
ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన మెరికల్లాంటి విద్యార్థులకు ఇంజినీరింగ్ విద్యను అందించేందుకు ప్రారంభించిన ట్రిపుల్‌ఐటీల ప్రవేశాల్లో ఈ ఏడాది ప్రైవేటు విద్యార్థులదే పైచేయి అయింది. ఏటా పదో తరగతి మార్కుల ఆధారంగా నిర్వహించే ప్రవేశాలకు బదులుగా ఈసారి ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించారు. ఇందులో ప్రైవేటు పాఠశాలలకు చెందిన వారితో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పోటీ పడలేక అధికభాగం సీట్లను కోల్పోయారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు దాదాపు 34శాతానికిపైగా సీట్లను నష్టపోగా.. ప్రైవేటు విద్యార్థులు 59శాతం సీట్లను కైవసం చేసుకున్నారు.
ఈ ఏడాది కరోనా వ్యాప్తి కారణంగా పదో తరగతి పరీక్షలను రద్దు చేశారు. విద్యార్థులు అందరూ ఉత్తీర్ణులైనట్లు ప్రకటించారు. పాఠశాల స్థాయిలో నిర్వహించే ఫార్మెటివ్, సమ్మెటివ్ పరీక్షల ఆధారంగా మార్కులను కేటాయిస్తే ప్రైవేటు విద్యార్థులకు అధికంగా వస్తాయని వీటిని పరిగణనలోకి తీసుకోలేదు. మార్కులు, గ్రేడ్లు లేకపోవడంతో పదో తరగతి అర్హతతో నిర్వహించే వ్యవసాయ డిప్లామా కోర్సులు, ట్రిపుల్‌ఐటీల్లో ప్రవేశాలకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఏటా ఇచ్చినట్లే వెనుకబాటు సూచి కింద 0.4పాయింట్లు కలిపారు. అయితే పోటీ పరీక్ష కావడంతో ప్రైవేటు, ప్రభుత్వ విద్యార్థుల మధ్య మార్కుల వ్యత్యాసం భారీగా ఏర్పడింది. దీంతో వెనుకబాటు సూచి కింద 0.4పాయింట్లు కలిపినా ఎక్కువ మందికి సీట్లు లభించలేదు.
లాక్‌డౌన్‌తో పాఠ్యాంశాలకు దూరం..
కరోనా కారణంగా మార్చినెల నుంచి పాఠశాలలు మూతపడటంతో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులు కూడా జరగలేదు. దీంతో గతేడాది నవంబరు 28న ప్రవేశ పరీక్ష నిర్వహించే సమయానికి సబ్జెక్టును మరచిపోవడంతోపాటు విద్యార్థులు ఎలాంటి సన్నద్ధత లేకుండానే పరీక్షలకు హాజరయ్యారు. దీంతో పోటీలో వెనుకబడ్డారు. మరోవైపు ప్రవేశ పరీక్షపై ప్రకటన వెలువడడంతో కొన్ని ప్రైవేటు విద్యా సంస్థలు ప్రత్యేకంగా ఆన్‌లైన్ తరగతులు నిర్వహించగా మరికొందరు ప్రత్యేకంగా సన్నద్ధమయ్యారు.
సగానికిపైగా సీట్లు వారివే..
రాష్ట్రంలో ఇడుపులపాయ, ఒంగోలు, నూజివీడు, శ్రీకాకుళంలో నాలుగు ట్రిపుల్‌ఐటీలున్నాయి. వీటిల్లో ఈడబ్ల్యుఎస్, ఎన్‌ఆర్‌ఐల కోటా కలుపుకొని మొత్తం 4,407 సీట్లు ఉన్నాయి. ఇందులో ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు 1,823సీట్లు (41.4శాతం) రాగా.. ప్రైవేటు వారు 2,584 (58.6)శాతం సీట్లు పొందారు. పదో తరగతి మార్కుల ఆధారంగా గతంలో నిర్వహించే కౌన్సెలింగ్‌లో ప్రతి ఏటా సుమారు 75శాతం నుంచి 80శాతం వరకు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులే సీట్లు పొందేవారు. ఈసారి వీరి సంఖ్య 41.4శాతానికి పడిపోవడం గమనార్హం.
ఇదీ చదవండి: దుర్గగుడిలో అక్రమార్కులపై వేటు.. 15మంది ఉద్యోగుల సస్పెన్షన్