'నూరు శాతం పరిహారం ఇస్తేనే ఖాళీ చేస్తాం'
agraharam

గని విస్తరణలో భాగంగా పరిహారం చెల్లించిన వెంటనే గ్రామాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో అధికారులు విఫలమవ్వడంతో కడప జిల్లా ఓబులవారిపల్లె మండలం అగ్రహారం సమస్య జఠిలంగా మారింది. ఇప్పటికే రెండు సార్లు ప్రమాదకర ప్రాంతం (డేంజర్‌ జోన్‌)గా ప్రకటించి రూ.10 కోట్లకు పైగా పరిహారం చెల్లించారు. ఇప్పుడు గ్రామానికి నూరు శాతం పరిహారం చెల్లిస్తేనే ఖాళీ చేస్తామని బాధితులు డిమాండ్​ చేస్తున్నారు.

గని విస్తరణలో భాగంగా మంగంపేట పునరావాస కాలనీల ఏర్పాటుకు ఏపీఎండీసీ అధికారులు రూ.కోట్లు ఖర్చు చేశారు. ప్రస్తుతం ఆర్‌ఆర్‌-2 (అగ్రహారం)లో సమస్య జఠిలంగా మారింది. 2001-02లో గనుల ప్రాంతంలో ఉన్న ఈ గ్రామాన్ని సురక్షితంగా ఉంచడానికి ప్రధాన రహదారి పక్కకు తరలించారు. అప్పట్లో గ్రామస్థులకు రూ.3.39 కోట్లు పరిహారంగా చెల్లించారు. గని విస్తరణలో భాగంగా అదే గ్రామాన్ని రెండోసారి 2012-13లో ప్రమాదకర ప్రాంతం (డేంజర్‌ జోన్‌)గా ప్రకటించి రూ.7.81 కోట్లు పరిహారంగా చెల్లించారు.

పరిహారం చెల్లించిన వెంటనే గ్రామాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో అధికారులు విఫలమయ్యారు. దీంతో ప్రభుత్వానికి రూ.11.20 కోట్ల మేర గండి పడింది. అదే గ్రామానికి మళ్లీ నూరు శాతం పరిహారం చెల్లిస్తేనే ఖాళీ చేస్తామని బాధితులు డిమాండు చేస్తున్నారు. ఈసారైనా అగ్రహారం గ్రామాన్ని పూర్తి వసతులతో సురక్షిత ప్రాంతానికి తరలిస్తారని ఆశిస్తున్నారు. ఈ విషయాన్ని గ్రామపెద్దలు పలుమార్లు ఏపీఎండీసీ అధికారులు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. గ్రామాన్ని డేంజర్‌ జోన్‌గా ప్రకటించి ఎనిమిదేళ్లవుతోంది. ఏళ్ల తరబడి పేలుళ్ల ధాటికి గ్రామస్థులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. గని తవ్వకాల్లో భాగంగా జరిగే పేలుళ్ల ధాటికి ఇళ్ల గోడలు బీటలు వారుతుండగా, గనిలో జరిపే పేలుళ్లతో గ్రామం దద్దరిల్లిపోతోంది. గ్రామానికి పడమటి వైపున ఉన్న గుట్టపై జరిపే తవ్వకాలతో పెద్ద పెద్ద రాళ్లు ఇళ్లపై పడుతున్నాయని గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు.

ముఖ్యమంత్రిపైనే ఆశలు..

గత ప్రభుత్వం మా సమస్యలు పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహించింది. ప్రస్తుత ముఖ్యమంత్రి జిల్లా వాసి కావడంతో పరిష్కరిస్తారని ఆశిస్తున్నాం. డేంజర్‌ జోన్‌ పరిధిలోని గ్రామాలను సురక్షిత ప్రాంతాలకు తరలించి శాశ్వత ఇంటి పట్టాలివ్వాలి. ఇళ్లు, భూములు కోల్పోయినవారికి ఉద్యోగావకాశాలు కల్పించాలి. ఆటో నడుపుకొంటూ జీవిస్తున్నాను. - ఎస్‌.కరీముల్లా, మంగంపేట

నూరు శాతం పరిహారమివ్వాలి..

మా గ్రామాన్ని ఇప్పటికే రెండుసార్లు డేంజర్‌ జోన్‌గా ప్రకటించారు. మూడో సారి పునరావాసం కల్పించడంలో ఏపీఎండీసీ తీవ్ర జాప్యం చేస్తోంది. 2002లో గనుల ప్రాంతం నుంచి ప్రధాన రహదారి పక్కకు తరలించారు. 2012లో అగ్రహారం గ్రామాన్ని డేంజర్‌ జోన్‌గా గుర్తించి పరిహారం చెల్లించారు. ఇప్పటివరకు పునరావాసస్థలాలు చూపలేదు. ప్రస్తుతం గ్రామాన్ని తరలించాలంటే మాకు నూరు శాతం పరిహారం ఇవ్వాలి. ఇంటికో ఉద్యోగం, అర్హులు లేకపోతే కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలి. - చెంగల్రాయుడు, అగ్రహారం

నివాస స్థలాల ఏర్పాటుకు చర్యలు..

అగ్రహారం గ్రామాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించడానికి 2012-13లో బాధితులకు పరిహారం చెల్లించాం. అప్పట్లోనే ఇంటి స్థలాలు ఏర్పాటుచేస్తే వాస్తు సక్రమంగా లేదనే కారణంతో బాధితులు తిరస్కరించారు. స్థానికుల కోరిక మేరకు గురుకుల పాఠశాల ఎదురుగా ఉన్న 99 ఎకరాల స్థలంలో ఇంటి పట్టాలిచ్చేందుకు రెవెన్యూ అధికారులను ఆదేశించాం. అగ్రహారం, కాపుపల్లె, హరిజనవాడ, అరుంధతివాడ గ్రామాలకు రెవెన్యూ అధికారులు స్థలం కేటాయించిన వెంటనే బాధితులకు అందజేస్తాం. - సుదర్శన్‌రెడ్డి, సీపీవో, ఏపీఎండీసీ మంగంపేట

ఇదీ చదవండి:

విశాఖ ఉక్కు పరిశ్రమ: గనుల లేమే కొంపముంచుతోంది!

    About us Privacy Policy
    Terms & Conditions Contact us

    • ETV
    • ETV
    • ETV
    • ETV

    Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
    ETV

    INSTALL APP

    ETV

    CHANGE STATE

    ETV

    SEARCH

    ETV

    MORE

      • About us
      • Privacy Policy
      • Terms & Conditions
      • Contact us
      • Feedback

      Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.