పంచాయతీ ఎన్నికల్లో... రాష్ట్రంలోనే అత్యధిక పోలింగ్‌
Breaking

విజయనగరంజిల్లాలో నాలుగో దశ ఎన్నికల్లోనూ పోలింగ్ శాతం అనూహ్యంగా అత్యధికంగా నమోదైంది. రాష్ట్రంలోనే అత్యధికంగా 87.09 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉదయం నుంచి ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. మేజర్ పంచాయతీల్లోనూ ఓటర్లు పోటెత్తారు. ఫలితంగా.. జిల్లాలో నాలుగో విడతలో అత్యధిక పోలింగ్ నమోదైంది. 3వ విడత ఎన్నికల్లోనూ విజయనగరంజిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలవటం విశేషం.

ఓటు చైతన్యం వెల్లివిరిసింది.. మూడో విడత స్ఫూర్తితో ఓటర్లు కదిలి మరోమారు రాష్ట్రంలోనే అత్యధిక పోలింగ్‌ శాతం నమోదు చేసి చరిత్ర సృష్టించారు. ఆదివారం నాలుగో విడత పోరు ప్రశాంతంగా ముగిసింది. విజయనగరం డివిజన్‌లోని 10 మండలాల్లో 296 పంచాయతీలకు 58 సర్పంచి స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. 238 సర్పంచి, 1947 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు.స్వల్ప గొడవలు మినహా ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. బొండపల్లి మండలం కొండకిండాంలోని ఆరో వార్డులో బ్యాలెట్‌ పత్రం వెనుక వేసిన స్టాంపు ముద్ర పత్రానికి ముందు వైపు కూడా కనిపించింది. దీంతో పోలింగ్‌ను రెండు గంటల పాటు నిలిపివేశారు. అధికారులు అభ్యర్థులను పిలిపించి పరిస్థితిని వివరించి ఓటింగ్‌ను కొనసాగించారు.

ఎంతైనా మనోళ్లలో చైతన్యం ఎక్కువనే చెప్పాలి. అందుకే జిల్లాలో రాష్ట్రంలోనే అత్యధికంగా 87.09 శాతం పోలింగ్‌ శాతం నమోదు చేశారు. మూడో విడతలోనూ ఇవే గణాంకాలు నమోదు కావడం గమనార్హం.

మాజీ మంత్రి మనవడికి పీఠం

దివంగత మంత్రి కోళ్ల అప్పలనాయుడు మనవడు కోళ్ల భూపాలనాయుడు ఖాసాపేట సర్పంచిగా గెలుపొందారు. తెదేపా మద్దతుదారుగా బరిలో దిగి 648 ఓట్ల మెజార్టీతో పీఠం కైవసం చేసుకున్నారు. ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన ఇతను 22 ఏళ్లకే సర్పంచి బాధ్యతలు చేపట్టబోతుండటం విశేషం.

ఒమ్మిలో ప్రశాంతం

మూడో విడతలో నిలిచిన ఒమ్మి పంచాయతీలో 4వ వార్డు ఉపఎన్నిక ప్రశాంతంగా జరిగింది. ఇక్కడ వైకాపా బలపరిచిన జి.సూరమ్మ 40 ఓట్ల మెజార్టీతో గెలిచారు.

ఆదర్శం.. 118 ఏళ్ల బామ్మ

శృంగవరపుకోట ఎస్‌.కోట పట్టణంలోని మెండివీధికి చెందిన 118 ఏళ్ల వృద్ధురాలు వేమలి రాములమ్మ 16వ వార్డులో ఓటుహక్కు వినియోగించుకున్నారు. నడవలేని స్థితిలో ఉన్న ఆమెను స్థానిక యువకులు చేతులపై కేంద్రానికి తీసుకొచ్చారు. ఇంత వయసులోనూ కదిలొచ్చిన ఆమె అందరికీ ఆదర్శప్రాయం.

