
పశ్చిమగోదావరి జిల్లాలో పంచాయతీ ఎన్నికల పర్వం ఆదివారం జరిగిన నాలుగోదశతో ముగిసింది. అక్కడక్కడ చిరు వివాదాలు మినహా పోలింగ్ ప్రశాంతంగా సాగింది. ఏలూరు డివిజన్ పరిధిలోని 12 మండలాల్లో 237 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించారు. 6,09,950 మంది ఓటర్లకు 5,10,903 మంది ఓటుహక్కును వినియోగించుకున్నారు.
పశ్చిమగోదావరి జిల్లాలో మొదటి మూడు విడతల కంటే ఈసారి ఎక్కువగా పోలింగ్ శాతం నమోదైంది. నాలుగో విడత పోలింగ్ ప్రక్రియ ఉదయం నుంచే జోరుగా సాగింది. ఉదయం 7 గంటల సమయానికే కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు బారులు తీరారు. దెందులూరు, ద్వారకాతిరుమల, పెదపాడు, పెదవేగి, పెంటపాడు మండలాల్లో పెద్దసంఖ్యలో ఓటర్లు కనిపించారు. గణపవరం, నిడమర్రు తదితర పంచాయతీల్లో ఉదయం పోలింగ్ మందకొడిగా సాగింది.
నిడమర్రు మండలం గునపర్రు పంచాయతీలో వివాదం చెలరేగింది. ఓటు వేయాలని ఎన్నికల సిబ్బందిని ఓ వృద్ధురాలు సాయం కోరింది. అయితే తాను చెప్పిన గుర్తుపై కాకుండా సిబ్బంది మరో గుర్తుపై ఓటు వేశారని ఆమె ఆరోపించడంతో ఓ వర్గంవారు పోలింగ్ కేంద్రంలోకి వచ్చారు. ఈ క్రమంలో వారికి, అధికారుల మధ్య తోపులాట జరిగింది. ఓటర్లు ఆందోళనకు దిగారు. వృద్ధురాలు చెప్పిన గుర్తుపైనే ఓటు వేశానని అధికారి చెబుతున్నారు. దీంతో రెండు గంటలసేపు ఇక్కడ ఓటింగ్ ప్రక్రియ ఆగింది. ఈ కేంద్రానికి సబ్‌కలెక్టర్ విశ్వనాథన్, డీఎస్పీ దిలీప్‌కుమార్ చేరుకుని పరిస్థితిని చక్కదిద్దడంతో యథావిధిగా పోలింగ్ కొనసాగింది.
లోటుపాట్లు
- నిడమర్రు, దెందులూరు, గణపవరం మండలాల్లోని కొన్ని పంచాయతీల్లో థర్మల్ స్క్రీనింగ్, శానిటేషన్ సదుపాయాలు కనిపించలేదు.
- నిడమర్రు, పెదవేగి, దెందులూరు, నల్లజర్ల మండలాల్లోని కొన్ని పంచాయతీల్లోని పోలింగ్ కేంద్రాల్లో ఓటు వేసేందుకు అవసరమైన స్లిప్‌లు చాలామందికి అందక ఇబ్బంది పడ్డారు.
- చిన్న కేంద్రాల్లో ఉదయం 11 గంటల్లోగా పోలింగ్ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. పెద్ద పంచాయతీల్లో మధ్యాహ్నం 1.30 గంటల్లోగా దాదాపు పూర్తయింది.
- దూరప్రాంతాల నుంచి వచ్చే ఓటర్లు కొందరు చివరి నిమిషంలో ఓటుహక్కును వినియోగించుకున్నారు.
- పెదవేగి మండలం కొప్పాక పంచాయతీలోని 5వ నంబర్ కేంద్రంలో బ్యాలెట్ కాగితాలు లేకపోవడంతో పోలింగ్‌కు అంతరాయం కలిగింది.
వలస ఓటర్లపై ఆసక్తి
ఎన్నికలు ఆదివారం నిర్వహించడంతో ఇతర ప్రాంతాల్లో విద్య, ఉద్యోగ, వృత్తి, వ్యాపారపరంగా జీవనం సాగిస్తున్న వారు ఓటేసేందుకు వచ్చేందుకు ఆసక్తి చూపించారు. ఆదివారం సెలవు కావడం, అభ్యర్థులు ప్రయాణ ఖర్చులతో పాటు అదనంగా ఓటుకు లెక్కకట్టి నగదు పంపిణీ చేయడం, సొంత ఊరు వచ్చినట్లు ఉంటుందనే ఉద్దేశంలో అధిక సంఖ్యలో తరలివచ్చారు. ప్రధానంగా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి సొంతూళ్లకు చేరుకున్నారు. వీరికి రానుపోనూ ప్రయాణానికి అభ్యర్థులే రిజర్వేన్లు కూడా చేయించినట్లు తెలుస్తోంది. ఓటర్ల జాబితాను దగ్గర పెట్టుకుని వీరు తమకు అనుకూలంగా ఓటు వేశారో లేదో ఎప్పటికప్పుడు ఆరా తీశారు.
ఆ ఒక్కటీ గెలిపించింది
గణపవరం మండలం జల్లికాకినాడలో బాతు నాగేశ్వరరావు ఒక్క ఓటు ఆధిక్యంతో గెలుపొందారు. ఇక్కడ మొత్తం ఓట్లు 1,228 కాగా 985 పోలయ్యాయి. ఇందులో ఓగిరాల హేమసత్యనారాయణ 259, చోడదాశి జయపాల్ 348, బాతు నాగేశ్వరరావు 349 ఓట్లు సాధించారు. నోటాకు నాలుగు, పోస్టల్ బ్యాలెట్‌కు 2 రాగా, చెల్లనివి 25 వచ్చాయి. ఇక్కడ రెండు పర్యాయాలు ఓట్లు లెక్కించగా అదే ఫలితాలు రావడంతో నాగేశ్వరరావు ఒక్క ఓటుతో విజయం సాధించినట్లు అధికారులు ప్రకటించారు.
- నాలుగో విడత
- మొత్తం ఓటర్లు : 6,09,950
- పోలైనవి : 5,10,903
ఇదీ చదవండి: వైకాపాతో కొందరు పోలీసులు, అధికారులు కుమ్మక్కు.. ఎస్ఈసీకి చంద్రబాబు లేఖ