
విజయవాడలో అభివృద్ధి పనుల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న రీతిలో ఉంది. కోట్లాది రూపాయలు వ్యయం చేసినా అనేక ప్రతిపాదనలు ఇప్పటికీ పట్టాలు ఎక్కలేదు, మొదలుపెట్టినవి పూర్తి కాలేదు. పాలకపక్షం పదవీకాలం ముగినప్పటి నుంచి నగరపాలక సంస్థలో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. ఎన్నికల అనంతరం ఈసారి పీఠం ఎక్కే పాలకులైనా పెండింగ్ పనులపై శ్రద్ధ చూపాలని నగరవాసులు కోరుతున్నారు.
కోట్లాది రూపాయలతో మొదలుపెట్టిన పలు అభివృద్ధి పనులు విజయవాడలో ముందుకు కదలడం లేదు. ప్రతిపాదనల దశలో ఉన్న సౌకర్యాల కల్పనలు పట్టాలెక్కడానికి వేచి చూస్తున్నాయి. ఈసారి కొలువుదీరనున్న పాలకవర్గమైనా వాటిపై దృష్టిపెట్టి ప్రజా సమస్యలు తీరిస్తే బాగుంటుందని నగరవాసులు అభిప్రాయపడుతున్నారు.
ఆర్థిక ఇబ్బందులు లేవు... అయినా పనులు సాగవు
విజయవాడ నగరపాలక సంస్థ ఎదుర్కొనే వింత పరిస్థితి ఇది. గతంలో తీవ్ర ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడిన సంస్థను జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం, అమృత్ పథకాలు కాస్త చేయూతనివ్వగా.. సిబ్బంది జీతాల చెల్లింపుల విషయంలో 010 పద్దు ఆదుకుంది. దాదాపు రూ. 600 కోట్లతో 500 వరకు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టగా.. 400 పనులు ఇప్పటికే పూర్తైనట్లు అధికారులు చెబుతున్నారు. మరో 100కుపైగా పెండింగ్‌లో ఉన్నాయంటున్నారు. మరికొన్ని ప్రతిపాదనల దశలోనే ఉన్నాయి. కోట్లాది రూపాయల వ్యయంతో మొదలుపెట్టిన వర్షపునీటి డ్రెయిన్లు, మురుగు పారుదల పనులు, రూ. 20 కోట్లతో చేపట్టిన రహదార్ల నిర్మాణం ముందుకు కదలడంలేదు. తాగునీటిపైపుల నిర్మాణం, భూగర్భ డ్రెయినేజి, పలు కట్టడాల పరిస్థితీ అలాగే ఉంది. ఈ స్థితిలో వివిధ అభివృద్ధి పనులకు నూతన పాలకులు పెద్దపీట వేయాల్సిన అవసరం ఉంది.
మంజూరైన పనులు | |
వర్షపునీటి డ్రెయిన్లకు | రూ.461 కోట్లు |
24 గంటల నీటిసరఫరాకు | రూ.100 కోట్లు |
రహదార్ల నిర్మాణానికి | రూ.20 కోట్లు |
డ్రెయిన్ల పునరుద్ధరణకు | రూ.2.4 కోట్లు |
ఆధునీకరణ పనులకు | రూ.7 కోట్లు |
కాలువలు, ఉద్యానవనాలు, పచ్చదనం అభివృద్ధికి | రూ.18 కోట్లు |
క్రీడా ప్రాంగణాలు, ఈతకొలనుల అభివృద్ధికి | రూ. 25 కోట్లు |
ఎస్టీపీ ప్లాంట్ల అభివృద్ధికి | రూ.3.4 కోట్లు |
రహదారుల విస్తరణకు | రూ. 5.4 కోట్లు |
ఇతర పనులకు | రూ.50 కోట్లు |
సంపూర్ణంగా తాగునీరు అందేదెప్పుడో...!
