కరెంటు లెక్కలు.. రైతులకు తప్పని చిక్కులు!
Electricity

దేశీయ సాగు రంగంలో ఏటా 20 వేల కోట్లకుపైగా యూనిట్ల కరెంటు ఉపయోగిస్తున్నట్టు విద్యుత్​ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అంటే మొత్తం వినియోగంలో వ్యవసాయ రంగంలోనే సుమారు 18శాతం అన్నమాట. అయితే.. శాస్త్రీయతలేని లెక్కలతో పంపిణీ సంస్థలు తమ సరఫరాలోని అదనపు నష్టాలను, ఇతరత్రా లెక్కల్లోలేని వినియోగాన్ని ఈ రంగం ఖాతాలో చేర్చుతున్నారన్న ఆరోపణలున్నాయి. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. దీన్ని అరికట్టాల్నా, విద్యుత్​ వినియోగ వివరాలు స్పష్టంగా తెలియాలన్నా.. ప్రతి మోటారుకూ మీటరు బిగించాలి. ఫలితంగా కరెంటుతోపాటు నీటి వృథానూ అరికట్టవచ్చు. దీనివల్ల రైతులకే కాక దేశంలోని అన్ని వర్గాల ప్రజలకూ ఎంతో ప్రయోజనం చేకూరినట్లవుతుంది!

భారత వ్యవసాయ రంగంలో ఏటా 20,779 కోట్ల యూనిట్ల విద్యుత్తు వినియోగమవుతోందని కేంద్ర విద్యుత్‌ ప్రాధికార సంస్థ (సీఈఏ) గణాంకాలు చెబుతున్నాయి. మొత్తం విద్యుత్తు వినియోగంలో సాగు రంగం వాటా సుమారు 18శాతం. తెలుగు రాష్ట్రాల్లో రైతులు 35-40శాతం విద్యుత్తును వినియోగించుకొంటున్నారు. దేశంలో రెండు కోట్ల ఇరవై లక్షల వ్యవసాయ విద్యుత్‌ మోటార్లు (తెలంగాణలో 25 లక్షలు, ఆంధ్రప్రదేశ్‌లో 18 లక్షలు) ఉన్నాయి. విద్యుత్‌ వినియోగాన్ని లెక్కించేందుకు ఒక శాతానికి లోపు ఉన్న నమూనా మీటర్లపైనే ఆధారపడుతున్నారు.

ప్రతి మోటారుకూ మీటరు బిగిస్తేనే..

శాస్త్రీయత లేని లెక్కలతో పంపిణీ సంస్థలు తమ సరఫరాలోని అదనపు నష్టాలను, ఇతరత్రా లెక్క దొరకని వినియోగాన్ని వ్యవసాయ రంగం ఖాతాలో చేర్చి చూపిస్తున్నాయన్న ఆరోపణలూ ఉన్నాయి. అందువల్ల వ్యవసాయంలో విద్యుత్‌ వినియోగం వివరాలు నిర్దుష్టంగా తెలియాలన్నా- కరెంటుతో పాటు నీటి వృథాను అరికట్టాలన్నా ప్రతి మోటారుకూ మీటరు బిగించడం తప్పనిసరి. వ్యవసాయ విద్యుత్తు మోటార్లతో సహా అన్ని విభాగాల వినియోగదారుల నుంచి ప్రీ-పెయిడ్‌ మీటర్ల ద్వారా బిల్లులు వసూలు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైనా కేటగిరీలో వినియోగదారులకు ఉచిత విద్యుత్‌ వంటి రాయితీలు ఇవ్వాలనుకుంటే సొమ్మును వారి బ్యాంకు ఖాతాలకు 'డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌ (డీబీటీ)' విధానం ద్వారా చెల్లించాలని కేంద్రం సూచించింది. ఈ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేస్తే పంపిణీ నష్టాలు తగ్గి, రెవిన్యూ వసూళ్లు పెరుగుతాయని, దీంతో సంబంధిత పంపిణీ సంస్థలను నష్టాలనుంచి గట్టెక్కించవచ్చనేది కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం.

