తువ్వాలు మురికి తొలగించండిలా!

ముఖం కడుక్కోగానే చేతిలోకి రావాల్సిందే. చేతులు శుభ్రం చేసుకున్నా ఇది అవసరమవుతుంది. స్నానానికి సబ్బుతోపాటు ఇది జత కావాల్సిందే.. అదేనండి తువ్వాలు. ఇలా ఎక్కువసార్లు వాడే దీని ఉపయోగం అంతా ఇంతా కాదు. మరి దీన్ని శుభ్రత విషయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో తెలుసుకుందామా..!
- కొత్త తువ్వాళ్లను ఉతికిన తర్వాతే వాడాలి. ఇలా చేస్తే వాటిలోని రసాయన వాసనలు తొలగిపోతాయి.
- ఉతికేటప్పుడు రంగులున్నవి, తెల్లవి... ఇలా వేరుచేసి విడివిడిగా ఉతకాలి. లేదంటే ఒకదాని రంగు మరొకదానికి అతుక్కుంటుంది.
- తడిగా ఉన్న తువ్వాళ్లను అలాగే దుస్తుల బుట్టలో వేసేయద్దు. ఎందుకంటే వీటిలో హానికర సూక్ష్మజీవులు ఆవాసం ఉంటాయి.
- టవల్స్‌ను ఉతికేటప్పుడు వెనిగర్ లేదా బోరాక్స్‌ను ఒక్కోసారి మెషిన్‌లో వేయాలి. ఇలా చేస్తే డిటర్జెంట్ అవశేషాలన్నింటిని ఇది తీసేస్తుంది.
- ఒకేసారి ఎక్కువ మొత్తంలో వీటిని మెషిన్‌లో వేయొద్దు. ఇలా చేస్తే మురికి సరిగా వదలదు.
- ఎక్కువ డిటర్జెంట్ వేయడం వల్ల బట్టలు బాగా శుభ్రపడతాయని పొరపడుతుంటారు కొందరు. ఇది సరికాదు. ఒకట్రెండు చెంచాల కంటే ఎక్కువ వాడొద్దు. అలాగే చేత్తో ఉతికేటప్పుడు కూడా గోరువెచ్చటి నీటితో, గాఢత తక్కువగా ఉండే సబ్బును ఉపయోగించాలి.
- టవల్‌ని ఉపయోగించిన తర్వాత దాన్ని కాసేపు ఎండలో లేదా గాలి తగిలే ప్రాంతంలో ఆరబెట్టాలి. ఇలా చేస్తే దానిపై బ్యాక్టీరియా వృద్ధి చెందదు. హ్యాంగర్‌కు వేలాడదీస్తే... కాస్త చెమ్మ దానిలోనే ఉండిపోయి దుర్వాసనతోపాటు సూక్ష్మజీవులు పెరిగే ప్రమాదం ఉంది.
- దుర్వాసనలు వెదజల్లే తువ్వాళ్లను ఉతకడానికి ...అర కప్పు వంటసోడాను వాడాలి. ఆ తర్వాత డిటర్జెంట్‌తో ఉతకాలి.
- ఫ్యాబ్రిక్ సాఫ్ట్‌నర్‌ను వాడితే ఇవి మృదువుగా, సువాసలు వెదజల్లుతుంటాయి. అయితే రెండు మూడు ఉతుకులకొకసారి వాడాలి.
- ఇతర దుస్తులతో పోలిస్తే తువ్వాళ్లు ఆరడానికి కాస్త ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి పూర్తిగా తడిపోయేవరకు ఆరేయాలి.
- ఇంట్లో కుటుంబ సభ్యులందరికి ఒక్కోరికి రెండేసి చొప్పున తువ్వాళ్లు ఉండేలా చూడాలి.
తెల్లటి తువ్వాళ్లను శుభ్రం చేయడానికి బ్లీచ్‌ను ఎక్కువగా వాడొద్దు. ఇలా చేస్తే వస్త్రం త్వరగా పాడై దాని జీవితకాలం తగ్గిపోతుంది. గోరువెచ్చటి నీరు, డిటర్జెంట్, క్లోరిన్ లేని బీచ్‌లను ఎంచుకోవాలి.
తడిచిన తువ్వాళ్లను వాషింగ్ మెషిన్‌లో వేయొద్దు. ఇలా చేస్తే వాటి నుంచి దుర్వాసన వెలువడుతుంది.
- ఇదీ చూడండి : మీ టవల్స్ శుభ్రమేనా..?