రాష్ట్రంలో మనదే అగ్రస్థానం

జిల్లాలో నాలుగో విడత ఎన్నికల్లో 87.09 శాతం ఓటింగ్‌ నమోదైందని కలెక్టర్‌ ఎం.హరిజవహర్‌లాల్‌ వెల్లడించారు. ఆదివారం జడ్పీ కార్యాలయంలోని కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌లో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోనే ఓటింగ్‌ శాతం అధికంగా నమోదైన జిల్లాగా విజయనగరం నిలిచిందన్నారు. ఓటర్లను చైతన్య పరచడంతోనే ఇది సాధ్యమైందన్నారు. ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించిన పంచాయతీరాజ్‌, రెవెన్యూ, పోలీసు, ఇతర శాఖలకు అభినందనలు తెలిపారు. లెక్కింపు కూడా త్వరగా పూర్తయ్యేలా టేబుళ్ల సంఖ్య, సిబ్బందిని పెంచడమే కాకుండా నిరంతర విద్యుత్తు సరఫరా ఉండేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు.

పరిశీలించి.. పర్యవేక్షించి..

నాలుగో విడత ఎన్నికల తీరును కలెక్టర్‌ ఎం.హరిజవహర్‌లాల్‌, సంయుక్త కలెక్టర్‌ కిశోర్‌కుమార్‌ ఆదివారం ఉదయం జిల్లా పరిషత్తులోని కమాండ్‌ కంట్రోల్‌రూం నుంచి పరిశీలించారు. అనంతరం క్షేత్రస్థాయిలో పోలింగ్‌కేంద్రాల పర్యవేక్షణకు వెళ్లారు. సాయంత్రం నుంచి లెక్కింపు ప్రక్రియను నిశితంగా పరిశీలించారు. డీపీవో కె.సునీల్‌రాజ్‌కుమార్‌, ముఖ్య ప్రణాళికాధికారిణి జి.విజయలక్ష్మి, డీఎల్పీవో మోహనరావు పాల్గొన్నారు. నాలుగోదశ ఎన్నికలపై వచ్చిన 90 ఫిర్యాదులను పరిష్కరించినట్లు కలెక్టర్‌ ఎం.హరిజవహర్‌లాల్‌ తెలిపారు.

అదృష్టవంతులు

గజపతినగరం నియోజకవర్గం దత్తిరాజేరు మండలంలోని వంగర గ్రామానికి చెందిన దత్తి నారాయణప్పలనాయుడు కేవలం 2 ఓట్ల ఆధిక్యంతో సమీప అభ్యర్థి దత్తి చిరంజీవిపై విజయం సాధించినట్లు అధికారులు ప్రకటించారు.

మార్లాపల్లి గ్రామ సర్పంచిగా గోగాడ సత్యం మూడు ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ గ్రామంలో త్రిముఖ పోరు నెలకొనగా తెదేపా మద్దతుదారుగా బరిలో దిగి విజయం సాధించారు.

మెంటాడ మండలం బుచ్చిరాజుపేటకు చెందిన తాడ్డి తిరుపతి 4 ఓట్ల తేడాతో గెలుపొందారు. 307 ఓట్లకు 139 ఓట్లు రాగా, ప్రత్యర్థికి 135 వచ్చాయి.

అయినా అప్రమత్తత అవసరం: ఎస్పీ

విజయనగరం డివిజన్‌ పరిధిలోని 10 మండలాల్లో ఆదివారం నాలుగో విడత పంచాయతీ పోరు ప్రశాంతంగా ముగిసింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత చేపట్టారు. ఎస్పీ బి.రాజకుమారి సమస్యాత్మక, అతి సమస్యాత్మక ప్రాంతాల్లో పర్యటించారు. ఆమె గజపతినగరం మండలంలోని గంగచోళ్లపేట, బొండపల్లి మండలంలోని రాచకిండాం, ఒంపల్లి, బొండపల్లి, ఎస్‌.కోట పట్టణంలోని పోలింగు కేంద్రాలకు వెళ్లి పరిశీలించారు. విధుల్లో ఉన్న సిబ్బందికి ఎన్నికలు పూర్తయినా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆమెతో పాటు ఓఎస్డీ సూర్యచంద్రరావు, జిల్లా సంయుక్త కలెక్టరు మహేష్‌కుమార్‌, ఆర్డీవో భవానీశంకర్‌, డ్వామా పీడీ ఐతా నాగేశ్వరరావు ఉన్నారు.

ఇదీ చూడండి:

పల్లె పోరు: తుది విడత పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు

    About us Privacy Policy
    Terms & Conditions Contact us

    • ETV
    • ETV
    • ETV
    • ETV

    Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
    ETV

    INSTALL APP

    ETV

    CHANGE STATE

    ETV

    SEARCH

    ETV

    MORE

      • About us
      • Privacy Policy
      • Terms & Conditions
      • Contact us
      • Feedback

      Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.