
గుజరాత్ అహ్మదాబాద్‌లోని పునర్నిర్మించిన సర్దార్ పటేల్ గుజరాత్ స్టేడియాన్ని బుధవారం.. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రారంభించనున్నారు. ప్రధాని మోదీ వర్చువల్‌గా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ మైదానమైన మొతెరా స్టేడియాన్ని బుధవారం (ఫిబ్రవరి 24న) రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అధికారికంగా ప్రారంభించనున్నారు. హోం మంత్రి అమిత్ షాతో పాటు క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజిజు హాజరవుతారు. ప్రధాని మోదీ వర్చువల్‌గా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
స్టేడియం విశేషాలు..
- గుజరాత్‌లోని సబర్మతి నది ఒడ్డున ఈ స్టేడియాన్ని తొలుత 1982లో నిర్మించారు. 2015లో దీన్ని కూల్చేసి.. దాదాపు రూ.800 కోట్లతో తిరిగి నిర్మించారు. దానికి సర్దార్ పటేల్ గుజరాత్ స్టేడియంగా నామకరణం చేశారు.
- 63 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ మైదానంలో.. ఒకేసారి లక్షా పదివేల మంది కూర్చొనే సామర్థ్యం ఉంది. ఎల్ఈడీ బల్బులు ఏర్పాటు చేసిన మొట్టమొదటి మైదానం ఇదే. వీటిని కూడా ఫ్లడ్లైట్లుగా కాకుండా స్టేడియం పైకప్పుకు అమర్చారు.
- ఇంతకాలం 90వేల సామర్థ్యంతో ఉన్న మెల్బోర్న్ క్రికెట్ స్టేడియం ప్రపంచంలో అతిపెద్ద మైదానంగా ఉండేది. ఇప్పుడు దాని స్థానాన్ని మొతెరా అధిగమించనుంది.
- మూడు వేల కార్లు, పదివేల ద్విచక్ర వాహనాలకు సరిపోయేలా పార్కింగ్ స్థలాన్ని ఈ స్టేడియానికి కేటాయించారు. ఎంత భారీ వర్షం కురిసిన నిమిషాల్లో తిరిగి మ్యాచ్‌ను నిర్వహించేలా డ్రైనింగ్ వ్యవస్థను రూపొందించారు.
పునర్నిర్మాణం తర్వాత ఈ స్టేడియంలో భారత్, ఇంగ్లాండ్‌ల మధ్య మూడో టెస్టు జరగనుంది. నాలుగో టెస్టుకు కూడా ఇదే వేదిక. ఇరు జట్ల మధ్య 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు సంబంధించి అన్ని మ్యాచ్‌లు ఇదే మైదానంలో జరగనున్నాయి.
ఇదీ చదవండి: హైదరాబాద్‌లో యూసుఫ్ పఠాన్ క్రికెట్ అకాడమీ