మీ మెదడు పనితీరు మెరుగుపడాలా ? అయితే ఇవి తినాల్సిందే.!
Breaking

చదువు ఒత్తిడిలో ఉండే విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి. పోషకాహారం లోపం రాకుండా తల్లిదండ్రులు జాగ్రత్త పడాలి. కరోనా వల్ల సెలవులు కుదించి పరీక్షల తేదీలు ప్రకటించడంతో విద్యార్థుల మెదడుపై ప్రభావం చూపుతుంది. వారు ఆందోళనకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒత్తిడి, ఆందోళన తగ్గించేందుకు క్రమం తప్పకుండా కొన్ని ఆహార పదార్థాలను కచ్చితంగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇది కేవలం పిల్లలకే కాదండోయ్​.. పని ఒత్తిడిలో ఉండే పెద్దల మెదడు పనితీరుపై ప్రభావం చూపుతాయి. అవేంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఓ లుక్కేయండి.

కరోనా విరామం తర్వాత ఇప్పుడిప్పుడే పాఠశాలలు, విద్యాసంస్థలు ప్రారంభమవుతున్నాయి. దీంతో పిల్లలు మళ్లీ స్కూలుకెళ్లి పుస్తకాలు పట్టుకునే సమయం ఆసన్నమైంది. అయితే ఇన్ని రోజుల కరోనా విరామాన్ని కవర్‌ చేస్తూ ఇంత తక్కువ సమయంలో విద్యా సంవత్సరాన్ని పూర్తి చేయాలంటే కత్తి మీద సామే. ఈ క్రమంలో సెలవులు లేకుండా తరగతులు కొనసాగించడం, వరుసగా పరీక్షల తేదీలు కూడా ప్రకటిస్తుండడంతో చాలామంది విద్యార్థులు ఒత్తిడి, ఆందోళనకు గురయ్యే ప్రమాదం ఉంది. పోషకాహార లోపంతో మెదడు సంబంధిత సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. అయితే ఇలాంటి ఒత్తిడి, ఆందోళనను తగ్గించుకోవడంతో పాటు మెదడు పనితీరును మెరుగుపరుచుకోవడానికి కొన్ని ఆహార పదార్థాలను క్రమం తప్పకుండా తీసుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. మరి కేవలం పిల్లలకే కాదు...పెద్దల విషయంలోనూ మెదడు పనితీరుపై ప్రభావం చూపే ఆ ఆహార పదార్థాలేంటో మనమూ తెలుసుకుందాం రండి...

నట్స్‌, సీడ్స్

శరీరానికి అందే శక్తిలో సుమారు 20 శాతం వరకు మెదడుకు వెళుతుందంటారు. అందుకే మెదడు పనితీరును మెరుగుపరుచుకోవాలంటే జీడిపప్పు, బాదం, పిస్తా, వాల్‌నట్స్‌ వంటి గింజలు, విత్తనాలు అధికంగా తీసుకోవాలి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు వీటిలోని విటమిన్‌-ఇ శరీరంలోని ఆక్సీకరణ ఒత్తిడిని (ఆక్సిడేటివ్‌ స్ట్రెస్) నిరోధిస్తుంది.

nuts
నట్స్​

ఇక గుమ్మడికాయ గింజలు, అవిసె గింజల్లో ఉండే జింక్‌, మెగ్నీషియం, విటమిన్‌-బి... తదితర పోషకాలు జ్ఞాపకశక్తి సామర్థ్యాన్ని పెంచుతాయి. వివిధ రకాల గింజలు, విత్తనాలను రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటే మేధోపరమైన సమస్యలకు దూరంగా ఉండవచ్చని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.

