
భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు భర్త ప్రాణాన్ని బలిగొన్నాయి. తమ కూతురితో గొడవ పడుతున్నాడని ఆగ్రహానికి గురైన ఆమె తల్లిదండ్రులు అల్లుడిని చితకబాదారు. అదే కోపంలో బయటకు నెట్టేయడంతో గుంతలో పడి మృతి చెందాడు. పథకం ప్రకారమే హత్య చేశారని మరోవైపు మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా సదాశివనగర్‌లో చోటు చేసుకుంది.
కామారెడ్డి జిల్లా షాబ్దిపూర్ గ్రామానికి చెందిన మహేశ్‌కు... సదాశివనగర్‌కు చెందిన రోజాతో 9 ఏళ్ల కిందట వివాహం జరిగింది. వారికి ఒక కుమారుడు, కూతురు ఉన్నారు. మహేశ్‌కు షాబ్దిపూర్లో సరైన ఉపాధి లభించకపోవడంతో పెళ్లైన ఏడాది తరువాత తన కుటుంబ సభ్యులతో కలిసి సదాశివనగర్‌లో నివాసం ఉంటున్నాడు.
కొన్ని రోజుల నుంచి రోజా పిల్లలను తీసుకుని ఆమె తల్లిదండ్రుల వద్దకు వెళ్లింది. మహేశ్ ఎంత బతిమిలాడినా వచ్చేందుకు నిరాకరించడంతో... పెద్దల సమక్షంలో మాట్లాడి రోజాను ఇంటికి పంపించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో ఆమెను తీసుకురావడానికి సోమవారం మధ్యాహ్నం మహేశ్ అత్తగారింటికి వెళ్లాడు. రాత్రి సమయంలో భార్యాభర్తలు మధ్య గొడవ జరిగింది.
దీంతో ఆగ్రహానికి గురైన రోజా తల్లిదండ్రులు మహేశ్‌ను చితక బాదారు. అనంతరం బయటకు నెట్టివేయడంతో గుంతలో పడి మృతి చెందారు. మహేశ్ అత్తమామలు ఆయనను కావాలనే హత్య చేశారని... మృతుని బంధువులు ఆరోపిస్తూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సదాశివనగర్ పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి: రేపటి నుంచి 6, 7, 8 తరగతులు ప్రారంభం: సబిత