చివరి విడతలో పోటెత్తిన ఓటర్లు.. జిల్లాలో 83.81 పోలింగ్‌ నమోదు
Breaking

ఎన్నో సందేహాలు, మరెన్నో ఉత్కంఠ ఘట్టాలను దాటుకుని జిల్లాలో ఎట్టకేలకు పల్లెపోరు ముగిసింది.. ఈ ఐదేళ్లూ దేశానికి పట్టుగొమ్మలైన గ్రామాలను పాలించేదెవరో తేలిపోయింది.. యువత, మహిళలు, అనుభవానికి పెద్దపీట వేస్తూ ఓటర్లు తీర్పునిచ్చారు. నాలుగు దశల్లో నిర్వహించిన గ్రామ పంచాయతీ పోరు ఆదివారం జరిగిన తుదివిడత ఎన్నికలతో పూర్తయింది. చెదురుమదురు ఘటనలు మినహా అన్నిదశలూ ప్రశాంతంగా సాగిపోయాయి.

నామినేషన్లు, ఉప సంహరణలు, ప్రచారాలు, పోలింగ్‌, ఫలితాలూ అన్నీ తేలేందుకు 24 రోజుల సమయం పట్టింది. జిల్లాలో 38 మండలాలుండగా 10, 10, 9, 9 నాలుగు విడతల వారీగా పోలింగ్‌ నిర్వహించారు. చివరిదశలో 259 సర్పంచ్‌, 1915 వార్డు స్థానాలకు పోలింగ్‌ జరిగింది. జిల్లాలో మొత్తం 83.81 పోలింగ్‌ నమోదు కాగా.. పారిశ్రామిక ప్రాంతం, స్థానికంగానే ఉపాధి దొరికే రణస్థలం మండలంలో 88.86 శాతం పోలింగ్‌ జరిగింది. గార మండలంలో అత్యల్పంగా 80.43 శాతం మంది మాత్రమే ఓటుహక్కును వినియోగించుకున్నారు.

పోటెత్తారు..

శ్రీకాకుళం, ఎచ్చెర్ల, నరసన్నపేట నియోజకవర్గాల పరిధిలో తొమ్మిది మండలాల్లో ఆదివారం చివరిదశ ఎన్నికలు జరిగాయి. దాదాపు అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో ఉదయం 6.30 నుంచే ఓటర్లు పోటెత్తారు. ఎచ్చెర్ల మండలం బడివానిపేటలో వేకువజామున నాలుగు గంటలకే భారీ సంఖ్యలో ఓటర్లు తరలివచ్చారు. ఉదయం నుంచీ అన్ని కేంద్రాలూ ఓటర్లతో కిటకిటలాడాయి. ఓటేసే సమయంలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ చోటుచేసుకోలేదు. పోలింగ్‌ సమయం ముగిసేసరికి 83.81 శాతం మంది తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఆ వెంటనే అధికారులు ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. చాలా గ్రామాల్లో ఓటర్ల సంఖ్య తక్కువగానే ఉండడంతో ఫలితాలు వేగంగానే వెలువడ్డాయి.

ఈసారి పెరిగింది..

తొలి రెండు దశల్లో పోలింగ్‌ శాతం జిల్లా యంత్రాంగాన్ని నిరాశపరిచింది. ఆయా దశల్లో ఎన్నికలు జరిగిన మండలాల్లో వలస ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. సంక్రాంతి తర్వాత వీరంతా ఉపాధి కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లిపోయారు.ఈలోగా ఎన్నికలు రావడంతో వెనక్కి రాలేకపోయారు. ఫలితంగా ఓటింగ్‌ పైనా తీవ్ర ప్రభావం పడింది. చివరి రెండు దశల్లో వలసలు కాస్త తక్కువ కావడంతో ఓటింగ్‌ మెరుగుపడింది. నాలుగో విడతలో వలస ఓటర్లు ఉన్నా వారంతా దగ్గరలోని విశాఖ కేంద్రంగానే ఉపాధి కోసం వెళ్లినవారు కావడంతో ఓటేసేందుకు తిరిగొచ్చారు. దీనికితోడు ఆదివారం సెలవుదినం కలసిరావడంతో ప్రైవేటు రంగంలో పనిచేసే వారు సైతం తమ ఓటుహక్కును ఉత్సాహంగా వినియోగించుకున్నారు.

స్వల్ప ఉద్రిక్తతలు..

రణస్థలం మండలం దేవరాపల్లిలో ఒక అభ్యర్థికి తొలుత ఆధిక్యం వచ్చిందని ప్రకటించి తర్వాత మరో గెలిచినట్లు వచ్చినట్లు చెబుతున్నారని పేర్కొంటూ ఓ వర్గానికి చెందిన వారంతా పోలింగ్‌ కేంద్రాన్ని చుట్టుముట్టారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఎన్నికల సిబ్బంది వద్దకు ఎవరినీ వెళ్లనీయకుండా తలుపులకు తాళాలు వేశారు. తొలుత ఇరువర్గాలు అంగీకరించిన నేపథ్యంలో ముందు ప్రకటించినట్లుగా తొమ్మిది ఓట్ల ఆధిక్యం వచ్చిన మీసాల సరస్వతి గెలిచినట్లుగా అధికారులు ప్రకటించారు. చిల్లపేటరాజాంలోనూ గందరగోళ పరిస్థితి నెలకొంది. ఇక్కడ పోలీసులు పోలింగ్‌ కేంద్రం సమీపంలో నివాసం ఉన్నవారిని సైతం కొట్టడంతో పలువురికి గాయాలయ్యాయి.

ఎచ్చెర్ల మండలం షేర్‌మహ్మద్‌పురంలో జరిగిన ఎన్నికల ప్రక్రియ అనంతరం నిర్వహించే లెక్కింపు కేంద్రం వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఫలితాలకు జనాలు పెద్ద సంఖ్యలో రావడంతో ఘర్షణ వాతావరణ నెలకొంది. దీంతో పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

ఓట్ల గల్లంతు..

నరసన్నపేట మండలం మాకివలస గ్రామానికి చెందిన 58 మంది ఓటర్ల పేర్లు గల్లంతయ్యాయి. వీరంతా పోలింగ్‌కేంద్రానికి వచ్చి నిరాశకు గురయ్యారు. ‘తామంతా గ్రామంలోనే నివశిస్తున్నామని, కానీ జాబితాలో పేర్లు లేవు. ఇది అన్యాయం. గత ఎన్నికల్లో మేము ఓటేశాం. ఈసారి అలా జరగడానికి కారణం ఎవరు’ అంటూ అధికారులను ప్రశ్నించారు.

ఇవీ చూడండి...: శ్రీ మహాలక్ష్మి అమ్మవారి జాతర ప్రారంభం

    About us Privacy Policy
    Terms & Conditions Contact us

    • ETV
    • ETV
    • ETV
    • ETV

    Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
    ETV

    INSTALL APP

    ETV

    CHANGE STATE

    ETV

    SEARCH

    ETV

    MORE

      • About us
      • Privacy Policy
      • Terms & Conditions
      • Contact us
      • Feedback

      Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.