
వారిద్దరూ వృద్ధ దంపతులు. ఎన్ని ఆసుపత్రులకు తిప్పినా భర్త ఆరోగ్యం కుదట పడలేదు. ఇక చేసేది లేక నాటు వైద్యం చేయించుకునేందుకు వేరే ప్రాంతానికి బస్సులో బయలుదేరారు. గమ్యస్థానం చేరకుండానే.. ఆ వృద్ధుడు ప్రాణాలు వదిలాడు. ఆ వృద్ధురాలికి ధైర్యంగా నిలిచి.. మేమున్నామని చెప్పాల్సిన బస్సు సిబ్బంది.. అర్థంతరంగా మృతదేహాన్ని, ఆమెను బస్సులో నుంచి దించేసి చేతులు దులుపుకున్నారు. అటు శరీరం సహకరించక.. ఇటు భర్త మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువెళ్లే సదుపాయం లేక దిక్కు తోచని స్థితిలో విలపిస్తూ రోడ్డుమీదే ఉండిపోయిందా వృద్ధురాలు.
మానవత్వం మంటగలిసింది. ఆర్టీసీ బస్సులో ప్రాణాలు విడిచిన ఓ వృద్ధుడి మృతదేహాన్ని, ఆయన భార్యను బస్సు సిబ్బంది మార్గమధ్యమంలోనే దించేశారు. ఈ విషాదం విజయనగరం జిల్లా బొబ్బిలిలో సోమవారం జరిగింది.
సాలూరు బంగారమ్మ కాలనీకి చెందిన దాసరి పైడయ్య, పైడమ్మ దంపతులు. వీరిద్దరూ బుట్టలు అల్లకుంటూ జీవిస్తున్నారు. పైడయ్య కొద్దిరోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నారు. పలు ఆసపత్రులకు వెళ్లినా నయం కాకపోవటంతో... పార్వతీపురంలో నాటు వైద్యం పొందేందుకు బస్సులో బయలుదేరారు. మార్గమధ్యంలో గుండెపోటుతో పైడయ్య మృతి చెందాడు. దంపతులను బస్సు సిబ్బంది మధ్యలోనే బొబ్బలి పెట్రోలు బంక్ కూడలి వద్ద దించేసి వెళ్లిపోయారు. ఉపాధ్యాయుడు కృష్ణదాస్, కొందరు స్థానికులు గమనించి.. పైడమ్మను, ఆమె భర్త మృతదేహాన్ని ఆటోలో స్వగ్రామానికి పంపించారు.
ఇదీ చదవండి: చెట్టును ఢీకొన్న బొలేరో.. ముగ్గురు మృతి, 20 మందికి గాయాలు