
యాభై ఏళ్లకు పైబడినవారికి, ఆలోపు వయసున్న దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి టీకాల పంపిణీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాష్ట్రంలో 80 లక్షలమందికి టీకాలివ్వాలని నిర్ణయించగా... అందులో 70 లక్షలకుపైగా 50 ఏళ్లకు పైబడినవారే ఉన్నారు.
కొవిడ్ టీకాను ప్రస్తుతం వైద్యసిబ్బందికి, పోలీసు, రెవెన్యూ, పురపాలక, పంచాయతీ సిబ్బందికి ఇస్తుండగా.. 50 ఏళ్లు పైబడినవారికి, ఆలోపు వయసులో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి టీకాలను ఎప్పట్నించి పంపిణీ చేస్తారనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. రాష్ట్రంలో మొత్తం 80 లక్షలమందికి టీకాలను పంపిణీ చేయాలని నిర్ణయించగా.. అందులో దాదాపు 70 లక్షలమంది 50 ఏళ్ల పైబడినవారు, సుమారు 4 లక్షలమంది ఆ వయసులోపు దీర్ఘకాలిక రోగులుంటారని అంచనా. అంటే తొలివిడతలో మొత్తం టీకాలు పొందడానికి అర్హుల్లో దాదాపు 92.5 శాతంమంది ఈ రెండు కేటగిరీలకు చెందినవారే. ఇప్పటి వరకూ స్పష్టత లేకపోయినా.. వైద్యవర్గాల సమాచారం మేరకు మార్చి రెండో వారం నుంచి ఈ రెండు విభాగాల వారికి టీకాలను పంపిణీ చేయనున్నట్లు తెలుస్తోంది. కొవిన్ యాప్‌లో వీరి సమాచారాన్ని పొందుపరచడం కూడా అప్పుడే ప్రారంభమవుతుందని వైద్యవర్గాలు తెలిపాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులతో పాటు విద్యాలయాలు, వసతిగృహాలు, సామాజిక భవనాల్లోనూ విస్తృతంగా పంపిణీ కేంద్రాలను నెలకొల్పాలని నిర్ణయించారు.
ఫోన్ ద్వారా ఎవరికివారే నమోదు
ప్రస్తుతం కొవిన్ వెబ్ యాప్ అందుబాటులో ఉండగా.. మార్చి తొలివారంలో మొబైల్ ఫోన్ల ద్వారా ఎవరికి వారు సొంతంగా నమోదు చేసుకునేందుకు వీలుగా కొవిన్ యాప్ అందుబాటులోకి రానున్నట్లు వైద్యవర్గాలు తెలిపాయి. ఒకవేళ మొబైల్‌లో నమోదు చేసుకోవడానికి వీలుపడని వారికి వైద్యసిబ్బందే వెబ్ యాప్ సాయంతో సమాచారాన్ని పొందుపరుస్తారు. అయితే ఈ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రారంభిస్తుందని వైద్యవర్గాలు పేర్కొన్నాయి. టీకాలను వేయించుకోడానికి గడువు ఏమీ ఉండదనీ, నిరంతరాయంగా పంపిణీ కొనసాగుతుందని తెలిపాయి. దాదాపు 74 లక్షలమందికి టీకాలను పంపిణీ చేయడానికి కనీసం ఏడాది కాలం పట్టే అవకాశం ఉందని సమాచారం.
ఇదీ చూడండి: కేసుల పెరుగుదలపై అప్రమత్తం..'మహా'లో ఆంక్షలు