నాలుగు ఎన్నికలు కలిపి మొత్తంగా 80.62 శాతం పోలింగ్ నమోదు
fourth

చిత్తూరు జిల్లాలో నాలుగో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. జిల్లా వ్యాప్తంగా చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ సజావుగా జరిగింది. 221 పంచాయతీల్లో పోలింగ్ శాతం మొత్తం 78.77 శాతం నమోదు కాగా...కౌంటింగ్ ప్రక్రియ సాగుతోంది.

పంచాయతీ ఎన్నికల ఘట్టం ముగిసింది. తొలి మూడు దశలతో పోలిస్తే నాలుగో దశ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరారు. నాలుగో విడతలో మొత్తం 375 పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా అందులో 154 పంచాయతీలకు సర్పంచులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన 221 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. తిరుపతి డివిజన్‌ పరిధిలోని 14 మండలాల్లో వివిధ కారణాలతో ఎన్నికలు నిలిచిపోయాయి. పులిచెర్ల మండలంలోని 23 పంచాయతీలు ఏకగ్రీవం కావడంతో అక్కడ ఎన్నికలు జరగలేదు. నాలుగో విడతలో 78.77 శాతం పోలింగ్‌ జరిగింది. సమస్యాత్మక ప్రాంతాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి బందోబస్తు ఏర్పాటు చేయడంతో ఎన్నికలు, లెక్కింపు ప్రశాంతంగా జరిగింది. ఉదయం 8.30 గంటల ప్రాంతానికి 12.40 శాతమే పోలింగ్‌ నమోదైంది. ప్రారంభంలో కొన్ని ప్రాంతాల్లో వర్షం పడింది. ఓటర్లు ఓటేసేందుకు ఆసక్తి చూపలేదు. పోలింగ్‌ కేంద్రాలను జిల్లా కలెక్టర్‌ హరినారాయణన్, జేసీలు మార్కండేయులు, వీరబ్రహ్మం, ఆర్డీవో కనకనరసారెడ్డి పరిశీలించారు.

చిన్నచిన్న సంఘటనలే..

ఎన్నికల సమయంలో చిన్నచిన్న సంఘటనలు చోటు చేసుకున్నాయి. సత్యవేడు మండల పరిధిలోని చేరివి పోలింగ్‌ కేంద్రంలో అధికారులు వైకాపా మద్దతు అభ్యర్థికి ఓటు వేయాలని ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని పేర్కొంటూ తెదేపా మద్దతుదారులు ఆరోపించారు. ఈ మేరకు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారిని పక్కనబెట్టారు. ఇరుగులం పంచాయతీ పరిధిలో అధికార పార్టీ అభ్యర్థులు గుంపుగా ఉండి ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని తెదేపా మద్దతుదారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వారిని అక్కడి నుంచి పంపించివేశారు. శ్రీకాళహస్తి మండలం ఎంపేడు పోలింగ్‌ కేంద్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీ మద్దతు ఏజెంట్ల మధ్య గొడవ జరిగింది. వెంటనే పోలింగ్‌ను అరగంట పాటు నిలిపివేశారు. అదనపు బలగాలు వచ్చిన తర్వాత మళ్లీ ఓటింగ్‌ ప్రారంభించారు. చంద్రగిరి మండలం కందులవారిపల్లె పరిధిలో కొందరు వ్యక్తులు బయటి నుంచి వచ్చి దొంగ ఓట్లు వేసేందుకు ప్రయత్నించారు. గమనించిన తెదేపా మద్దతుదారులు వెంటనే ఎస్‌ఈసీˆ కంట్రోల్‌రూంకు ఫిర్యాదు చేశారు. డీఎస్పీతోపాటు ప్రత్యేక బలగాలు అక్కడకు చేరుకోవడంతో ఓటింగ్‌ ప్రశాంతంగా జరిగింది.

విజయవంతం

ప్రభుత్వ శాఖల సహకారంతో.. ప్రశాంత వాతావరణంలో నాలుగో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించామని జిల్లా పాలనాధికారి హరినారాయణన్‌ పేర్కొన్నారు. తిరుపతి డివిజన్‌ పరిధిలో ఎన్నికల విజయవంతానికి కృషి చేసిన అధికారులకు ఆయన అభినందనలు తెలిపారు. త్వరలో జరగనున్న మున్సిపల్‌ ఎన్నికల్లో కూడా ప్రజలు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. మున్సిపల్‌ ఎన్నికల విజయవంతానికి అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది తమ వంతు సహాయ సహకారాలను అందించాలన్నారు.

అమ్మభాషను మరవొద్దు

పంచాయతీ ఎన్నికల సందర్భంగా తిరుపతి రూరల్‌ మండలం పుదిపట్లలో ఈశ్వరయ్య కుటుంబసభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా ఓటర్లకు శుభాకాంక్షలు తెలుపుతూ మాతృభాష గొప్పతనాన్ని వివరించారు.

రాష్ట్రస్థాయిలో తొమ్మిదో స్థానం

పంచాయతీ ఎన్నికల అంకానికి ఆదివారంతో తెరపడింది. నాలుగు విడతలుగా సాగిన ఎన్నికల్లో పోలింగ్‌ ప్రక్రియలో హెచ్చుతగ్గులు నమోదయ్యాయి. గ్రామీణ ఓటర్లు క్యూ కట్టారు.. వివిధ ప్రాంతాల్లో ఉంటున్న వారు సైతం సొంత గ్రామాలకు చేరుకుని తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు.. ఎన్నికల్లో జిల్లాలో 80.62 శాతం సరాసరి పోలింగ్‌ నమోదైంది.. రాష్ట్ర స్థాయిలో పరిశీలిస్తే జిల్లాకు తొమ్మిదో స్థానం దక్కింది. జిల్లాలో మొదటి విడత ఎన్నికలు చిత్తూరు డివిజన్‌లో జరిగాయి. 20 మండలాలున్న ఈ డివిజన్‌లో 83.47 శాతం పోలింగ్‌ నమోదైంది. నాలుగు విడతల్లో జరిగిన పోలింగ్‌ను పరిశీలిస్తే చిత్తూరు డివిజన్‌లోనే అత్యధిక పోలింగ్‌ శాతం జరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. రెండో విడతలో పోలింగ్‌ కాస్త తగ్గింది. మదనపల్లె డివిజన్‌ పరిధిలోని 17 మండలాల్లో 77.20 శాతం నమోదు కావడం గమనార్హం. మూడో విడత పోలింగ్‌ మదనపల్లెలోని 13 మండలాల్లో 83.04 శాతం నమోదైంది. నాలుగో విడతలో తిరుపతి డివిజన్‌లోని 13 మండలాల్లో పోలింగ్‌ శాతం 78.77 శాతంగా ఉంది.

ఇదీ చూడండి:

చిత్తూరు జిల్లా : నాలుగోదశ పంచాయతీ ఎన్నికల ఫలితాలు

    About us Privacy Policy
    Terms & Conditions Contact us

    • ETV
    • ETV
    • ETV
    • ETV

    Copyright © 2019 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
    ETV

    INSTALL APP

    ETV

    CHANGE STATE

    ETV

    SEARCH

    ETV

    MORE

      • About us
      • Privacy Policy
      • Terms & Conditions
      • Contact us
      • Feedback

      Copyright © 2019 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.