ఎవరితో మాట్లాడినా అనుమానమే.. ఆయన్ని మార్చేదెలా?
how

అతని ఉన్నత భావాలు.. ఆమెను ఆకట్టుకున్నాయి. విశాల దృక్పథం.. అతని వైపు అడుగులు వేసేలా చేసింది. ఇద్దరి మనసులూ కలుసుకున్నాయి. ప్రేమ చిగురించింది. పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. తర్వాత ప్రేమ స్థానంలో అనుమానం చేరింది. ఇప్పుడు తన భర్తను ఎలా మార్చుకోవాలో తెలీక సతమతమవుతోంది.

నా పేరు ప్రవళిక. నాకు పెళ్లయి మూడేళ్లవుతోంది. నాకు ఒక బాబు కూడా ఉన్నాడు. నాది ఒక విచిత్రమైన సమస్య. మాది ప్రేమ వివాహం. నేను ఇంజినీరింగ్ చదువుతున్న రోజుల్లో కళాశాలలో నిర్వహించే అన్ని కార్యక్రమాల్లోనూ ఉత్సాహంగా పాల్గొనేదాన్ని. అందుకే కల్చరల్ ఈవెంట్స్ టీంలో సభ్యురాలిగా చేర్చుకున్నారు. మా బృందానికి ఆదిత్య లీడర్. చెరగని చిరునవ్వుతో హుందాతనానికి మరో రూపులా ఉండేవాడు. చాలా తక్కువగా మాట్లాడేవాడు. చెప్పాలనుకున్న విషయాన్ని మాత్రం కచ్చితంగా చెప్పేవాడు. మేం చేయాల్సిన పనులను సమయానికి పూర్తయ్యేలా ప్లాన్ చేసేవాడు. కేవలం ప్లానింగ్ వరకే తను ఆగిపోలేదు. మా వెంటపడి మరీ మాకప్పగించిన పనులను పూర్తి చేయించేవాడు. ఇలా జరుగుతున్న క్రమంలోనే మా ఇద్దరి మధ్యా స్నేహం కుదిరింది.

howcanichange650-1.jpg
ఎవరితో మాట్లాడినా అనుమానమే


ఆదిత్య తనకంటూ కొన్ని నియమాలు పెట్టుకున్నాడు. వాటిని మీరి ఎప్పుడూ ఏ పనీ చేసేవాడు కాదు. ఒకసారి కాలేజీలో వక్తృత్వ పోటీ ఏర్పాటు చేశారు. అందులో ఎవరు, ఏ అంశం మీదైనా మాట్లాడొచ్చు. కానీ దాని వల్ల సమాజానికి ఏదైనా ఉపయోగం ఉండాలి. అందులో మా భాగస్వామ్యం కచ్చితంగా ఉండాలి. పైకి చాలా సింపుల్‌గా కనిపిస్తున్నా ఇది కాస్త కష్టమైనదే. మా కాలేజీలో ఎప్పుడు వక్తృత్వ పోటీలు పెట్టినా.. ఎక్కువ మందే పాల్గొనేవారు. ఆరోజు మాత్రం పట్టుమని పదిమంది కూడా మాట్లాడలేదు. కానీ ఆదిత్య ఇచ్చిన ఉపన్యాసం మాత్రం అందర్నీ కట్టిపడేసింది. తనకున్న ఆదర్శభావాలు.. సమాజం పట్ల తన ఆలోచనలు.. భవిష్యత్తులో తాను చేయాలనుకుంటున్న మంచి పనుల గురించి వివరించాడు. అంతే అప్పటి నుంచీ తను మా కాలేజీలో ఒక స్త్టెల్ ఐకాన్‌గా మారిపోయాడు. కొందరైతే అతను చెప్పిన మాటలను ఆచరించడం కూడా మొదలు పెట్టేశారు.అలా అందరిలోనూ తను ప్రత్యేకం అనిపించడంతో పాటు రోజురోజుకీ తన మీద ఇష్టం పెరగడం మొదలైంది.

howcanichange650-3.jpg
ఎవరితో మాట్లాడినా అనుమానమే


ఇలా రోజులు గడుస్తుండగానే కాలేజీ ఫేర్‌వెల్‌డే దగ్గరికి వచ్చేసింది. ఇక ఆలస్యం చేస్తే ఆదిత్యకి నా ప్రేమ గురించి చెప్పే అవకాశం ఉండదని భావించాను. అందుకే ఈ విషయం గురించి తనతో ఎలాగైనా మాట్లాడదామని నిర్ణయించుకున్నాను. కానీ చిత్రంగా అదే రోజు ఆదిత్య నాతో పర్సనల్‌గా మాట్లాడాలని చెప్పాడు. ఎగిరిగంతేసినంత పని చేశాను. నన్ను ప్రేమిస్తున్నానని.. పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నానని.. ఉద్యోగం వచ్చిన వెంటనే మా ఇంటికి వచ్చి మాట్లాడతానని చెప్పాడు. చెప్పినట్టుగానే ఆరునెలల తర్వాత మా ఇంటికి వచ్చాడు. మా పెద్దల్ని పెళ్లికి ఒప్పించాడు. పైసా కట్నం కూడా తీసుకోలేదు. మంచి అల్లుడు దొరికాడని మా అమ్మానాన్న సంబరపడ్డారు. అలా మరో ఆరు నెలల తర్వాత మా పెళ్లి చాలా ఘనంగా జరిగింది.