తప్పని వ్యయప్రయాసలు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1983వరకు వ్యవసాయ మోటార్లకు మీటర్లు ఉండగా, వాటి వల్ల రైతులు పడుతున్న ఇబ్బందిని గుర్తించిన అప్పటి ముఖ్యమంత్రి ఎన్‌టీఆర్‌ వాటిని రద్దు చేశారు. మోటారు సామర్థ్యాన్ని బట్టి ఒక హార్స్‌ పవర్‌(హెచ్‌పీ)కి సంవత్సరానికి 50 రూపాయల చొప్పున స్లాబ్‌ విధానం ప్రవేశపెట్టారు. తదనంతరం వచ్చిన ప్రభుత్వాలు మొత్తం ఉచితమని ప్రకటించి, విద్యుత్‌ సంస్థల నష్టాన్ని రాయితీ రూపంలో పూడ్చుతూ వస్తున్నాయి. మిగతా రాష్ట్రాల్లోనూ వ్యవసాయానికి నామమాత్రపు ఛార్జీలు ఉన్నాయి. మోటార్ల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరుగుతూ దశాబ్దకాలంగా రెట్టింపు కావడంవల్ల వీటికి మీటర్లు అమర్చడం, తదనంతర సేవలు అందించడం ఎంతో కష్టంగా మారింది. ఈ ప్రక్రియ వ్యయప్రయాసలతో కూడుకొన్నది కావడంతో పంపిణీ సంస్థలు ఏమాత్రం ఆసక్తి చూపడం లేదు. ఇప్పుడు కేంద్రప్రభుత్వం విద్యుత్‌ చట్టం-2003 సవరణల్లో వ్యవసాయ మోటార్లతో సహా, ప్రతి సర్వీసుకు ప్రీపెయిడ్‌ మీటరు బిగించడం తప్పనిసరి చేసింది. దాన్ని పాటించని సంస్థలకు నిధులు నిలిపివేస్తామని ప్రకటించడంతో రాష్ట్రాలు అయోమయ స్థితిలో పడ్డాయి.ఒక్క వ్యవసాయ విద్యుత్‌ మోటారు ప్రీ-పెయిడ్‌ మీటరు ఖర్చు రూ.8,000 ఉండగా; అదనంగా బోరుబావి వద్ద స్టాండ్‌, బాక్స్‌, వైర్లకు మరో రెండు వేల రూపాయలు ఖర్చయ్యే అవకాశం ఉంది. ఆ లెక్కన తెలంగాణకు రూ.2,500 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌కు రూ.1,800 కోట్లు, దేశవ్యాప్తంగా రూ.22 వేల కోట్లు అవసరమవుతుంది.

మీటర్లకు కరవైన రక్షణ..

