
శ్రీకాకుళం జిల్లాలో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని కలెక్టర్ జె.నివాస్ ప్రకటించారు. మొత్తం నాలుగు దశల్లో 78.02 శాతం పోలింగ్ నమోదైందన్నారు. మొదటి, రెండు విడతల్లో ఓటర్లు తక్కువగా ఓటుహక్కును వినియోగించుకున్నా ఆ తర్వాత మంచి స్పందన వచ్చిందన్నారు.
శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం కలెక్టర్ జె.నివాస్, ఎస్పీ అమిత్‌బర్దార్ కలసి సమావేశం నిర్వహించారు. జిల్లాలో 1,024 సర్పంచ్, 6,708 మంది వార్డు సభ్యులకు జరిగిన ఎన్నికల్లో ఎక్కువ మంది ఓటుహక్కును వినియోగించుకున్నారని, ఇదే స్ఫూర్తిని రాబోయే పుర ఎన్నికల్లోనూ కొనసాగించాలన్నారు. సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు తరచూ ఇవ్వడం, సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేయడం వల్ల ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు రాలేదన్నారు. ఒకటి, రెండు చోట్ల ఉద్రిక్త వాతావరణం మినహా మిగిలిన చోట్ల ప్రశాంతంగా ముగిశాయన్నారు. బ్యాలెట్ బాక్సులు ఎత్తుకెళ్లడం, కాల్చివేయడం వంటి ఘటనలను ఉదాహరిస్తూ ఎవరైనా ఇలాంటి వాటికి పాల్పడితే ఐదేళ్లు జైలుశిక్ష, ఆరేళ్ల వరకు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం ఉంటుందన్నారు. ఎస్పీ మాట్లాడుతూ అన్ని శాఖల సమన్వయంతో ప్రశాంతంగా ఎన్నికల క్రతువు ముగిసిందన్నారు. 2013లో 221 ఏకగ్రీవాలు కాగా, ప్రస్తుతం 140 మాత్రమే అయ్యాయన్నారు. గత ఎన్నికల్లో 87 కేసులు నమోదు కాగా ప్రస్తుతం కేవలం 37 కేసులు నమోదయ్యాయని తెలిపారు.
పుర పోరుకు సన్నద్ధం
మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ సూచించారు. జిల్లా కలెక్టర్లతో సోమవారం నిర్వహించిన దూరదృశ్య సమావేశంలో ఈ మేరకు ఆదేశించారు. ఎన్నికల షెడ్యూల్ అందరికీ తెలిసేలా ప్రదర్శించాలన్నారు. పోలింగ్ కేంద్రాలను ముందుగానే పరిశీలించాలని, తాగునీరు, మరుగుదొడ్లు, ర్యాంపులు, విద్యుత్తు తదితర సౌకర్యాలను కల్పించాలన్నారు. సమావేశంలో కలెక్టర్ జె.నివాస్, ఎస్పీ అమిత్‌బర్దార్, సంయుక్త కలెక్టర్ కె.శ్రీనివాసులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: పాఠశాలల్లో ‘నాడు-నేడు’ పనుల పూర్తిలో జాప్యం