కృత్రిమ మేధతో సీసీ కెమెరాల వినియోగం... కేసుల దర్యాప్తులో ఇవే కీలకం
CCTV

అధునాతన సాంకేతిక పరిజ్ఞానం పోలీసుల మూడో కన్నుగా నేరపరిశోధనలో దన్నుగా నిలుస్తోంది. నేరాల నియంత్రణ, ట్రాఫిక్‌ ఉల్లంఘనలు, నిందితుల గుర్తింపునకు చాలా నగరాలు, పట్టణాల్లో సీసీ కెమెరాలు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. నేరనియంత్రణలో భాగంగా వివిధ రాష్ట్రాల పోలీసులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో విభిన్న పద్ధతులను అనుసరిస్తున్నారు. ఏయే రాష్ట్రాల్లోని కెమెరాల్లో ఎలాంటి సాంకేతికత ఉంది? అవి నేర నిర్ధారణలో ఎలా ఉపకరిస్తున్నాయో చూద్దాం.

నేరస్థుల వినూత్న వ్యూహాలను కూడా ఎప్పటికప్పుడు ఛేదించేలా వివిధ రాష్ట్రాల పోలీసులు కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌)తో కూడిన అధునాతన సీసీ కెమెరాలను సమకూర్చుకుంటున్నారు. నేరగాళ్లు వాటికంట్లో పడ్డారో... వెంటనే అవి పోలీసులకు సమాచారం ఇస్తాయి. కోపం, భయం, ఆందోళన వంటి భావోద్వేగాలను గుర్తించి స్పందించే వాటినీ కొన్ని రాష్ట్రాల యంత్రాంగం వినియోగిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు ఒక అడుగు ముందుకేసి ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ కలిగిన కంటి అద్దాలను వినియోగించే దిశగా కసరత్తు చేస్తున్నారు. పరిమిత పోలీసు వనరులు ఉన్న పరిస్థితుల్లో ఆధునిక త్రినేత్రాలు నేరనియంత్రణలో ఎంతగానో దోహదం చేస్తున్నాయని ఉన్నతాధికారులు చెబుతున్నారు.

కొద్ది నెలల క్రితం గుర్తుతెలియని వ్యక్తి సికింద్రాబాద్‌ తపాలా కార్యాలయం నుంచి 62 పార్శిళ్లు బుక్‌ చేశారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, డీజీపీ మహేందర్‌రెడ్డి, హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ సహా పోలీస్‌ అధికారులు, ప్రముఖ సినీ నటుల చిరునామాలను వాటిపై రాశారు. అక్కడి సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు అతన్ని గుర్తించేందుకు నగరంలోని కృత్రిమమేధతో కూడిన సీసీ కెమెరాల దృశ్యాలను విశ్లేషించారు. అనుమానమున్న ఆటోలు, కార్లు, వ్యాన్ల నంబర్లను శోధించారు. ప్యాట్నీ క్రాస్‌రోడ్‌ వద్ద ఓ ఆటోలో నిందితుడు పోస్టాఫీస్‌ వద్దకు వచ్చినట్టు గుర్తించారు. ఎట్టకేలకు నిందితుడి చిరునామా తెలుసుకుని 48 గంటల్లోనే అతడిని అరెస్టు చేశారు.
* సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు టి.సుబ్బిరామిరెడ్డి సోదరుడు టి.ఉత్తమ్‌రెడ్డి ఇంట్లో రూ.2 కోట్ల విలువైన వజ్రాలు, బంగారు ఆభరణాల దోపిడీ కేసునూ తెలంగాణ పోలీసులు ఇలాగే ఛేదించారు. ఆటోమేటిక్‌ నంబరు ప్లేట్‌ రీడింగ్‌(ఏఎన్‌పీఆర్‌) సాఫ్ట్‌వేర్‌ సాయంతో సగం మాత్రమే కన్పిస్తున్న కారు నంబరు ఆధారంగా దిల్లీలో ఉంటున్న ఘరానా నిందితుడిని పట్టుకున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో కళ్లద్దాలతో కట్టడి!

ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు కృష్ణా, అనంతపురం, కడప జిల్లాల్లో ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ కెమెరాలను ఉపయోగిస్తున్నారు. వీటికి అదనంగా కృత్రిమ మేధతో కూడిన కంటి అద్దాలను సమకూర్చుకోబోతున్నారు. వీటికున్న సాఫ్ట్‌వేర్‌లో పాత నేరస్థులు, దొంగలు సహా సంఘ విద్రోహశక్తులకు సంబంధించిన 10 లక్షల ముఖాలను నమోదు చేయవచ్చు. ఆ వ్యక్తులు మారువేషాల్లో ఉన్నా గుర్తించడం వీటి ప్రత్యేకత. ఇవి సెకనుకు పదిహేను ముఖాలను గుర్తిస్తాయి. రష్యా సాంకేతిక పరిజ్ఞానంతో ఈ అద్దాలను తయారు చేస్తున్న ఓ ప్రముఖ కంపెనీతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కూడా కుదుర్చుకుంది. రెండు, మూడు నెలల్లో వీటిని కొనుగోలు చేయనున్నారు.

ముఖంలో భయం, ఆందోళన కనిపిస్తే పోలీసులొస్తారు

ఉత్తరప్రదేశ్‌ రాజధాని లఖ్‌నవూ నగరంలో మహిళలు, యువతులను వేధించే పోకిరీల ఆటకట్టించేందుకు పోలీసులు భావోద్వేగాలను గుర్తించే సాంకేతికతతో కూడిన కెమెరాలను వినియోగిస్తున్నారు. వేధింపులు ఎక్కువగా జరుగుతున్న 200 ప్రాంతాల్లో వాటిని రహస్యంగా అమర్చారు. వేధింపులకు గురయ్యే బాధితుల ముఖాల్లో సహజంగానే భయం, బాధ, ఆందోళన కన్పిస్తాయి. ఈ కెమెరాలు ఆయా భావోద్వేగాలను గుర్తించి సంబంధిత ఠాణాకు సమాచారం ఇస్తాయి. ఎవరూ ఫిర్యాదు చేయకున్నా, అవిచ్చే సమాచారం ఆధారంగా నిమిషాల వ్యవధిలో పోలీసులు అక్కడికి చేరుకుని ఆకతాయిల ఆటకట్టిస్తారన్న మాట. గత నెల 20న వీటిని అమర్చగా, తర్వాత పది రోజుల్లోనే 400 మంది పోకిరీలకు అరదండాలు వేయగలిగారు.

దిల్లీలో ఉగ్రముప్పును పసిగట్టే కెమెరాలు

దేశ రాజధాని దిల్లీలో ఉగ్రవాదులు, వారి అనుచరుల సంచారం తరచూ బయటపడుతూ ఉంటుంది. అలాంటి ఉగ్రమూకలను గుర్తించేందుకు దిల్లీ పోలీసులు ఇప్పటికే ముఖాల్ని గుర్తించే కెమెరాలను వినియోగిస్తున్నారు. వీటికి కొనసాగింపుగా మరింత అత్యాధునికమైన 15 వేల సీసీ కెమెరాలను సమకూర్చుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉగ్రవాద సంస్థల్లోని సభ్యులు, వేర్వేరు ప్రాంతాల్లో పట్టుబడిన, అనుమానితుల ఫొటోలు, వారికి సంబంధించిన ఇతర సమాచారాన్ని ఈ కెమెరాల్లో నిక్షిప్తం చేశారు. అలాంటి వారు నగరంలో ప్రవేశించగానే ఈ కెమెరాలు గుర్తించి కంట్రోల్‌రూంను అప్రమత్తం చేస్తాయి. ఈ కెమెరాల పనితీరును పరిశీలించేందుకు, ఎప్పటికప్పుడు సమాచారాన్ని అప్‌డేట్‌ చేసేందుకు వీలుగా జాతీయ ఫోరెన్సిక్‌ ప్రయోగశాల, దిల్లీ ఐఐటీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. మొన్నటి గణతంత్ర దినోత్సవం రోజు ఎర్రకోట వద్ద జరిగిన అల్లర్లలో పాల్గొన్న వారిని ప్రయోగాత్మకంగా అమర్చిన ఈ కెమెరాల ద్వారానే గుర్తించారు.

