
ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం వేదికగా భారత్- ఇంగ్లాండ్ మధ్య మూడో టెస్ట్‌కు రంగం సిద్ధమైంది. ప్రపంచటెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్స్ లక్ష్యంగా జరగనున్న ఈ గులాబీ పోరులో విజయం సాధించాలని ఇరుజట్లు గట్టి పట్టుదలతో ఉన్నాయి. ఇప్పటి వరకూ రెండు డే నైట్ టెస్ట్‌లు ఆడిన టీమ్ఇండియా.. బంగ్లాదేశ్‌పై గెలిచి, ఆస్ట్రేలియాతో ఓడింది. ఇప్పుడు ఇంగ్లాండ్‌తో మూడో డే నైట్ టెస్ట్‌లో గెలుపొంది సిరీస్ సహా డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలని భావిస్తోంది. మ్యాచ్ బుధవారం మధ్యాహ్నం రెండున్నరకు ప్రారంభం కానుంది.
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్‌లో చోటు సంపాదించడమే లక్ష్యంగా మొతేరా వేదికగా జరిగే మూడో టెస్ట్‌లో భారత్, ఇంగ్లాండ్ జట్లు తలపడనున్నాయి. చెన్నైలో జరిగిన తొలి రెండు టెస్టుల్లో చెరొకటి గెలిచిన ఇరుజట్లు ఎల్‌ఈడీ లైట్ల మధ్య పింక్ బాల్‌తో జరిగే ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌తో పాటు టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలని భావిస్తున్నాయి.
ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియమైన.. మొతెరాలో మధ్యాహ్నం 2.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
మూడో పేసర్‌ను తీసుకుంటారా?
టీమిండియాకు సంబంధించి ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ బరిలో దిగనుండగా ఆ తర్వాతి స్థానాల్లో పుజారా, కోహ్లీ, రహానే, రిషబ్ పంత్ వచ్చే అవకాశముంది. బౌలింగ్ విభాగంలో సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా బరిలో దిగనున్నారు. డేనైట్ టెస్ట్ కావటంతో మూడో పేసర్‌ను తీసుకుంటారా లేదా స్పిన్నర్‌తో వెళ్తారా అనేది ఆసక్తికరంగా మారింది. మూడో పేసర్‌ను తీసుకోవాల్సి వస్తే ఉమేష్, సిరాజ్‌లలో టీమ్ మేనేజ్మెంట్ ఎవరివైపు మొగ్గుచూపుతుందనేది ప్రాధాన్యం సంతరించుకుంది. స్పిన్నర్ల కోటాలో అశ్విన్, అక్షర్ పటేల్ ఆడనున్నారు.
ఇంగ్లాండ్ టీంలో స్వదేశానికి వెళ్లిన మెయిన్ అలీ స్థానంలో డామ్‌బెస్ జట్టులో చేరనున్నాడు. ఇతనికి జతగా జాక్‌లీచ్ స్పిన్ బాధ్యతలు మోసే అవకాశముంది. ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో అండర్సన్, జోఫ్రా ఆర్చర్‌కు తోడుగా బ్రాడ్ లేదా మార్క్ వుడ్‌లలో ఒకరు బరిలో దిగే అవకాశముంది. రోరీ బర్న్స్ స్థానంలో జాక్ క్రాలీ, డాన్ లారెన్స్ స్థానంలో జానీ బెయిర్ స్టో మ్యాచ్‌లో ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే పునర్నిర్మాణం చేసిన మొతెరాలో జరుగుతున్న తొలి అంతర్జాతీయ మ్యాచ్ కావటంతో కొత్త పిచ్ ఎలా స్పందిస్తుందో అన్నది ఆసక్తిగా మారింది. దీంతో పాటు డేనైట్ టెస్ట్ మ్యాచ్ కావటం వల్ల ఆఖరి సెషన్లో కురిసే మంచు సైతం కీలకంగా మారనుంది.
ఇరు జట్లకు కీలకం..
మరోవైపు ఈ టెస్టు ఇరు జట్లకు అత్యంత కీలకమైంది. 4 టెస్టుల సిరీస్‌లో ఇంగ్లాండ్, భారత్ చెరో విజయం సాధించి సిరీస్‌ను సమం చేశాయి. లార్డ్స్ వేదికగా జరగనున్న టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్‌కు న్యూజిలాండ్ ఇప్పటికే చేరుకుంది. కోహ్లీసేన ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో న్యూజిలాండ్‌తో తలపడాలంటే మిగిలిన రెండు టెస్టుల్లో ఒకటి గెలిచి, మరొకటి డ్రా చేసుకోవాలి. లేదా రెండూ గెలవాలి. ఇంగ్లాండ్ ఫైనల్‌కు చేరుకోవాలంటే మిగిలిన రెండు టెస్టుల్లోనూ గెలవాల్సిఉంది. ఒకవేళ ఈ సిరీస్ డ్రాగా ముగిస్తే ఆస్ట్రేలియా ఫైనల్‌కు చేరుతుంది.
గత రికార్డులు..
గతంలో పలు రికార్డులకు వేదికైన ఈ మొతెరా స్టేడియం పునర్ నిర్మితమైన తర్వాత ఆతిథ్యమివ్వనున్న తొలి మ్యాచ్‌లో సైతం పలు రికార్డులకు సాక్ష్యంగా నిలవనుంది. ఇంగ్లండ్‌తో మూడో టెస్ట్ ద్వారా దిగ్గజ ఆల్‌రౌండర్ కపిల్ దేవ్ తర్వాత భారత్ తరఫున వంద టెస్ట్‌లు ఆడిన పేసర్‌గా ఇషాంత్ శర్మ నిలవనున్నాడు. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే స్వదేశంలో అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్‌గా ధోనిని కోహ్లీ అధిగమిస్తాడు. ధోనీ నేతృత్వంలో టీమిండియా స్వదేశంలో 21 టెస్టుల్లో గెలుపొందింది. గతంలో ఇదే స్టేడియంలో సునీల్ గావస్కర్ టెస్ట్‌ల్లో పదివేల పరుగులు పూర్తిచేసుకున్నాడు. కపిల్ దేవ్ 83 పరుగులకు తొమ్మిది వికెట్లతో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసుకుంది సైతం మొతెరాలోనే.
అశ్విన్ సైతం.. మరో ఆరు వికెట్లు తీస్తే టెస్టుల్లో 400 వికెట్ల మైలురాయిని చేరుకుంటాడు.
జట్లు:
భారత్:
విరాట్ కోహ్లీ(కెప్టెన్), రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్, శుభ్‌మన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా, ఆజింక్య రహానె(వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్య, రిషభ్ పంత్(వికెట్ కీపర్), వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), ఆర్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, ఇషాంత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్.
ఇంగ్లాండ్:
జో రూట్(కెప్టెన్), జేమ్స్ అండర్సన్, జోఫ్రా ఆర్చర్, జానీ బెయిర్ స్టో, డామినిక్ బెస్, స్టువర్ట్ బ్రాడ్, రోరీ బర్న్స్, జాక్ క్రావ్లే, బెన్ ఫోక్స్, డాన్ లారెన్స్, జాక్ లీచ్, ఒల్లీ పోప్, డామ్ సిబ్లీ, బెన్ స్టోక్స్, ఒల్లీ స్టోన్, క్రిస్ వోక్స్, మార్క్ ఉడ్.
ఇదీ చదవండి: గులాబీ బంతి.. ఎందుకింత స్పెషల్?