
14:17 February 23
రేపటి నుంచి 6, 7, 8 తరగతులు ప్రారంభం: సబిత
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో ఆరు నుంచి ఎనిమిది వరకు తరగతులకు రేపటి నుంచి ప్రత్యక్ష బోధన ప్రారంభించాలని విద్యాశాఖ నిర్ణయించింది. తల్లిదండ్రుల లిఖిత పూర్వక అనుమతి ఉంటేనే విద్యార్థులను అనుమతించాలని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు మంత్రి సబితాఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. ఈ నెల 1 నుంచి పాఠశాలల్లో తొమ్మిది, పదో తరగతితో పాటు ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ ప్రత్యక్ష తరగతులు ప్రారంభమయ్యాయి. క్రమక్రమంగా విద్యార్థుల సంఖ్య పెరగడంతో పాటు... ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదని మంత్రి వెల్లడించారు. మరోవైపు 1 నుంచి 8 తరగతులు కూడా ప్రారంభించాలని విద్యాసంస్థలు, ఉపాధ్యాయ సంఘాలు ఒత్తిడి తెచ్చాయి. విద్యాసంస్థల నిర్వహణపై ఇటీవల సమీక్ష జరిపిన మంత్రి, ఉన్నతాధికారులు.. ఆరు నుంచి 8 తరగతులు కూడా ప్రారంభించాలని ప్రతిపాదించారు.
విద్యాసంస్థలు, విద్యార్థులు భౌతిక దూరం, మాస్కులు, శానిటైజర్ల వంటి మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. కనీస హాజరు తప్పనిసరి కాదని... ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు పై తరగతులకు ప్రమోట్ చేయనున్నట్లు విద్యాశాఖ గతంలోనే ప్రకటించింది. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఈ విద్యా సంవత్సరం ఆన్లైన్ బోధనతోనే పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకు తరగతులు ప్రారంభమవుతున్నందున తమను విధుల్లోకి తీసుకోవాలని విద్యా వాలంటీర్లు, ఆర్ట్స్, క్రాఫ్ట్స్, కంప్యూటర్ పార్ట్ టైం ఉపాధ్యాయులు కోరుతున్నారు.
ఇదీ చూడండి: 'విద్యార్థులూ.. ఈ మూడింటిపై దృష్టి పెట్టండి'