తెలంగాణలో గుంటూరు జిల్లాకు చెందిన అన్నదమ్ముల మృతి
telangana

కారు బోల్తా పడి ఏపీకి చెందిన ఇద్దరు బంగారం వ్యాపారులు మృతి చెందిన విషాద ఘటన తెలంగాణ పెద్దపల్లి జిల్లా మల్యాలపల్లి వద్ద చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. డ్రైవర్​ నిద్రమత్తులో ఉండడమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా తేల్చారు.

వ్యాపార నిర్వహణ కోసం బాడుగ కారుల్లో ప్రయాణిస్తుంటే తరచూ రహదారి ప్రమాదాలు జరుగుతున్నాయని సొంత వాహనంలో బయల్దేరినా వారికి మృత్యువు తప్పలేదు. అన్నదమ్ములైన వ్యాపారులను రహదారి ప్రమాదం పొట్టన బెట్టుకుంది. తెలంగాణ పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం మల్యాలపల్లి వద్ద జరిగిన ప్రమాదంలో ఏపీలోని గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన బంగారం వర్తకులు, అన్నదమ్ములు కొత్త శ్రీనివాసరావు (55), రాంబాబు (45) కన్నుమూశారు. మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఈ దుర్ఘటనలో వారి గుమస్తా గుండా సంతోష్‌, కారు డ్రైవర్‌ డి.సంతోష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. రాజీవ్‌ రహదారిపై డివైడర్‌ను కారు ఢీకొనడంతోపాటు వంద అడుగుల దూరంలో ఉన్న సూచిక బోర్డు సిమెంటు గద్దెను బలంగా తాకి పక్కనున్న కాల్వలోకి పడిపోయింది.

మొదటినుంచి ప్రమాదాల భయమే..

అన్నదమ్ములు చెన్నై తదితర ప్రాంతాల్లో బంగారాన్ని కొనుగోలు చేసి ఆభరణాలు తయారు చేయిస్తుంటారు. వాటిని తెలుగు రాష్ట్రాల్లో విక్రయిస్తుంటారు. వ్యాపార పనుల్లో భాగంగా ప్రయాణిస్తున్నప్పుడు ఇప్పటికే ఈ ఇద్దరు సోదరులతోపాటు స్వయానా వారి పెద్దన్న నాగేశ్వరరావు ప్రయాణించే కార్లు పలుమార్లు ప్రమాదాలకు గురయ్యాయి. అద్దె కార్లలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని భావించి వారి బంధువు ఒకరికి పెట్టుబడి పెట్టి కారు కొనుగోలు చేయించారని కుటుంబీకులు తెలిపారు. ఈ కారులో మంగళవారం పెద్దపల్లికి వెళుతుండగా ప్రమాదం జరగటంతో బాధిత కుటుంబీకులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఇంటినుంచి బయలుదేరిన కొన్ని గంటల వ్యవధిలోనే కానరాని లోకాలకు చేరారని రోదిస్తున్నారు. మృతుడు శ్రీనివాసరావుకు భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. రాంబాబుకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.

నాలుగేళ్ల కిందట ప్రమాదంలో కుమారుడి మృతి

నాగేశ్వరరావు కుమారుడు రాజేష్‌ వ్యాపార నిమిత్తం చెన్నై వెళ్లి వస్తుండగా నాలుగేళ్ల కిందట రైలు ప్రమాదంలో చనిపోయారు. ముగ్గురు అన్నదమ్ములు కలిసి వ్యాపారం చేస్తున్నారు. తన కుమారుడితో పాటు తమ్ముళ్లు ప్రమాదాల్లో మరణించడాన్ని జీర్ణించుకోలేక నాగేశ్వరరావు బోరున విలపిస్తున్నారు.

బంగారం అప్పగించిన 108 సిబ్బంది

ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే 108 సిబ్బంది చేరుకొని వైద్యసేవలు అందించడంతో పాటు క్షతగాత్రుల నుంచి కిలో బంగారాన్ని స్వాధీనం చేసుకొని పోలీసులకు అప్పగించారు. సంఘటన స్థలం నుంచి మొత్తంగా 3.3కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ కరుణాకర్‌రావు తెలిపారు. ఇద్దరు క్షతగాత్రులను తరలిస్తున్న క్రమంలో గుమాస్తా సంతోష్‌ జేబు ఉబ్బెత్తుగా ఉండటాన్ని 108 సిబ్బంది తోట రాజేందర్‌, అబ్దుల్‌ చాంద్‌లు గమనించారు. అందులో కిలో బరువున్న బంగారు ఆభరణాలను గుర్తించి పోలీసులకు అందజేశారు. గతంలోనూ ఈ ఇద్దరు 108 ఉద్యోగులు రెండు ప్రమాద సంఘటనల్లో రూ.4.5 లక్షల నగదు, 5 తులాల బంగారు ఆభరణాలను బాధిత కుటుంబాలకు అందజేశారు.

3 కాదు 5 కిలోలుండాలి

మృతుల బంధువులు తమ వారి వద్ద 5 కిలోల 600 గ్రాముల బంగారం ఉండాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతదేహాలను, క్షతగాత్రులను తరలించిన అంబులెన్స్ సిబ్బందిని విచారిస్తున్నామని రామగుండం సీఐ కరుణాకర్ రావు తెలిపారు.

ఇదీ చదవండి: మద్యం మత్తులో ఘర్షణ... బాణాలతో దాడి... ఒకరు మృతి

    About us Privacy Policy
    Terms & Conditions Contact us

    • ETV
    • ETV
    • ETV
    • ETV

    Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
    ETV

    INSTALL APP

    ETV

    CHANGE STATE

    ETV

    SEARCH

    ETV

    MORE

      • About us
      • Privacy Policy
      • Terms & Conditions
      • Contact us
      • Feedback

      Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.