ప్రతి నెలా రీడింగ్‌ ప్రకారం బిల్లులు అందజేసేందుకు, వసూళ్లకు పెద్దయెత్తున సిబ్బందిని నియమించాల్సి వస్తుంది. వ్యవసాయ విద్యుత్‌ మోటార్ల మీటర్లు పొలాల్లో బహిరంగంగా ఉండటంవల్ల వాతావరణంలో సంభవించే మార్పులకు అవి పాడయ్యే అవకాశం ఉంటుంది. పొలంవద్ద మీటర్లకు రక్షణ కరవవుతోంది. మీటర్‌ కాలిపోవడం లేదా చోరీకి గురికావడం రైతుకు అదనపు భారంగా పరిణమిస్తోంది. వ్యవసాయ మోటార్లకు ప్రీ-పెయిడ్‌ మీటర్లు బిగించాలనే కేంద్ర ప్రభుత్వ నిబంధనల అమలు దేశంలోనే మొట్టమొదట ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తలకెత్తుకొంది. శ్రీకాకుళం జిల్లా నమూనాగా సుమారు 32వేల మోటార్లకు మీటర్లు బిగించేందుకు శ్రీకారం చుట్టింది. కాలువలు, చెరువుల కింద సమృద్ధిగా నీటి లభ్యత ఉన్న పొలాల రైతులతో పోల్చినప్పుడు; బోరు లేదా బావులతో వ్యవసాయం చేసే రైతులకు అయ్యే సాగు వ్యయం ఎంతో ఎక్కువ. అలాంటివారి నుంచి బిల్లులు వసూలు చేయడం వారిపై మరింత భారం మోపినట్లవుతుంది. వ్యవసాయ విద్యుత్‌ వినియోగం లెక్కింపు కోసం మాత్రమే అయితే ప్రతి మోటారుకూ మీటరు బిగించాల్సిన అవసరం లేదు. ట్రాన్స్‌ఫార్మర్‌ వద్ద లేదా ఇప్పటికే ఉన్న కొన్ని ప్రత్యేక 11కేవీ వ్యవసాయ విద్యుత్‌ ఫీడర్లు; 33/11కేవీ ఉప కేంద్రాల వద్దే మీటర్లు ఏర్పాటు చేయవచ్చు. మిగిలిన ఫీడర్లకూ స్వల్ప నిధులతో వ్యవసాయ ట్రాన్స్‌ఫార్మర్లను విడదీసి, 11కేవీ ప్రధాన లేదా సబ్‌ లైన్లలో మీటర్లు బిగించవచ్చు. వీటి పరిమాణం తక్కువ ఉండటంవల్ల ఇందుకయ్యే వ్యయమూ తక్కువే. తదనంతర నిర్వహణా సులభతరమవుతుంది. ఈ విధానం గుజరాత్‌ వంటి రాష్ట్రాల్లో అమలులో ఉంది.

బహుళ ప్రయోజనాలు

రైతులకు ఉచిత లేదా నామమాత్రపు ధరకు విద్యుత్‌ అందించడంతో ఇబ్బడిముబ్బడిగా బోర్లు తవ్వడం, అవసరానికి మించి నీరు తోడటంతో ఎంతో విద్యుత్తు వృథా అవుతోంది. భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. నీటి వృథాను అరికట్టాలంటే రైతులకు బిందుసేద్యం వంటి మెలకువలు నేర్పించాలి. ఇష్టానుసారంగా బోర్లు వేయకుండా వాల్టా (వాటర్‌, ల్యాండ్‌ అండ్‌ ట్రీ)-2003 చట్టాన్ని పకడ్బందీగా అమలుపరచాలి. వ్యవసాయ విద్యుత్‌ వాడకంలోని నాసిరకం మోటార్లను తొలగించి బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫిషియన్సీకి చెందిన 'ఫైవ్‌ స్టార్‌' మోటార్లను ఏర్పాటు చేస్తే- దేశవ్యాప్తంగా సంవత్సరానికి సుమారు అయిదున్నర వేల కోట్ల యూనిట్లకు పైగా (40శాతం) విద్యుత్తును ఆదా చేయవచ్చు. తద్వారా 28వేల కోట్ల రూపాయలు మిగలడమే కాకుండా- ఆ మేరకు ఉత్పత్తినీ తగ్గించుకునే వెసులుబాటు ఉంటుంది. పర్యావరణపరంగా నాలుగు కోట్ల టన్నుల హానికర కర్బన ఉద్గారాలు వాతావరణంలో కలవకుండా నివారించవచ్చు. దీనివల్ల రైతులకే కాక, దేశంలోని అన్ని వర్గాల ప్రజలకూ ఎంతో ప్రయోజనం చేకూరినట్లవుతుంది!

- ఇనుగుర్తి శ్రీనివాసాచారి, రచయిత-విద్యుత్‌, ఇంధన రంగ నిపుణులు

ఇదీ చదవండి: యూపీలో ఘోర ప్రమాదం: ఏడుగురు మృతి

    About us Privacy Policy
    Terms & Conditions Contact us

    • ETV
    • ETV
    • ETV
    • ETV

    Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
    ETV

    INSTALL APP

    ETV

    CHANGE STATE

    ETV

    SEARCH

    ETV

    MORE

      • About us
      • Privacy Policy
      • Terms & Conditions
      • Contact us
      • Feedback

      Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.