
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల పర్వం ముగిసింది. వృద్ధాప్యంలోనూ ఓటు హక్కును బాధ్యతగా భావించి పోలింగ్ కేంద్రానికి వచ్చిన పలువురు.. కొన్ని గంటల్లోనే అస్వస్థతతో తనువు చాలించారు.
తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం కొమరాడలో పాలూరి కొండయ్య (63).. పోలింగ్ కేంద్రం వద్దే గుండెపోటుతో కుప్పకూలారు. సిబ్బంది పరీక్షిస్తుండగానే మృతిచెందారు. కాట్రేనికోన మండలంలోని చెయ్యేరుకు చెందిన దంగేటి నాగూరు (85) ఓటేసిన తర్వాత పోలింగ్ కేంద్రం ఆవరణలోనే గుండెపోటుతో మరణించారు. విశాఖ జిల్లా పరవాడ పంచాయతీలో షేక్ బుచ్చయ్య సాహెబ్ (92) ఓటు వేసి ఇంటికి వచ్చిన కొద్ది సేపటికే చనిపోయారు. సబ్బవరం మండలం టెక్కలిపాలెం పంచాయతీ నాయనమ్మపాలేనికి చెందిన అప్పికొండ గంగమ్మ (70) టి.జంగాలపాలెం గ్రామంలో ఓటేశారు. ఇంటికి వచ్చిన కాసేపటికే మృతి చెందారు.
వార్డు స్థానం అభ్యర్థి మృతి
శ్రీకాకుళం జిల్లా జాతీయ రహదారిపై చిలకపాలెం గ్రామం వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎచ్చెర్ల గ్రామ పంచాయతీలో నాలుగో వార్డు సభ్యుడిగా బరిలో ఉన్న జరుగుళ్ల తిరుపతిరావు(30) మృతిచెందారు. తన స్నేహితుడు శేఖర్‌తో కలసి ద్విచక్ర వాహనంపై స్వగ్రామం వెళుతుండగా వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే చనిపోయాడు. సాయంత్రం వెలువడిన ఫలితాల్లో ఆయన ఓటమి పాలయ్యారు.
ఇదీ చదవండి:
కృత్రిమ మేధతో సీసీ కెమెరాల వినియోగం.. నేరగాళ్ల కట్టడిలో ఇవే కీలకం