
జూన్ నాటికి శాసనమండలిపై పట్టు సాధించేందుకు వైకాపా సన్నద్ధమవుతున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వివిధ విభాగాల కింద ఎన్నికైన, నియమితులైన ఎమ్మెల్సీల్లో 23 మంది పదవీకాలం జూన్ నాటికి ముగియనుంది. ఈ 23 మందిలో వైకాపాకు చెందిన ఎమ్మెల్సీలు నలుగురున్నారు. ఈ నాలుగింటితో పాటు మిగిలిన 19 స్థానాలనూ కైవసం చేసుకునేందుకు ఆ పార్టీ వ్యూహరచన చేస్తోంది.
సంఖ్యాబలాన్ని పెంచుకోవడం ద్వారా వచ్చే జూన్ నాటికి శాసనమండలిపై పట్టు సాధించేందుకు వైకాపా సన్నద్ధమవుతున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వివిధ విభాగాల కింద ఎన్నికైన, నియమితులైన ఎమ్మెల్సీల్లో 23 మంది పదవీకాలం జూన్ నాటికి ముగియనుంది. ఈ 23 మందిలో వైకాపాకు చెందిన ఎమ్మెల్సీలు నలుగురున్నారు. ఈ నాలుగింటితో పాటు మిగిలిన 19 స్థానాలనూ కైవసం చేసుకునేందుకు ఆ పార్టీ వ్యూహరచన చేస్తోంది. గవర్నర్ నామినేట్ చేసిన వారిలో ఇద్దరు ఎమ్మెల్సీలు సహా మండలిలో ఇప్పటికే ఆ పార్టీకి 10మంది సభ్యులున్నారు. వీరిలో ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి ఇటీవల మరణించారు. ఆ స్థానానికి ఉప ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైంది. చల్లా కుమారుడు భగీరథరెడ్డికి ఆ స్థానాన్ని ఇస్తున్నట్లు సమాచారం.
పదవీ విరమణలు ఇలా..
మార్చిలో: ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన వారిలో ఐదుగురి పదవీకాలం మార్చి 29న ముగియనుంది. వీరి స్థానాలకు ఎన్నికల ప్రక్రియ మొదలైంది. ఈ ఐదింటిలో ఒకటి వైకాపా స్థానమే. ఇది పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజ్యసభకు వెళ్లడంతో ఖాళీ అయింది. ఈ 5స్థానాలూ వైకాపాకే దక్కనున్నాయి. ఇలా మార్చిలో వైకాపాకు నలుగురు కొత్త సభ్యుల బలం పెరగనుంది.
మేలో: ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీలుగా ఎన్నికైన వారిలో ముగ్గురి పదవీకాలం మే 24తో ముగియనుంది. ఈ మూడు స్థానాలూ తెదేపా, వైకాపా, భాజపాలకు ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి. ఈ మూడింటికీ ఎన్నికలు జరిగితే అన్నింటినీ గెలుచుకునేందుకు వైకాపా సిద్ధమవుతోంది. ఇదే జరిగితే ఆ పార్టీ సంఖ్యాబలానికి మరో ఇద్దరు ఎమ్మెల్సీలు కలుస్తారు.
జూన్‌లోనే అత్యధికంగా: గవర్నర్ నియమించిన ఎమ్మెల్సీల్లో నలుగురి పదవీకాలం జూన్ 11న ముగియనుంది. స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన వారిలో 11 మంది పదవీకాలం జూన్ 18తో ముగియనుంది. వీటిలో అనంతపురం, గుంటూరు, ప్రకాశం ఇప్పటికే ఖాళీగా ఉన్నాయి. మిగిలిన 8లో వైకాపా సభ్యుడొకరు.. తెదేపా వారు ఏడుగురు పదవీ విరమణ చేయనున్నారు. ఈ 11స్థానాలను కైవసం చేసుకోగలిగితే శాసనమండలిలో స్పష్టమైన ఆధిక్యం దక్కుతుందని వైకాపా నాయకత్వం యోచిస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ 11 స్థానాల్లోనూ వైకాపా గెలవగలిగితే ఆ పార్టీకి అదనంగా 10మంది సభ్యులు వస్తారు. ఇలా మొత్తమ్మీద జూన్ నాటికి మండలిలో వైకాపా సంఖ్యాబలం సుమారుగా 29కి చేరుతుందని ఆ పార్టీ అంచనా వేస్తోంది.
ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్ ఎవరెవరు?
శాసనమండలి ఛైర్మన్ ఎంఏ షరీఫ్ మేలో, డిప్యూటీ ఛైర్మన్ రెడ్డిసుబ్రహ్మణ్యం జూన్‌లో పదవీ విరమణ చేయనున్నారు. ఛైర్మన్ పదవికోసం వైకాపాలో సీనియర్ సభ్యుడొకరు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఎస్సీ లేదా బీసీ వర్గానికి చెందిన వారికి ఛైర్మన్ పదవి దక్కే అవకాశం ఉందని వైకాపా వర్గాలు చెబుతున్నాయి. డిప్యూటీ ఛైర్మన్ పదవిని మహిళకు ఇస్తారన్న చర్చ కూడా పార్టీలో సాగుతోంది.
ఇదీ చదవండి:
కృత్రిమ మేధతో సీసీ కెమెరాల వినియోగం.. నేరగాళ్ల కట్టడిలో ఇవే కీలకం