
రెండో దఫా కరోనా టీకా పంపిణీలో చైనా వ్యాక్సిన్లను వాడబోమని శ్రీలంక ప్రకటించింది. చైనా, రష్యా టీకాలు ఇంకా సిద్ధంకాకపోవటం వల్లే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ దేశ ఉద్యాన శాఖ మంత్రి రమేశ్ పథిరణ తెలిపారు. రెండో దశలో ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్లను మాత్రమే వినియోగించనున్నట్లు పేర్కొన్నారు.
తమదేశంలో త్వరలో మొదలుకానున్న రెండో దఫా కరోనా టీకా పంపిణీలో చైనా వ్యాక్సిన్లను వాడబోమని శ్రీలంక ప్రకటించింది. చైనా, రష్యా తయారుచేస్తున్న టీకాలు ఇంకా సిద్ధం కాకపోవటం వల్ల తాము ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్లను మాత్రమే వినియోగించనున్నామని.. ఆ దేశ ఉద్యాన శాఖ మంత్రి రమేశ్ పథిరణ స్పష్టం చేశారు. అంతేకాకుండా టీకా మూడో దశ ప్రయోగాలకు సంబంధించిన పత్రాలను చైనా సమర్పించలేదని ఆయన వెల్లడించారు.
శ్రీలంకకు భారత్ ఉచితంగా అందజేసిన ఐదు లక్షల మోతాదుల టీకాతో ఆ దేశంలో తొలి దఫా కరోనా వ్యాక్సినేషన్ జనవరిలో మొదలైంది. ఆపై కోటి డోసుల ఆస్ట్రాజెనెకా టీకాను సీరం ఇన్‌స్టిట్యూట్ నుంచి ఖరీదు చేయగా మరో 35 లక్షల డోసుల టీకాలు కోవాక్స్ కార్యక్రమం కింద ఆ దేశానికి లభించాయి. రెండో విడత పంపిణీ ఎపుడు ప్రారంభించేదీ వైద్య నిపుణుల సూచనల మేరకు ప్రభుత్వం నిర్ణయిస్తుందని శ్రీలంక మంత్రి రమేశ్ పథిరణ తెలిపారు.
ప్రపంచంలోనే అతిపెద్ద టీకా తయారీ కేంద్రంగా అవతరించిన భారత్.. శ్రీలంకతో పాటు భూటాన్, మాల్దీవులు, బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్, సీషెల్స్, అఫ్గానిస్థాన్, మారిషస్ తదితర దేశాలకు కూడా కొవిడ్ టీకాలను అందచేస్తామని వాగ్దానం చేసింది.
ఇదీ చూడండి: ఓలికి ఎదురుదెబ్బ- ప్రతినిధుల సభ పునరుద్ధరణ