భయంలేని ముంబయి

నేర పరిశోధనలో ముంబయి పోలీసులు శాస్త్రీయ పద్ధతులతో పాటు కృత్రిమ మేధతో కూడిన సీసీ కెమెరాలను మూడేళ్లుగా వినియోగిస్తున్నారు. కరడుగట్టిన నేరస్థులు, మాఫియా ముఠాల్లోని వ్యక్తుల ఫొటోలను ఓ సాఫ్ట్‌వేర్‌ ద్వారా వాటిలో నిక్షిప్తం చేశారు. నగరంలో నేరగాళ్ల సంచారం ఎక్కడున్నా గుర్తించి పోలీసులను అప్రమత్తం చేయడం వీటి ప్రత్యేకత. గత ఏడాది కొవిడ్‌ విజృంభిస్తున్న సమయంలో కట్టడి చేసేందుకు సీసీ కెమెరాలు ఎంతగానో కృషిచేశాయి. ముంబయి మహా నగరం, నవీ ముంబయిలోని అధికారులు ప్రజలు వ్యక్తిగత దూరం పాటిస్తున్నారా? లేదా? అనేది వీటి దృశ్యాల ఆధారంగానే గుర్తించి కట్టడి చర్యలు అమలు చేశారు.

దర్యాప్తులో వేగం..ఆధారాల సేకరణలో కచ్చితత్వం..

దేశంలో మెట్రోనగరాలు, పట్టణాల్లో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పోలీసు బలగాల సంఖ్య పెరగడంలేదు. దేశ జనాభాలో ప్రతి 761 మందికి ఒక పోలీసే ఉన్నారు. ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్ర, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌ వంటి రాష్ట్రాల్లో 950 మందికి ఒకరున్నారు. ఈ క్రమంలోనే పోలీసు యంత్రాంగం సాంకేతికతపై ఆధారపడుతోంది.. ‘నేరాన్ని నిరూపించే ఆధారాల సేకరణకు, వేగవంతమైన విచారణకు సాంకేతికత ఉపకరిస్తోంది. ఉదాహరణకు హైదరాబాద్‌ పరిధిలో గొలుసు దొంగతనం జరిగిందనుకుంటే ఈ ప్రాంతంలో ఎంతమంది గొలుసు దొంగలున్నారు? వారిలో జైల్లో ఉన్నవారెందరు? జైలు నుంచి విడుదలైన వారెందరు? వాళ్లు ఏయే చిరునామాల్లో ఉన్నారనేది సాఫ్ట్‌వేర్‌ విశ్లేషిస్తుంది. ఆ ప్రాంతంలో గతంలో ఇలాంటి ఎన్ని ఘటనలు జరిగాయో వివరిస్తుంది. అక్కడున్న సీసీ కెమెరాల్లోని దృశ్యాల ఆధారంగా చేసింది పాత నేరస్థుడా? లేక కొత్తవాడా? అనేదీ చెబుతుంది. దీనివల్ల నేర నిర్ధారణలో కచ్చితత్వం ఉంటుంది. కేసును త్వరగా ఛేదించడం సాధ్యమవుతుంద’ని పోలీసు అధికారులు చెబుతున్నారు.

ఇదీ చదవండి: నడ్డా సమక్షంలో భాజపాలో చేరిన శ్రీశైలం గౌడ్‌

    About us Privacy Policy
    Terms & Conditions Contact us

    • ETV
    • ETV
    • ETV
    • ETV

    Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
    ETV

    INSTALL APP

    ETV

    CHANGE STATE

    ETV

    SEARCH

    ETV

    MORE

      • About us
      • Privacy Policy
      • Terms & Conditions
      • Contact us
      • Feedback

      Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.