నగరంలో 50 మిలియన్ గ్యాలన్ల సామర్థ్యంగల నీటిప్లాంట్లు ఉండగా.. 39.80 మిగిలియన్ గ్యాలన్లకు మించి శుద్ధజలాలను ప్రజలకు అందించలేకపోతున్నారు. కొన్ని ప్రాంతాల్లో బోరునీటి సరఫరా తప్పడంలేదు. హెడ్‌వాటర్ వర్క్స్ ప్రాంగణంలోని 5 ఎంజీడీ ప్లాంటు, 300 కిలోమీటర్ల పరిధిలో మిగిలిపోయిన తాగునీటి పైపులను అమర్చడం, 97 కిలోమీటర్ల పరిధిలోని పాతపైపులను పునరుద్ధరించడం, 5 ఎంజీడీ ప్లాంటును అందుబాటులోకి తేవడం, రామలింగేశ్వరనగర్ 10 ఎంజీడీ ప్లాంటును పునరుద్ధరించడం, గంగిరెద్దులదిబ్బ 10 ప్లాంటు ద్వారా నీటిసరఫరా సామర్థాన్ని పెంచడం వంటి ప్రతిపాదనలు ఇంకా పూర్తికాలేదు. విజయవాడలో 2.02 లక్షల ఇళ్లు ఉండగా.. 1.29 లక్షలకే కుళాయి కనెక్షన్లు ఉన్నాయి. 72 వేల కుటుంబాలకు ఈరోజుకీ కుళాయిలు లేవు. అందరికీ సంపూర్ణంగా తాగునీరు అందించేందుకు 24×7 విధానం ప్రకారం ప్రతిపాదనలు ఉండగా.. రూ. 100 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. మిగిలిన వారికి సాధారణ కుళాయిలు మంజూరు చేయడం ద్వారా తాగునీటి సమస్యలను తగ్గించాలి.
నగరానికి నిధుల విడుదల సరళి | |
కేంద్రం నిధులు | రూ.461 కోట్లు |
రాష్ట్రం నిధులు | రూ.150 కోట్లు |
14వ ఆర్థిక సంఘం నిధులు | రూ.120 కోట్లు |
అభివృద్ధికి కార్పొరేషన్ | రూ.50 కోట్లు |
ఇతర నిధులు | రూ.250 కోట్లు |
డ్రెయినేజీ సమస్యకు ఇప్పుడైనా పరిష్కారం దొరికేనా...?
జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కింద రూ. 1.92 కోట్ల వ్యయంతో చేపట్టిన భూగర్భ డ్రెయినేజి వ్యవస్థ.. పాతబస్తీ పరిధిలోని పలు ప్రాంతాలు, సింగ్‌నగర్, సత్యనారాయణపురం, పటమటలంకలో ఇప్పటికీ పూర్తికాలేదు. నేటికీ 1.04 లక్షల కుటుంబాలకు కనెక్షన్లు ఇవ్వనేలేదు. అంతర్గత పైపులైన్లను సంపులకు, అక్కడ నుంచి సీవేజ్ ట్రీట్ మెంట్ ప్లాంట్ (ఎస్టీపీ) లకు కలపలేదు. ఈ పనులకు రూ.50 కోట్ల వ్యయపు అంచనాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ గ్రాంటు రూ. 461 కోట్లతో 444 కిలోమీటర్ల మేర చేపట్టిన వర్షపునీటి డ్రెయిన్లు ఇంకా 57 శాతం పూర్తి కావాల్సి ఉంది. కౌన్సిల్లో అనేకసార్లు ప్రతిపాదనలు చేసినా ఫలితం లేకపోయింది.
పెండింగ్ పనులు మరెన్నో...
- రూ.1.50 కోట్లతో బీసెంట్ రోడ్డు ఆధునీకరణ ప్రతిపాదనలు ఉన్నాయి. కార్యక్రమానికి శంఖుస్థాపన జరిగినా పనులు చేపట్టలేదు.
- ఫుడ్‌కోర్టు ఆధునీకరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి.
- స్ట్రీట్ ఫర్నీఛర్ ప్రతిపాదనలు అసంపూర్తిగా మిగిలాయి.
- పార్కుల అభివృద్ధి, సామాజిక పార్కుల ఆధునీకరణ, స్థానికులకు నిర్వాహణ బాధ్యతల ప్రతిపాదనలు పూర్తి కాలేదు.
- పాయికాపురం చెరువు అభివృద్ధి ప్రతిపాదనలు ముందుకు సాగలేదు.
- గోపార్కింగ్ ప్రాజెక్టు ప్రారంభం కాలేదు.
- 9 అంతస్తుల నగరపాలక సంస్థ నూతన భవనం అసంపూర్తిగానే ఉంది.
- క్రీడా ప్రాంగణాల ఆధునీకరణ పనులు అసంపూర్తిగా ఉన్నాయి.
- మూడు కమర్షియల్ పార్కుల అభివృద్ధి అసంపూర్తిగా మిగిలింది.
- కారిడార్ ఇంప్రూవ్మెంట్ ప్లాన్ అమలు కాలేదు.
- స్ట్రీట్ ఫర్ పీపుల్ ప్రాజెక్టు అసంపూర్తిగానే ఉంది.
వర్షాకాలం వస్తే వణుకే...
