
విజయవాడ కొత్తాసుపత్రి ప్రాంగణంలో నిర్మించిన సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రిలో సేవలు అందుబాటులోకి రాలేదు. 2016లో మొదలైన ఈ హాస్పిటల్ నిర్మాణం 2020 మార్చిలో ఆరంభమైంది. కొవిడ్ సమయం కావటంతో.. కరోనా రోగుల చికిత్స కోసం దీన్ని ఉపయోగించారు. వైరస్ కేసులు తగ్గుముఖం పట్టాయి. ఇప్పటికైనా సూపర్‌స్పెషాలిటీ సేవలు ప్రారంభిస్తారేమోనని ప్రజలు ఎదురుచూస్తున్నారు.
విజయవాడ కొత్తాసుపత్రి ప్రాంగణంలో ఐదంతస్తుల్లో నిర్మించిన సూపర్‌స్పెషాలిటీ సేవలు.. ప్రజలకు అందని ద్రాక్షలానే మారుతున్నాయి. 240 పడకలు, తొమ్మిది విభాగాలుగా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించారు. 2017లో అత్యవసరంగా అందుబాటులోనికి తీసుకొస్తామంటూ చెప్పారు. 2020 జనవరిలో ఎట్టిపరిస్థితుల్లోనైనా సేవలను అందుబాటులోనికి తీసుకొస్తామంటూ.. ప్రకటించారు. మార్చి నుంచి కొవిడ్ సమయం ఆరంభమవ్వడంతో పూర్తిగా పక్కనపెట్టేశారు. ఐదంతస్థుల భవనాన్ని సూపర్‌స్పెషాలిటీ సేవల కంటే ముందే.. కొవిడ్ కోసం వినియోగించాల్సి వచ్చింది. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో కొత్తాసుపత్రిలో సాధారణ సేవలు ప్రారంభించారు. ఇప్పటికైనా సూపర్ స్పెషాలిటీ సేవలపై దృష్టిసారించాలి. కొత్తాసుపత్రిలో 2016 జూన్ 2న రూ.150 కోట్లతో సూపర్‌స్పెషాలిటీ బ్లాక్ నిర్మాణ పనులను అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఆరంభించింది. భవనం నిర్మాణం అనుకున్నట్టుగానే త్వరితగతిన ఏడాదిలో పూర్తి చేసినా.. తర్వాత లోపల ఏర్పాట్లు, పరికరాల కొనుగోళ్లు లాంటివి తీవ్ర జాప్యం జరిగాయి. ఎట్టకేలకు అన్ని పనులు 2019 డిసెంబర్ నాటికి పూర్తిచేశారు. ఐదంతస్తుల్లో వైద్య పరీక్షల పరికరాలు, రోగులకు అవసరమైన మంచాలు, వెయిటింగ్ హాళ్లు, వైద్యుల గదులు, అత్యవసర విభాగాలు, వార్డుల ఏర్పాటు లాంటివి కూడా పూర్తి చేశారు. కరోనా సమయంలో వీటన్నింటినీ పక్కనపెట్టారు. కొవిడ్ సేవల కోసం అవసరమైనట్టుగా ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం మళ్లీ యథాస్థితిలోనికి భవనం మొత్తాన్ని తీసుకురావాల్సి ఉంది.
ఐదంతస్థుల్లో విస్తృత సేవలు...
ఐదంతస్థుల్లో న్యూరాలజీ, నెఫ్రాలజీ, కార్డియో థొరాసిస్, కార్డియాలజీ, అత్యవసర మెడిసిన్, చిన్నపిల్లలకు అవసరమైన పిడియాట్రిక్ సర్జరీ వంటి సేవలు అందుబాటులోనికి వస్తాయి. ప్రైవేటు ఆసుపత్రుల్లో ఈ సేవలకు రూ.లక్షలు వసూలు చేస్తుంటారు. ఒకటో అంతస్థులో వైద్య పరీక్షలు, బయోకెమిస్ట్రీ, మైక్రో బయాలజీ, పాథాలజీ ల్యాబ్‌లు, సీటీ స్కాన్, డయాలసిస్ యూనిట్, ఎండోస్కోపి, ఫ్లోరోస్కోపి, ఆల్ట్రాసౌండ్ గది, ఎక్స్‌రే యూనిట్లు ఏర్పాటు చేశారు. రెండులో రోగుల వార్డులు, మూడులో జీర్ణకోశ వ్యాధులు, గుండె జబ్బులు, ఊపిరితిత్తుల శస్త్రచికిత్సలు, అత్యవసర కార్డియాక్ కేర్ యూనిట్ విభాగం(ఐసీసీయూ), క్యాథ్ ల్యాబ్‌లుంటాయి. నాలుగో అంతస్థులో యాంటీ బ్యాక్టీరియల్ వినైల్ ఫ్లోరింగ్ ఏర్పాటు చేశారు. రోగులకు ఎలాంటి ఇన్‌ఫెక్షన్లు సోకకుండా ఇది ఉపయోగపుతుంది. నాలుగో అంతస్థు మొత్తాన్ని అత్యవర చికిత్సా విభాగం(ఐసీయూ) కోసం వినియోగిస్తున్నారు. ఐదులో ఎనిమిది ఆపరేషన్ థియేటర్లను ఏర్పాటు చేశారు. 2017 జూన్‌లో ఆరంభమవ్వాల్సిన సేవలను.. కనీసం నాలుగేళ్ల తర్వాత 2021 జూన్‌లోనైనా తీసుకొస్తారో.. లేదో చూడాల్సిందే.
ఇదీ చదవండి: అరిటాకంతా తమలాపాకంటా..!