howcanichange650-4.jpg
ఎవరితో మాట్లాడినా అనుమానమే


మా అత్తారింట్లో కూడా నన్ను బాగా చూసుకున్నారు. నా సంతోషానికి పగ్గాలు వేయడం ఎవరి తరం కాలేదు. మంచి భర్త, మంచి కుటుంబం అని సంబరపడిపోయాను. కానీ రెండు నెలలు కూడా తిరక్కుండానే.. నా ఆశలు అడియాసలయ్యాయి. ఆదిత్య ఉద్యోగం చేసే కంపెనీలోనే నేను కూడా ఉద్యోగం తెచ్చుకున్నాను. ఇద్దరం రోజూ ఆఫీసుకి కలిసే వెళ్లేవాళ్లం. అయితే విధి నిర్వహణలో భాగంగా తోటి ఉద్యోగులతో మాట్లాడాల్సి వచ్చేది. కానీ ఆదిత్య దానికి ఒప్పుకొనేవాడు కాదు. తనతో తప్ప ఏ మగాడితోనూ మాట్లాడటానికి వీల్లేదు అని చెప్పేవాడు. కొత్తలో ఈ మాటలు విని నా మీద ఉన్న ప్రేమకు సంబరపడిపోయేదాన్ని. కానీ రాన్రాను.. ఆ ప్రేమే నన్ను ఓ బందీలా మార్చేసింది. చివరకు ఫోన్లో కూడా ఎవరితోనూ మాట్లాడనిచ్చేవాడు కాదు. నా సెల్‌ఫోన్ తన దగ్గరే పెట్టుకొని ముందు తను మాట్లాడి ఆ తర్వాతే నాకు ఇస్తాడు. సరదాగా షాపింగ్‌కి వెళ్లినా ఇదే తంతు. ఇలా క్రమక్రమంగా ఆదిత్య మనసులో నాకు తెలియకుండానే నా పై ఉన్న ప్రేమ స్థానంలో అనుమానం వచ్చి చేరింది. అనుక్షణం నా మీద నిఘా పెట్టడం మొదలు పెట్టాడు. ఇదంతా ఇబ్బందిగా అనిపించి ఉద్యోగం మానేస్తానంటే అదీ కుదరదట. ఇరవైనాలుగ్గంటలూ తన కళ్ల ముందే ఉండాలట. ఇదంతా చూస్తుంటే తనని ప్రేమించి నేనేమైనా తప్పు చేశానా? అనే భావన కలుగుతోంది.

howcanichange650-2.jpg
ఎవరితో మాట్లాడినా అనుమానమే

చదువుకునే రోజుల్లో అతనిలోని ఆదర్శభావాలు, ఉన్నతమైన ఆలోచనలు చూసి అతన్ని ప్రేమించాను. కానీ ఇప్పుడు అవన్నీ ఎక్కడికి పోయాయో తెలీడం లేదు. కేవలం నా విషయంలో మాత్రమే అతను అలా ప్రవర్తిస్తున్నాడు. ఈ అనుమాన జాడ్యం తప్ప ఆదిత్యకి మరే చెడ్డ అలవాట్లు లేవు. నా మీద ఉన్న అతి ప్రేమే తను ఇలా ప్రవర్తించడానికి కారణం. కానీ దానివల్ల నా ఆత్మాభిమానం దెబ్బతింటుందన్న విషయం కూడా గుర్తించలేకపోతున్నాడు. ఈ విషయం గురించి తనతో ఎన్నిసార్లు మాట్లాడినా ప్రయోజనం కనిపించలేదు. ఒకట్రెండు రోజులు బాగానే ఉన్నా తర్వాత పరిస్థితి మామూలైపోతుంది. ఎప్పటికైనా తనలో మార్పు వస్తుందనే ఆశతో ఎదురుచూస్తున్నా..


జీవితంలో ప్రతిదానికీ హద్దులుంటాయి. అలాగే ప్రేమకి కూడా. అలా హద్దులు మీరిన ప్రేమే ఇప్పుడు నా భర్త మనసులో అనుమానంగా మారింది. దానివల్ల నష్టాలే కానీ ఎలాంటి ప్రయోజనం ఉండదు. పైగా అవతలి వ్యక్తి ఆత్మాభిమానం సైతం దెబ్బ తీయడం వల్ల బంధాలు బీటలు వారే ప్రమాదం ఉంటుంది. ఈ విషయం అందరికీ చెప్పాలనీ.. నా భర్తలోనూ మార్పు రావాలని కోరుకుంటూ.. ఇదంతా పంచుకోవడానికి ఇలా మీ ముందుకొచ్చా..!

ఇట్లు,
ప్రవళిక

  • ఇదీ చూడండి : అరిటాకంతా తమలాపాకంటా..!
    About us Privacy Policy
    Terms & Conditions Contact us

    • ETV
    • ETV
    • ETV
    • ETV

    Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
    ETV

    INSTALL APP

    ETV

    CHANGE STATE

    ETV

    SEARCH

    ETV

    MORE

      • About us
      • Privacy Policy
      • Terms & Conditions
      • Contact us
      • Feedback

      Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.