
ఆ భూమి కొండప్రాంతంగా రెవెన్యూ దస్త్రాల్లో నమోదైంది. అయితేనేం కొందరు అక్రమార్కులు కొండల్ని తవ్వి దర్జాగా కబ్జాలకు పాల్పడుతున్నారు. ఆ ప్రాంతంలో జరుగుతున్న అక్రమాలపై ఎన్నోసార్లు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశామని.. కనీసం పట్టించుకోలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ భూమిపై కబ్జాదారుల కన్నుపడింది. ఏకంగా కొండనే తవ్వేసి పాగా వేశారు. ఒకటి, రెండు సెంట్లు కాదు.. ఎకరాలకొద్దీ ఆక్రమించేశారు. ఒంటిమిట్ట మండలం పెన్నపేరూరు రెవెన్యూ గ్రామపరిధిలోని ఓబులేసుకోన కబ్జాదారులకు అడ్డాగా మారింది. సర్వే సంఖ్య 659లో 89.75 ఎకరాలు, 661లో 1,778.28 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇది కొండ ప్రాంతంగా రెవెన్యూ దస్త్రాల్లో నమోదైంది. ఇబ్రహీంపేట, వెంకటాయపల్లె సమీపంలో ఓబులేసుకోన క్షేత్రానికి వెళ్లే రహదారి పక్కన కొండను తవ్వేసి సుమారు 40కుపైగా ఎకరాలు ఆక్రమించేశారు. రెండు నెలలుగా యంత్రాలతో పంటల సాగుకు అనువుగా చదును పనులు చేపడుతున్నారు. కంచెలు ఏర్పాటు చేయడంతోపాటు వ్యవసాయ గొట్టపు బావులు తవ్వించారు. బిందుసేద్యం పరికరాలు అమర్చి పంటలను సైతం సాగు చేశారు. ఇక్కడ జరిగిన ఆక్రమణల పర్వంపై గతంలోనే రెవెన్యూశాఖాధికారులకు ఫిర్యాదులు చేశామని, కనీసం పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఏడో విడతలో ఎంపిక చేశారంతే
వ్యవసాయ సాగుభూముల్లేని నిరుపేదలను గుర్తించి భూ పంపిణీ చేయాలని దశాబ్దం కిందట అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి నిర్ణయించారు. దీనిలో భాగంగా 2013,. డిసెంబరులో ఏడో విడత చేపట్టాలని లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను చేపట్టారు. పెన్నపేరూరు రెవెన్యూ గ్రామపరిధిలో ఎస్టీలు 28 మందికి 28 ఎకరాలు, ఎస్సీలు 196 మందికి 207.66 ఎకరాలతో పాటు బీసీలు 23 మందికి 30.93 ఎకరాలు, ఓసీలు 11 మందికి 23.16 ఎకరాలివ్వాలని అప్పట్లో నిర్ణయించారు. పట్టాదారు పాసుపుస్తకాలు, భూయాజమాన్య హక్కుపత్రాలు సిద్ధం చేశారు. ఇంతలో 2014లో సార్వత్రిక ఎన్నికలొచ్చాయి. అనంతరం ఏడో విడత భూ పంపిణీ చేయకుండా వాయిదా వేశారు. ఇప్పటికీ ఎంపిక చేసిన లబ్ధిదారులకు ఎలాంటి పట్టాలు పంపిణీ చేయలేదు. ప్రభుత్వ భూముల దురాక్రమణకు గురి కాకుండా కాపాడాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతో అక్రమార్కుల ఆగడాలు శ్రుతిమించాయి. ఇందులో కీలకమైన రాజకీయ నాయకుల అనుచరులే భూ దందాలు సాగించినట్లు సమాచారం. కొంత మంది పేర్లతో భూవివరాలను అంతర్జాలంలో నమోదు చేసినట్లు తెలుస్తోంది.
"ఆక్రమణలు గుర్తించేందుకు సర్వే చేయిస్తున్నాం. రెండు రోజుల్లో నిర్ధరించి తొలగిస్తాం. ఆదివారం సెలవుదినం కావడంతో అధికారులు అందుబాటులో ఉండరని భూకబ్జాలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వ భూముల ఆక్రమణదారులపై చర్యలు తీసుకుంటాం." - పి.విజయకుమారి, తహసీల్దారు, ఒంటిమిట్ట
ఇదీ చదవండి: లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు..