లో పార్టీ పరిస్థితి రెండు, మూడు స్థానాలకే పరిమితం.

సొంత నేతలతోనే తలనొప్పి

అంతర్గత సమస్యలే 'హస్తం'కు ముల్లులా గుచ్చుకుంటున్నాయి. సొంత నేతలే కాంగ్రెస్ పాలిట శత్రువులుగా మారుతున్నారు. పార్టీ​పై తిరుగుబాటు బావుటా ఎగరేసిన సింధియా.. మధ్యప్రదేశ్​లో కమల్​నాథ్ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని అవలీలగా కూలదోశారు. ఆ రాష్ట్రంలో పట్టు కోల్పోయిన తర్వాత కాంగ్రెస్ మరింత బలహీనంగా మారిపోయింది. దిల్లీ, బిహార్ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.

ఇదీ చదవండి: కొరవడిన నాయకత్వం... బలహీనమవుతున్న హస్తం పార్టీ..!

దేశ రాజధానిలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పనితీరు మరీ తీసికట్టుగా ఉంది. మొత్తం 70 స్థానాలు ఉంటే అందులో 67 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతయ్యాయంటే ఆ పార్టీ ఏ మేరకు పోటీ ఇచ్చిందో అర్థమవుతోంది. 'మహాగట్​బంధన్'లో భాగంగా బిహార్ బరిలో దిగిన కాంగ్రెస్.. గత ఎన్నికలతో పోలిస్తే 9 స్థానాలు తక్కువగా గెలుచుకుంది.

ఇన్ని ప్రతికూలతల మధ్య కాంగ్రెస్​కు ఊరటనిచ్చే అంశం ఏదైనా ఉంది అంటే అది రాజస్థాన్​లోనే. అప్పటివరకు రాజస్థాన్ ఉపముఖ్యమంత్రిగా ఉన్న కాంగ్రెస్ కీలక నేత సచిన్ పైలట్.. సొంత ప్రభుత్వంపై ఎదురుతిరిగారు. అశోక్ గహ్లోత్ సర్కార్​ను దాదాపుగా కూల్చినంత పని చేశారు. కానీ, గహ్లోత్​తో పాటు కాంగ్రెస్ అధిష్ఠానం అప్రమత్తమై.. ప్రభుత్వాన్ని 'చే'జారకుండా అడ్డుకున్నారు. అయితే పైలట్, గహ్లోత్ మధ్య విభేదాలు ఇప్పటికీ తొలగిపోలేదని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

నాలుగు రాష్ట్రాల్లోనైనా..?

ఇలా నైతిక స్థైర్యం తీవ్రంగా దెబ్బతిన్న హస్తం పార్టీ వచ్చే ఎన్నికలపై ఆశలు పెట్టుకుంది. బంగాల్, తమిళనాడు, అసోం, కేరళలో మెరుగైన ప్రదర్శన చేయాలని భావిస్తోంది. పార్టీ బేస్​ను విస్తృతం చేయాలని అనుకుంటోంది. అయితే ఇదంత సులభంగా జరిగిపోయే విషయమేం కాదు. భాజపా దూకుడు, ఎంఐఎం రంగంలోకి దిగడం పార్టీకి అతిపెద్ద అవరోధాల్లా మారాయి.

ఇదీ చదవండి: దూకుడు పెంచిన రాహుల్​- ఆ రాష్ట్రాల్లో వరుస ప్రచారాలు

బంగాల్​లో అధికారంలోకి వచ్చేందుకు ఉన్న అవకాశాలన్నింటినీ సమర్థంగా ఉపయోగించుకుంటోంది కమలదళం. ప్రస్తుతం అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్​(టీఎంసీ)కు రాష్ట్రంలో గట్టి పట్టుంది. పోటీ ప్రధానంగా వీరిద్దరి మధ్యే ఉంటుందన్నది వాస్తవం. ఇక్కడ వామపక్షాలతో కలిసి పోటీ చేస్తున్న కాంగ్రెస్.. రాష్ట్రంలో రాణించాలని అనుకుంటోంది. కానీ ఈ ఆశలపై మజ్లిస్ పార్టీ నీళ్లు జల్లుతోంది. ఎంఐఎం ఎంట్రీతో ముస్లిం ఓట్లను టీఎంసీ, కాంగ్రెస్ కోల్పోయే ప్రమాదం ఉంది.

భాజపా అధికారంలో ఉన్న అసోంలో కాంగ్రెస్ పని అంత తేలికగా అయ్యేది కాదు. ఈ ఈశాన్య రాష్ట్రంపై వరాలను కురిపిస్తోంది కేంద్రం. అనేక అభివృద్ధి పథకాల నిధులను అసోంకు కేటాయించింది.

కేరళలో అధికార పంపిణీ వామపక్షాల మధ్యే ఉన్నప్పటికీ.. కాంగ్రెస్​ ప్రస్తుతం కఠిన పరిస్థితులను ఎదుర్కొంటోంది. భాజపాలోకి మెట్రోమ్యాన్ శ్రీధరన్ రావడం కాషాయ పార్టీకి కొంతమేర లాభం చేకూర్చే అవకాశం ఉంది. ఇది ఇతర పార్టీలపై తప్పక ప్రభావం చూపుతుంది.

తాజాగా అధికారం కోల్పోయిన పుదుచ్చేరి అసెంబ్లీకీ త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడి రాజకీయాల్లో పట్టున్న కాంగ్రెస్.. ఎలాగైనా మళ్లీ అధికారంలోకి రావాలని అనుకుంటోంది. అయితే ఎమ్మెల్యేల వరుస రాజీనామాలు పార్టీ స్థైర్యాన్ని దెబ్బతీశాయి.

నాయకత్వమే సమస్య!

హస్తం పార్టీ పరిస్థితికి హైకమాండే కారణమంటూ నేతలు చర్చించుకుంటున్నారు. ఓటర్లను 'గాంధీ'లు ఆకర్షించలేకపోతున్నారని అంటున్నారు. గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మ సహా 23 మంది నేతలు ఇప్పటికే పార్టీ నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాశారు.

సోనియా తరచుగా అనారోగ్యం బారిన పడటం, పార్టీని ముందుండి నడిపించేందుకు రాహుల్ గాంధీ విముఖత వ్యక్తం చేస్తుండటం వల్ల నాయకత్వ సమస్య కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. జులైలో నిర్వహిస్తామని చెప్పినప్పటికీ అంతర్గత ఎన్నికల అంశంపై పూర్తి స్పష్టత లేకపోవడం వల్ల.. పార్టీ అదృష్టం రోజురోజుకు క్షీణిస్తోంది. దేశంలోని పరిస్థితులను బట్టి పార్టీ పుంజుకోవాలంటే ఇప్పటినుంచే దూకుడు మంత్రాన్ని జపించాలని సీనియర్ నేతలు భావిస్తున్నారు. కాంగ్రెస్​కు కొత్త అధ్యక్షుడు వచ్చిన తర్వాత పార్టీకి జోష్ వస్తుందని చెబుతున్నారు. ఏం జరుగుతుందో మరి!

ఇదీ చదవండి: కేరళ ఓట్ల వేట- 'మూడుసార్లు పోటీ'పై సీపీఐకి చిక్కులు!

    About us Privacy Policy
    Terms & Conditions Contact us

    • ETV
    • ETV
    • ETV
    • ETV

    Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
    ETV

    INSTALL APP

    ETV

    CHANGE STATE

    ETV

    SEARCH

    ETV

    MORE

      • About us
      • Privacy Policy
      • Terms & Conditions
      • Contact us
      • Feedback

      Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.