
తమ పట్టా భూమిని ఆక్రమించుకునేందుకు కొందరు యత్నిస్తున్నారని ఆరోపిస్తూ ఓ దళిత కుటుంబం.. కలెక్టర్ ఎదుట ఆత్మహత్యకు యత్నించింది. రక్షణ సిబ్బంది అప్రమత్తమై వారిని రక్షించారు. నిర్మల్ జిల్లా కలెక్టరేట్లో ఈ ఘటన చోటుచేసుకుంది.
నిర్మల్ జిల్లా కలెక్టర్ ఎదుట ఓ దళిత కుటుంబం ఆత్మహత్యకు యత్నించింది. తమ పట్టాభూమిని దౌర్జన్యంగా ఆక్రమించుకునేందుకు కొందరు యత్నిస్తున్నారని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు పురుగుల మందు తాగేందుకు యత్నించారు. సోన్ మండలం సిద్ధిలకుంట గ్రామానికి చెందిన సాగర్, పూర్ణచందర్, భోజన్వ ఒకే కుటుంబ సభ్యులు. ప్రజావాణిలో భాగంగా కలెక్టర్ ముషర్రఫ్ అలీ ఫారూఖీకి తమ సమస్యను వివరించేందుకు కార్యాలయానికి వెళ్లారు.
దళిత కుటుంబమైన తమపై బెదిరింపులకు పాల్పడుతూ కొంతమంది గ్రామస్థులు భూమిని లాక్కునేందుకు యత్నించారని బాధితులు ఆరోపించారు. పాతికేళ్లుగా ఆ స్థలానికి పట్టాదారులుగా ఉన్నా ఇబ్బందులకు గురిచేస్తూ, కులబహిష్కరణ చేసి వేధిస్తున్నారని ఆరోపించారు. తాజాగా.. తమ భూమిని ఇళ్లస్థలాలుగా మార్చి విక్రయించే ఏర్పాట్లు చేస్తుండటంతో చేసేదేం లేక ఇక్కడకు వచ్చామని వాపోయారు. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతూ వెంట తీసుకొచ్చిన పురుగుల మందు తాగేందుకు యత్నించారు. అప్రమత్తమైన రక్షణ సిబ్బంది, పోలీసులు వారిని కాపాడారు.
స్పందించిన కలెక్టర్.. విచారణ చేపట్టి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. పట్టణ సీఐ శ్రీనివాస్.. ఆందోళనకారులకు కౌన్సిలింగ్ నిర్వహించారు.
ఇదీ చదవండి: వ్యవసాయ చెక్‌పోస్టు వద్ద భార్యపై కత్తితో దాడి