వంటింట్లో మంటలు- సలసల కాగుతున్న నూనె ధరలు
Breaking

దేశీయంగా నూనెల వినియోగం 2.5కోట్ల టన్నులు ఉంటే అందులో 1.55 కోట్ల టన్నుల వరకు విదేశాల నుంచే తెచ్చుకుంటున్నాం. దిగుమతుల విలువ దాదాపు రూ.80వేల కోట్లకు చేరువలో ఉంది. ఏటా నూనె గింజల సాగు, దిగుబడుల లక్ష్యాలను నిర్దేశించుకుంటున్నా గత ముప్ఫై ఏళ్లలో ఎన్నడూ వాటిని అందుకున్న పరిస్థితే లేదు.

వంట నూనెల ధరలు మండిపోతున్నాయి. దేశీయంగా నూనెగింజల ఉత్పత్తి పెరగకపోవడం, అంతర్జాతీయ విపణిలో గత ఎనిమిది నెలల్లో 60శాతం వరకు ధరలు ఎగబాకడంతో ఈ పరిస్థితి నెలకొంది. ఉక్రెయిన్‌, రష్యాల నుంచి పొద్దు తిరుగుడు నూనె; మలేసియా, ఇండొనేషియా నుంచి పామాయిల్‌ను భారత్‌ దిగుమతి చేసుకొంటోంది. దేశీయంగా నూనెల వినియోగం 2.5కోట్ల టన్నులు ఉంటే అందులో 1.55 కోట్ల టన్నుల వరకు విదేశాల నుంచే తెచ్చుకుంటున్నాం. దిగుమతుల విలువ దాదాపు రూ.80వేల కోట్లకు చేరువలో ఉంది. ఏటా నూనె గింజల సాగు, దిగుబడుల లక్ష్యాలను నిర్దేశించుకుంటున్నా గత ముప్ఫై ఏళ్లలో ఎన్నడూ వాటిని అందుకున్న పరిస్థితే లేదు.

అట్టడుగున వినియోగం

భారత్‌లో తలసరి వంటనూనె వినియోగం ఏటా 12 కిలోలు కాగా- ప్రపంచ సగటు 19 కిలోలు. దేశవ్యాప్తంగా ఏటా 2.5 కోట్ల టన్నుల వంట నూనెలు అవసరం కాగా, దేశీయంగా ఉత్పత్తి అవుతోంది కోటి టన్నులు మాత్రమే. అంటే దాదాపు 60 శాతానికి పైగా దిగుమతులపైనే ఆధారపడుతున్నాం. ఇటీవల కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ రాజ్యసభలో ఈ విషయాన్ని వెల్లడించారు. సోయాబీన్‌, నువ్వులు, ఆవ, పొద్దుతిరుగుడు, కుసుమ నూనెలను ప్రథమ ప్రాధాన్య నూనెలుగా, ఆయిల్‌పామ్‌, కొబ్బరి, రైస్‌ బ్రాన్‌, పత్తి నూనెలను ద్వితీయ ప్రాధాన్యాలుగా పేర్కొంటారు. ప్రస్తుతం దేశీయంగా ఉత్పత్తి అవుతున్న 3.80 కోట్ల టన్నుల నూనె గింజల ఉత్పత్తిని 2022-23 నాటికి 4.78 కోట్ల టన్నులకు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యం ప్రకారం 2030 నాటికి నూనె గింజల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించాల్సి ఉంది.

దేశంలో దాదాపు 2.67 కోట్ల హెక్టార్లలో నూనెగింజల పంటలు సాగవుతున్నాయి. దేశం మొత్తం పంట సాగు విస్తీర్ణంలో ఇది 12శాతం లోపే. 70శాతం పంటలు వర్షాధారితమే. గడచిన 20 ఏళ్లలో దాదాపు 40లక్షల హెక్టార్ల విస్తీర్ణం మాత్రమే పెరిగింది. అదే కాలంలో వినియోగం మాత్రం 70శాతం పెరిగింది. భారత్‌లోని మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, గుజరాత్‌, మహారాష్ట్రలోనే దాదాపు 72శాతం నూనెగింజల ఉత్పత్తి జరుగుతోంది. పలు రాష్ట్రాల్లో పంటకు అనువైన పరిస్థితులు ఉన్నా రైతులకు సరైన అవగాహన లేకపోవడం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగినంత ప్రోత్సాహం అందించకపోవడంతో పంటల విస్తీర్ణం ఏటా నాలుగు శాతం కూడా పెరగడం లేదు. అదే నూనె వినియోగం మాత్రం ఏటా 10 నుంచి 12 శాతం వరకు పెరుగుతోంది.

దేశంలో వంట నూనెల దిగుమతులు ఏటా 1.55 కోట్ల టన్నులు ఉంటే అందులో పామాయిలే 60శాతానికి పైగా ఉంది. మొత్తం ప్రపంచవ్యాప్తంగా వినియోగిస్తున్న పామాయిల్లో మన దేశం వాటాయే 20శాతం మేర ఉంది. దేశీయ అవసరాల్లో దాదాపు 96శాతం దిగుమతి చేసుకుంటున్నాం. ఇండొనేసియా, మలేసియా పామాయిల్‌ ఉత్పత్తిలో ఒకటి రెండు స్థానాల్లో ఉన్నాయి. ప్రపంచంలో ఉత్పత్తి అవుతున్న పామాయిల్‌లో 87శాతం ఆ రెండు దేశాల్లోనే జరుగుతోంది. మిగతా నూనెల ధరల కంటే దాదాపు 30-40శాతం తక్కువ ఉండటంతో అభివృద్ధి చెందుతున్న దేశాల్లో దీన్నే ఎక్కువగా వాడుతున్నారు. దేశీయంగా పామాయిల్‌ ఉత్పత్తిలో కర్ణాటక మొదటి స్థానంలో ఉండగా, ఏపీ, తెలంగాణలు రెండు మూడుస్థానాల్లోఉన్నాయి. మహారాష్ట్ర, బిహార్‌, ఒడిశా, తమిళనాడులోనూ పామాయిల్‌ పంట సాగవుతోంది. దీర్ఘ కాలంలో మంచి ఆదాయం సమకూరే పరిస్థితులు ఉన్నా... ఈ పంట వేసిన మూడు నాలుగేళ్ల వరకు ఎటువంటి ఆదాయం రాదు. అందుకే పంట విస్తీర్ణం ఆశించినంతగా పెరగడం లేదు. ప్రభుత్వాలు రాయితీలు ఇస్తున్నా అవి పామాయిల్‌ రైతులను పూర్తిగా ఆదుకునే స్థాయిలో లేవు.

