
ఏపీలోని నాలుగో విడత పంచాయతీ ఎన్నికల్లో.. హోంమంత్రి సుచరిత సొంత నియోజకవర్గంలో ఘర్షణ జరిగింది. గొడవలో ఓ వర్గం వారు పోలింగ్ ఏజెంట్‌పై దాడికి పాల్పడ్డారు. జిల్లాలో అన్ని పోలింగ్ కేంద్రాల్లో కంటే ముట్లూరులోని ఎక్కువ పోలీసు బందోస్తును ఏర్పాటు చేసినా.. ఇలాంటి ఘర్షణ జరగడం కలకలం రేపింది. పోలింగ్ ఏజెంట్‌గా తప్పుకోవాలని బెదిరించినట్లు.. బాధితుడు బాబురావు తెలిపారు.
ఏపీలోని పంచాయతీ ఎన్నికల నాలుగో విడతలో.. హోంమంత్రి సొంత నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రంలో ఏజెంట్‌పై దాడి జరగడం ఉద్రిక్తతకు దారితీసింది. ప్రత్తిపాడు నియోజకవర్గం పరిధిలోని వట్టిచెరుకూరు మండలం ముట్లూరులో పోలింగ్ ఏజెంట్‌పై ప్రత్యర్థులు దాడికి పాల్పడ్డారు.
గోడ దూకి.. పోలింగ్ కేంద్రంలోకి ప్రవేశించి..
ఘటన జరగడానికి కొద్ది నిమిషాల ముందే ఎస్పీ అమ్మిరెడ్డి ఆ పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి వెళ్లారు. అదే గ్రామంలో ఉన్న వేరే పోలింగ్ స్టేషన్‌ను ఎస్పీ పరిశీలిస్తున్న సమయంలో ఇక్కడ దాడి జరిగింది. ప్రత్యర్థి వర్గానికి చెందిన నలుగురు వ్యక్తులు గోడదూకి పోలిగ్ కేంద్రంలోకి ప్రవేశించారు. 5వ నంబర్ పోలింగ్ బూత్ ఏజెంట్‌గా ఉన్న బాబురావును లోపలి నుంచి బయటకు లాక్కొని వచ్చి.. తమ వెంట తెచ్చుకున్న రాడ్లతో ఇష్టం వచ్చినట్లు కొట్టారు. పక్కనే ఉన్న 7వ నంబరు బూతులోని ఏజెంట్ పైనా దాడి చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు.
పోలింగ్ ఏజెంట్‌గా తప్పుకోవాలని బెదిరింపులు...
పోలీసులు అక్కడకు చేరుకునే సమయానికి.. దాడికి పాల్పడ్డ నలుగురు పరారయ్యారు. డీఎస్పీ జెస్సీ ప్రశాంతిని ముట్లూరు గ్రామంలో ప్రత్యేకంగా భద్రత కోసం నియమించినా.. ఈ దాడి జరగడం కలకలం రేపింది. వట్టిచెరుకూరు ఎస్సై పోలింగ్ ఏజెంట్‌గా తనను తప్పుకోవాలని బెదిరించినట్లు బాబురావు ఆరోపించారు.
తమ గ్రామానికి చెందిన వారే..
తమ గ్రామానికే చెందిన నలుగురు వ్యక్తులు దాడికి పాల్పడినట్లు గాయపడిన పోలింగ్ ఏజెంట్ బాబురావు తెలిపారు. తమ వర్గం వారు ఎన్నికల్లో నిలబడటం, పోలింగ్ ఏజెంట్లుగా ఉండటం సహించలేకే దాడి చేశారని ఆరోపించారు.
సంబంధిక కథనం: నడ్డా సమక్షంలో భాజపాలో చేరిన శ్రీశైలం గౌడ్