
గుంటూరు జిల్లా పెదకూరపాడు గ్రామ పంచాయతీలోని ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద వైకాపా నేతలు ఆందోళన చేపట్టారు. తుది విడత పంచాయతీ ఎన్నికల్లో తెదేపా అభ్యర్థి గెలుపొందటంతో రీకౌంటింగ్ నిర్వహించాలంటూ ధర్నాకు దిగారు.
గుంటూరు జిల్లా పెదకూరపాడులోని ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద వైకాపా నేతలు ధర్నా చేపట్టారు. తుది దశ పంచాయతీ పోరులో తెదేపా మద్దతుదారుడు గుడిపూడి రాజు 10 ఓట్లతో గెలుపొందారు. దీంతో రీకౌంటింగ్ చేయాలని వైకాపా సానుభూతిపరురాలు మహాలక్ష్మి పట్టుబట్టారు. అర్ధరాత్రి మళ్లీ కౌంటింగ్ నిర్వహించగా.. మహాలక్ష్మి 2 ఓట్ల ఆధిక్యంలో నిలిచారు. మళ్లీ ఓట్ల లెక్కింపు జరపాలని తెదేపా అభ్యర్థులు ఆందోళన చేశారు. రెండోసారి నిర్వహించిన రీకౌంటింగ్‌లో గుడిపూడి రాజు నాలుగు ఓట్ల తేడాతో విజయం సాధించారు.
రాజుకు ఆర్వో ధ్రువీకరణ పత్రం అందజేశారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన వైకాపా నాయకులు, కార్యకర్తలు మరల రీకౌంటింగ్ చేయాలంటూ ధర్నాకు దిగారు. సిబ్బంది బయటకు వెళ్లకుండా గేటు వద్దే బైఠాయించారు. ఎన్నికల అధికారులు తమకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అభ్యర్థి బంధువు ఒకరు కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. పెద్ద ఎత్తున పోలీసులు అక్కడకు చేరుకుని బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండి: బహిరంగ చర్చకు వస్తే నిరూపిస్తాం: భాజాపా రాష్ట్ర కార్యదర్శి