cooking oil prices Rising day by day
వంట నూనెల ధరల వివరాలు

భారీ దిగుమతి సుంకాలు

దేశంలోకి దిగుమతి అవుతున్న ముడి, శుద్ధి చేసిన నూనెలపై కేంద్రం భారీగా సుంకాలు విధిస్తోంది. ముడి పామాయిల్‌పై కేంద్ర సుంకం నిరుడు 27.5శాతం ఉండగా తాజాగా అది 35.75శాతానికి చేరింది. మిగతా నూనెలపై సుంకాలు 35శాతం దాకా ఉన్నాయి. పేదలు, దిగువ మధ్య తరగతి ప్రజలు, వీధి వ్యాపారులు, హోటళ్లలో ఎక్కువ పామాయిల్‌ను వినియోగించడంతో ధరల పెరుగుదల భారం పేదలపైనే ఎక్కువగా పడుతోంది. అడ్డూ అదుపూ లేకుండా ధరలు పెరిగిపోవడంతో వారి కొనుగోలు శక్తి పడిపోతోంది. కష్టించి పని చేస్తే గానీ పూట గడవని పేదలు ఆహారంలో నూనెలు, కొవ్వులు తగినంత తీసుకోపోతే వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. వంట నూనెల ధరల పెరుగుదల- మధ్యాహ్న భోజనం మీద; చిన్న పిల్లలకు, బాలింతలకు ప్రభుత్వాలు అందిస్తున్న పథకాలపైన సైతం పడుతుంది. ఇదే అదనుగా కొందరు వ్యాపారులు కల్తీలకు బరితెగించే ప్రమాదమూ ఉంది. పెట్రో ఉత్పత్తుల ధరల పెరుగుదల సైతం వంట నూనెలపై తీవ్రంగా ఉంటోంది. విదేశాల నుంచి దిగుమతి అవుతున్న నూనెలు ముందుగా ఓడ రేవుల వద్దకు చేరతాయి. అక్కడ నుంచి రోడ్డు మార్గాల ద్వారా దేశీయ ఆయిల్‌ మిల్లులకు, అక్కడి నుంచి విక్రయ కేంద్రాలకు సరఫరా అవుతాయి. అంతర్జాతీయంగా ధరలు పెరుగుతున్న సమయంలో- దిగుమతి సుంకాలను కొంత మేరకు తగ్గిస్తేనే దేశంలోనూ ధరలు అదుపులోకి వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో పాటు నూనె గింజల సాగు విస్తీర్ణం, దిగుబడుల పెంపుపై ప్రభుత్వాలు దృష్టి సారించాలి. అప్పుడే నూనె గింజల రైతుల ఆదాయం పెరుగుతుంది. ధరల పెరుగుదలకు అడ్డుకట్ట పడి వినియోగదారులకూ ప్రయోజనం చేకూరుతుంది.

దిగుబడిలో వెనకబాటు

cooking oil prices Rising day by day
సలసల కాగుతున్న నూనె ధరలు

దిగుబడుల విషయంలో భారత్‌ ప్రపంచ సగటు కంటే బాగా వెనకబడి ఉంది. సోయాబీన్‌ దిగుబడి హెక్టారుకు ప్రపంచ సగటు 2.25టన్నులు ఉంటే మనదేశంలో అది 1.4టన్నుల లోపే ఉంది. పలు ఐరోపా దేశాల్లో 2.80 టన్నులుగా ఉంది. అంటే అక్కడ దిగుబడి మనకంటే రెట్టింపు ఉంది. పొద్దుతిరుగుడు పంట దిగుబడి ప్రపంచ సగటు హెక్టారుకు ఒకటిన్నర టన్నులు ఉండగా, మనదేశంలో 710 కిలోలు మాత్రమే. ప్రపంచంలో అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న ఉక్రెయిన్‌ 2.20 టన్నుల దిగుబడి సాధిస్తోంది. వేరుశెనగ దిగుబడి భారత్‌లో హెక్టారుకు 1.25 టన్నులు కాగా, అమెరికాలో అది 3.80 టన్నులు. అభివృద్ధి చెందిన దేశాల స్థాయిలో దిగుబడులు సాధిస్తే- దేశీయ వంట నూనెల అవసరాల్లో 70శాతం మనమే తీర్చుకోవచ్చు.

- ఎం.ఎస్‌.వి.త్రిమూర్తులు

    About us Privacy Policy
    Terms & Conditions Contact us

    • ETV
    • ETV
    • ETV
    • ETV

    Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
    ETV

    INSTALL APP

    ETV

    CHANGE STATE

    ETV

    SEARCH

    ETV

    MORE

      • About us
      • Privacy Policy
      • Terms & Conditions
      • Contact us
      • Feedback

      Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.