
సీఎం కేసీఆర్‌కు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి లేఖ రాశారు. గిరిజన రైతులపై అటవీ అధికారులు అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారని సీఎం దృష్టికి తీసుకొచ్చారు. గిరిజన రైతులకు పట్టాలు ఇస్తామని గిరిజనుల అటవీ హక్కు చట్టాన్ని కాపాడుతామని ఇచ్చిన హామీలు ఇప్పటి వరకు నెరవేర్చలేదని ఆక్షేపించారు.
అటవీ అధికారులు గిరిజనులపై కక్షపూరితంగా వ్యవహారిస్తున్నారని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు. 70 ఏళ్లుగా అటవీభూముల్లో సాగుచేసుకుంటూ బతుకుతున్న గిరిజన రైతులపై అటవీ అధికారులు అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారని సీఎం దృష్టికి తీసుకొచ్చారు. ఈ మేరకు కోమటిరెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు. మాయమాటలతో బహుజన దళిత మైనార్టీలతో పాటు గిరిజనులను మోసం చేస్తున్నారని పేర్కొన్నారు.
అసెంబ్లీ సాక్షిగా పోడు భూములపై గిరిజన రైతులకు హక్కులు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తామని హామీ ఇచ్చారని ఎంపీ గుర్తు చేశారు. గిరిజన రైతులకు పట్టాలు ఇస్తామని వారి అటవీ హక్కు చట్టాన్ని కాపాడుతామని ఇచ్చిన హామీలు ఇప్పటి వరకు నెరవేర్చలేదని ఆక్షేపించారు.
ఖమ్మం, ఆదిలాబాద్, వరంగల్ ఇలా అన్ని జిల్లాల్లోని తండాలు, గూడెంకు చెందిన గిరిజనులపై అక్రమ కేసులను నమోదు చేసి పంటలను సైతం ధ్వంసం చేసి రైతులకు కన్నీళ్లు మిగిల్చుతున్నారని ఎంపీ వివరించారు. ఇకనైనా... ఇలాంటి చర్యలు మానుకోకపోతే రానున్న రోజుల్లో ప్రభుత్వంపై పోరాడేందుకు కాంగ్రెస్ పార్టీ వెనుకడుగు వేయదని స్పష్టం చేశారు.