విజయవాడలో 16 డివిజన్లలోని 160 ఎకరాలు.. కొండ ప్రాంతాల్లో ఉన్నాయి. 52 వేల కుటుంబాలు ఇక్కడ జీవిస్తున్నాయి. వీరిలో సుమారు 20 వేల కుటుంబాలు చాలా ఎత్తున నివసిస్తున్నాయి. వీరి కోసం కొత్తగా మెట్లు నిర్మించడం, పాడైపోయిన వాటిని పునరుద్ధరించడం వంటి ప్రతిపాదనలు ఉన్నాయి. రూ.5.50 కోట్లకు పైగా అవసరం అవుతాయని అంచనా ఉంది. పనులు చేపట్టకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలం వస్తుందంటే వారికి వణుకు పుడుతోంది. 500 ప్రాంతాల్లో రాళ్లు విరిగిపడే పరిస్థితి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మరో 550 చోట్ల పేదల ఇళ్లు కిందకు జారిపోయే అవకాశం ఉన్నట్లు లెక్కించారు. ప్రమాదాల నివారణకు రిటైనింగ్ వాల్స్ నిర్మాణానికీ ప్రణాళికలు సిద్ధం చేశారు. దాదాపు రూ.2.75 కోట్లతో ముఖ్య ప్రాంతాల్లో వాటి నిర్మాణం చేపట్టాలనుకున్నా.. పనులు మొదలుపెట్టలేదు. జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కింద పేదలకోసం 18 వేల ఇళ్లు నిర్మించగా.. ఇప్పటికీ 2,300 అసంపూర్తిగా ఉన్నాయి. ఆక్రమిత, అభ్యంతరకర ప్రాంతాల్లోని లబ్ధిదారులకు గృహాలు కేటాయించాల్సి ఉండగా.. ఎన్యూమరేషన్ పూర్తిచేసినా చాలా మందికి ఇళ్లు అప్పగించలేదు. పీఎంఏవై కింద జక్కంపూడిలో నిర్మించిన 6,576 గృహాల కేటాయింపూ జరగలేదు.
రోడ్లూ అస్తవ్యస్తం:
దాదాపు రూ. 1.20 కోట్ల వ్యయంతో నగరంలోని నాలుగు ప్రాంతాల్లో ఆన్‌సైట్ కంపోస్టు ప్లాంట్లను ఏర్పాటు చేయగా అవి మూతపడ్డాయి. 20 టన్నుల కూరగాయల వ్యర్థాలు, 200 మెట్రిక్ టన్నుల తడి చెత్తను వాటికి తరలించి.. సేంద్రియ ఎరువుగా మార్చాలన్న ప్రతిపాదనలు అమలు కావడంలేదు. పలు ప్రాంతాల్లోని పురాతన, శిథిలావస్థకు చేరిన వాణిజ్య సముదాయాలను ఆధునీకరించే ప్రణాళికలూ ఉన్నాయి. ఒకటి, రెండింటికి ప్రతిపాదనలు సిద్ధం కాగా మిగిలిన వాటికి పనులు ప్రారంభం కాలేదు. సుమారు 1,200 కిలోమీటర్ల పరిధిలో రహదారులు, శివారు ప్రాంతాల్లో 176 కిలోమీటర్ల పరిధిలో కచ్చా రోడ్లు ఉండగా.. అనేక కిలోమీటర్ల మేర ధ్వంసం అయ్యాయి. ప్రభుత్వం గతంలో విడుదల చేసిన రూ.150 కోట్ల నిధుల్లో అగ్రభాగం.. సీసీ, బీటీ రోడ్ల నిర్మాణాలు, రహదారుల పునరుద్ధరణకు వెచ్చించడానికి చూస్తున్నా అడుగు ముందుకు పడటం లేదు. నగరప్రజలు విడుదల చేస్తున్న వ్యర్థాల స్థాయిలో శుద్ధి ప్లాంట్ల సామర్థ్యం లేదు. ఫలితంగా.. పెద్దఎత్తున మురుగు శుద్ధి కాకుండానే కాలువల్లో, నదుల్లో కలుస్తోంది. ఎస్టీపీల ఆధునీకరణ, నూతన ప్లాంట్ల ఏర్పాటుతోపాటు బందరు, ఏలూరు, రైవైస్ కాలువల వెంట మినీ ఎస్టీపీల నిర్మాణ ప్రతిపాదనలు ఉన్నాయి. వాటి కోసం ప్రాథమికంగా రూ. 20 కోట్లు ఖర్చు అవుతుందన్న అంచనాలున్నా పనులు ప్రారంభం కాలేదు.
త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల అనంతరం పీఠం ఎక్కే పాలకులైనా.. ఈ పెండింగ్ పనులపై శ్రద్ధ చూపి పరిష్కరించాలని నగరవాసులు కోరుతున్నారు.
ఇదీ చదవండి:
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనూ ఇదే హవా కొనసాగుతుంది: సజ్జల