కోట్లు ఖర్చు పెట్టినా.. ఎకరం తడవలేదు!
Breaking

ఐదు దశాబ్దాల క్రితం ఆ కాలువను ప్రారంభించారు. వ్యవసాయ భూములకు నీరందించాలనే లక్ష్యంతో కోట్లు ఖర్చు పెట్టారు. కానీ ఎకరం భూమి కూడా తడవలేదు. అసంపూర్తి పనులతో అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. కాలువ మరమ్మతులు పూర్తైతే తమకు మేలు జరుగుతుందని.. త్వరగా పూర్తి చేయాలని రైతులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

మూడు వేల ఎకరాల భూములకు సాగునీరందించాలన్న లక్ష్యంతో అయిదు దశాబ్దాల కిందట మొదలు పెట్టిన కాలువ అది. రూ. కోట్లు ఖర్చు చేశారు. కానీ, ఎకరం నేల తడవలేదు. కారణం అసంపూర్తి పనులే. ఇదీ బద్వేలు కాలువ కథ. చేజర్ల మండలంలోని పెన్నా తీర గ్రామాల భూములకు సాగునీరందించే ఏటి కాలువలు వరదలు, భారీ వర్షాల సమయంలో తెగిపోయి ఆయకట్టు రైతులు అవస్థలు పడేవారు. ఆ సమస్యను పరిష్కరించేందుకు కలువాయి నుంచి చేజర్ల వరకు నదికి సమాంతరంగా ఓ కాలువ తవ్వాలని 1970లో రూపకల్పన చేశారు. దానికి బద్వేలు రివర్‌ ఛానల్‌గా నామకరణం చేసి.. అవసరమైన భూసేకరణ పూర్తి చేశారు. కొంత మేర కాలువలు తవ్వారు. సోమశిల జలాశయ నిర్మాణం పూర్తి కావడంతో... దిగువకు వరదలు తగ్గాయి. దక్షిణ కాలువ నిర్మాణంతో బద్వేలు కాలువ ఆయకట్టు పరిధిలోని కొంత భాగం అందులో చేరింది. కాలక్రమంలో బద్వేలు కాలువకు కాలదోషం పట్టింది. నిర్మాణ పనులు నిలిచిపోయాయి. ఇందుకు సేకరించిన భూములు ఆక్రమణకు గురై పంట పొలాలుగా మారిపోయాయి.

అలా.. మళ్లీ తెరపైకి

2010లో మొదలైన జలయజ్ఞంలో ఈ కాలువ మళ్లీ తెరపైకి వచ్చింది. నదిలోని కట్టుగొమ్మల నుంచి కాకుండా నేరుగా జలాశయం నుంచి ఆయకట్టుకు నీరందించాలని రూ. ఆరు కోట్లతో పనులు మొదలుపెట్టారు. కొంత మేర పనులు చేశారు. రూ. 3కోట్లకుపైగా నిధులు ఖర్చు పెట్టారు. ఇంతలో పనులు చేపట్టిన గుత్తేదారు చనిపోవడంతో అంతటితో ఆగిపోయాయి. ఆపై కొన్ని ఆరోపణలు, విమర్శలు రావడంతో పనులు నిలిచిపోయాయి.

ఉన్నవీ పోయే..

కోటితీర్థంలోని మెట్ట భూములకు దక్షిణ కాలువలో 2ఎల్‌ నుంచి నీరందించేందుకు నాలుగు ఉపకాలువలు తవ్వారు. వాటికి అడ్డంగా బద్వేలు కాలువ నిర్మించారు. కానీ, ఉప కాలువల నుంచి భూములకు నీరొచ్చేలా వంతెనలు నిర్మించ లేదు. ఫలితంగా అక్కడి రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పనులు సకాలంలో పూర్తయి ఉంటే నాలుగు వేల ఎకరాలకు సమృద్ధిగా నీరందేది. అసంపూర్తి పనుల కారణంగా కొత్త ఆయకట్టు రాకపోగా.. ఉన్న వసతి దూరమైంది. సోమశిల-1 డివిజన్‌ పరిధిలో ఉన్న ఈ కాలువను.. ఆ పరిధిలోకి చేర్చకపోవడంతో పర్యవేక్షణ కొరవడింది.

పూర్తయితే సిరులే..

కాలువ నిర్మాణం పూర్తయితే మండలంలోని మూడు వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుంది. కోటితీర్థం, టి.కె.పాడు, మడపల్లి, ఎనమదల గ్రామాల్లో మెట్ట ప్రాంతాలకు మేలు జరుగుతుంది.

కాలువల పేరుతో ఊరి చుట్టూ.. ఇళ్ల వెంట సగం కాలువలు తవ్వి వదిలేశారు. కాలువలో భూములు పోయాయి. పొలం రెండు ముక్కలైంది. మిగిలిన భూమికి నీరొచ్చే కాలువలు తెగిపోయాయి. ఈ సమస్య చెబుదామంటే సంబంధిత అధికారులు, కార్యాలయాలు ఇక్కడ లేవు. - ఎ.పెంచల నరసయ్య

కోటితీర్థం.. పరిసర గ్రామాల ఫిర్యాదు మేరకు మంత్రి గౌతంరెడ్డి అసంపూర్తి కాలువను పూర్తి చేయాలని ఆదేశించారు. బీఆర్‌సీ, దక్షిణ కాలువ, కండలేరు నుంచి పెన్నానదికి నల్లవాగుమీదుగా వరద కాలువ ఏర్పాట్లపై సమీక్షిస్తున్నాం. వచ్చే ఆర్థిక సంవత్సరంలో పనులు చేపట్టేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు రూపొందిస్తున్నాం. - కృష్ణారావు, ఎస్​ఈ, సోమశిల ప్రాజెక్ట్.

ఇదీ చదవండి: నెల్లూరు నగరాన్ని సుందరంగా మారుస్తాం: మంత్రి అనిల్

    About us Privacy Policy
    Terms & Conditions Contact us

    • ETV
    • ETV
    • ETV
    • ETV

    Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
    ETV

    INSTALL APP

    ETV

    CHANGE STATE

    ETV

    SEARCH

    ETV

    MORE

      • About us
      • Privacy Policy
      • Terms & Conditions
      • Contact us
      • Feedback

      Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.