వేరుశెనగ

ఎప్పుడైతే శరీరంలో సెరటోనిన్‌ అనే రసాయన స్థాయిలు తగ్గిపోతాయో... అప్పుడే ఒత్తిడి, ఆందోళనలు మొదలవుతాయట. దీన్ని మెదడులో ఎక్కువగా ఉత్పత్తి చేసే ట్రిప్టోఫాన్‌ వేరుశెనగలో అధికంగా లభిస్తుంది. కాబట్టి వేరుశెనగను ఎంత ఎక్కువగా తీసుకుంటే అంత ప్రశాంతత చేకూరుతుంది. ఇందులోని అన్‌శ్యాచురేటెడ్‌ కొవ్వులు, ప్రొటీన్లు శరీరానికి తక్షణ శక్తినివ్వడమే కాకుండా మెదడును ఉత్తేజపరుస్తాయి. అదేవిధంగా నియాసిన్‌, రైబోఫ్లేవిన్‌, థయమిన్‌, బి-కాంప్లెక్స్‌ విటమిన్లు, కాపర్‌, మెగ్నీషియం, క్యాల్షియం, జింక్, సెలీనియం, మాంగనీస్‌, పొటాషియం... వంటి పోషకాలు శరీరంలోని అవయవాల పనితీరును మెరుగుపరుస్తాయి.

groundnut
వేరుశనగ

ఆకుకూరలు

బ్రొకోలీ, క్యాలీఫ్లవర్‌, క్యాబేజీ.. లాంటి కూరల్లో కె, సి, ఇ-విటమిన్లు, ఫ్లేవనాయిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి మెదడు సంబంధిత ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. వీటిలోని గ్లూకోసినోలేట్స్ అనే సమ్మేళనం శరీరంలోని ఆక్సిడేటివ్‌ స్ట్రెస్‌ను తగ్గిస్తుంది. అల్జీమర్స్‌ లాంటి వ్యాధిగ్రస్తులకు ఇవి మంచి పోషకాహారం. బ్రొకోలీలో క్యాలరీలు తక్కువగా, డైటరీ ఫైబర్‌ ఎక్కువగా ఉంటుంది. బరువు తగ్గాలనుకునేవారు దీనిని రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి.

vegetables
కూరగాయలు, ఆకుకూరలు

ఇక బీట్‌రూట్‌ కేవలం శరీరంలో రక్తాన్ని పెంచడంలోనే కాదు.. మెదడుకు సరిపడా రక్తాన్ని సరఫరా చేయడంలో కూడా తోడ్పడుతుంది. ఫలితంగా మెదడు చురుగ్గా పనిచేయడంతో పాటు జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది.

పసుపు

పసుపులోని కర్క్యుమిన్‌ అనే పదార్థం అల్జీమర్స్ వ్యాధి తీవ్రతను తగ్గించడంలో బాగా తోడ్పడుతుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. కాబట్టి దీన్ని ఆహారంలో భాగం చేసుకోవడం మంచిది. ప్రస్తుతమున్న కరోనా పరిస్థితుల్లో గోరువెచ్చటి పాలలో చిటికెడు పసుపు కలుపుకొని తాగితే అటు ఆరోగ్యం... ఇటు జ్ఞాపక శక్తి... రెండూ సొంతమవుతాయి.

ఈ పండ్లు తినాల్సిందే!

* స్ట్రాబెర్రీ, బ్లూ బెర్రీ, బ్లాక్‌ బెర్రీ, రాస్బెర్రీ లాంటి బెర్రీ జాతికి చెందిన పండ్లలో యాంథోసైనిన్‌ అనే యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి మెదడు పనితీరును బాగా ప్రభావితం చేస్తాయి. ప్రత్యేకించి మెదడులో ఏర్పడే ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. బెర్రీ పండ్లను రోజూ తీసుకోవడం వల్ల అన్ని వయసుల వారిలోనూ జ్ఞాపకశక్తి సామర్థ్యం పెరుగుతుందని పలు అధ్యయనాల్లో తేలింది.

strawberry
స్ట్రాబెర్రీలు

* యాపిల్స్‌పై ఉండే తొక్కలో జ్ఞాపకశక్తిని పెంచే క్వెర్సెటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్‌ ఉంటుంది. కాబట్టి రోజూ యాపిల్స్‌ను తొక్కతో పాటుగా తినడం అలవాటు చేసుకోవాలి. దీనివల్ల అటు శరీరానికి శక్తి అందుతుంది... మెదడు చురుగ్గా పనిచేస్తుంది. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణ ప్రక్రియకూ ఎంతో మంచిది.

* ఇక అవకాడోల్లో ఉండే అన్‌శ్యాచురేటెడ్‌ కొవ్వులు మెదడుకు రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి.

* వీటితో పాటు సి-విటమిన్ అధికంగా లభించే నిమ్మ, దానిమ్మ.. వంటి సిట్రస్ జాతికి చెందిన పండ్లను తీసుకోవడం వల్ల జ్ఞాపకశక్తిని బాగా పెంచుకోవచ్చు.

తేనె

మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగించి మెదడును చురుగ్గా మార్చడంలో తేనె బాగా పనిచేస్తుంది. ఇందులోని మాంగనీస్, ఫాస్ఫరస్, పొటాషియం, బి- విటమిన్‌.. మొదలైనవన్నీ మెదడు ఆరోగ్యానికి సహకరిస్తాయి. వీటితో పాటు తేనెలో ఉండే ఫ్రక్టోజ్‌ మెదడుకు ఇంధనంలా పనిచేసి దాని పనితీరును రెట్టింపు చేస్తుంది.

సాల్మన్‌ చేపలు

ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా లభించే సాల్మన్‌, ట్రౌట్‌, సార్డినెస్‌ చేపలను ఆహారంలో భాగం చేసుకుంటే మెదడు కణాల ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. డిప్రెషన్‌, యాంగ్జైటీ లాంటి సమస్యల నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు.

salman fish
సాల్మన్​ చేపలు

డార్క్‌ చాక్లెట్

డార్క్ చాక్లెట్లలో సమృద్ధిగా లభించే కెఫీన్, యాంటీ ఆక్సిడెంట్లు మెదడును చురుగ్గా ఉంచుతాయి. ఇందులోని ఫ్లేవనాయిడ్లు మెదడులో రక్తప్రసరణ సక్రమంగా జరిగేందుకు సహాయపడతాయి. కాబట్టి జ్ఞాపక శక్తిని రెట్టింపు చేసుకోవాలంటే రోజుకో ఒక డార్క్‌ చాక్లెట్‌ తినడం మంచిది.

dark chocolate
డార్క్​ చాక్లెట్​

గుడ్లు!

మెదడు చురుగ్గా పని చేయాలన్నా, జ్ఞాపకశక్తి పెరగాలన్నా న్యూరోట్రాన్స్మిటర్గా పని చేసే ఎసిటైల్కోలీన్ చాలా కీలకం. గుడ్లలో అధికంగా ఉండే కోలీన్ ఎసిటైల్కోలీన్ల ఉత్పత్తికి బాగా సహకరిస్తుంది. వీటిలోని ఫాస్పోలిపిడ్స్‌ మెదడుకు, నాడీ వ్యవస్థకు చాలా అవసరం. ఇందులోని పోషకాలు మెదడులోని కణాలను ఆరోగ్యంగా మారుస్తాయి.

గ్రీన్‌ టీ

జ్ఞాపకశక్తిని పెంచడంలో గ్రీన్ టీ బాగా సహకరిస్తుంది. ఇందులోని కెఫీన్‌ మెదడును బాగా ప్రభావితం చేస్తుంది. కాబట్టి రోజూ కనీసం మూడు కప్పుల గ్రీన్‌టీ తాగితే అటు శరీరానికి, ఇటు మెదడు పనితీరుకు చాలా మంచిది. ప్రత్యేకించి అల్జీమర్స్, పార్కిన్సన్‌ వ్యాధుల తీవ్రతను తగ్గించడంలో ఈ పానీయం బాగా ఉపయోగపడుతుంది.

green tea
గ్రీన్​ టీ

టమాటాలు, ఆలివ్‌ నూనె, ఆస్పరాగస్‌, పాలకూర.. వంటి వాటిల్లో కూడా మెదడు పనితీరును మెరుగుపరిచే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. మరి వీటన్నింటినీ రోజూ ఆహారంలో భాగం చేసుకుని మంచి జ్ఞాపకశక్తితో మెదడును చురుగ్గా ఉంచుకోవడంతో పాటు.. చక్కని ఆరోగ్యాన్ని కూడా మీ సొంతం చేసుకోండి.

ఇదీ చూడండి : సిద్దిపేటలో చార్​ధామ్‌ నమూనా సెట్​కు మంత్రి హరీశ్​రావు భూమి పూజ

    About us Privacy Policy
    Terms & Conditions Contact us

    • ETV
    • ETV
    • ETV
    • ETV

    Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
    ETV

    INSTALL APP

    ETV

    CHANGE STATE

    ETV

    SEARCH

    ETV

    MORE

      • About us
      • Privacy Policy
      • Terms & Conditions
      • Contact us
      • Feedback

      Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.