గులాబీ బంతి.. ఎందుకింత స్పెషల్?
PINK

భారత్-ఇంగ్లాండ్ మధ్య డేనైట్ టెస్టుకు రంగం సిద్ధమైంది. అహ్మదాబాద్ వేదికగా బుధవారం (ఫిబ్రవరి 24) ఈ మ్యాచ్ ప్రారంభంకానుంది. ఇప్పటివరకు స్వదేశంలో ఒకే ఒక్క డేనైట్ మ్యాచ్ ఆడింది టీమ్ఇండియా. తర్వాత ఆస్ట్రేలియా గడ్డపై వారితో ఓ గులాబీ టెస్టులో తలపడింది. అయితే మామూలు ఎరుపు బంతి సంప్రదాయ టెస్టుల కంటే ఈ గులాబీ బంతి టెస్టులకు కాస్త క్రేజ్ ఎక్కువ.

గులాబీ బంతి.. ఆస్ట్రేలియాలో అడుగు పెడితే.. బ్రహ్మరథం పట్టారు. యూఏఈలో అరంగేట్రం చేస్తే.. ఆట అదుర్స్‌ అన్నారు. ఇంకా ఎన్నో దేశాలు తిరిగిన ఈ బంతికి.. అడుగు పెట్టిన చోటల్లా నీరాజనమే. ఇక భారత గడ్డపై ఎప్పుడు పింక్ టెస్టు జరుగుతుందా? అనుకుంటున్న వేళ 'దాదా' చొరవతో ఆ కోరిక నెరవేరింది. ఈడెన్‌ గార్డెన్స్‌లో బంగ్లాదేశ్​తో జరిగిన టెస్టుతో గులాబీ బంతి ఇక్కడా మెరిసింది. తాజాగా ఇంగ్లాండ్​తో అహ్మాదాబాద్ వేదికగా మరో డేనైట్ టెస్టుకు రంగం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో అసలు ఈ పింక్ బాల్​ టెస్టుకు ఎందుకంత క్రేజో తెలుసుకుందాం.

ఎప్పుడు మొదలు?

టీ20ల హవా పెరిగి టెస్టులకు ఆదరణ తగ్గిపోతుండటం వల్ల.. ఈ ఫార్మాట్‌కు ఆకర్షణ పెంచేందుకు ఐసీసీ డేనైట్‌ టెస్టుల ఆలోచన చేసిన ఫలితాన గులాబీ బంతి పుట్టుకకు బీజం పడింది. 2015లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ మధ్య అడిలైడ్‌ వేదికగా తొలి డేనైట్ మ్యాచ్ జరిగింది.

Team India
టీిమ్ఇండియా

ఈ బంతే ఎందుకంటే..?

టెస్టులు డే/నైట్‌లో నిర్వహిస్తే బంతి రంగెందుకు మారాలి..? గులాబి బంతితోనే ఇవి ఎందుకు నిర్వహించాలి అనిపిస్తోందా? అదేంటంటే! పగటి పూట నిర్వహించే టెస్టు మ్యాచ్‌ల్లో ఎరుపు బంతి వాడతారు. అది చాలా మన్నికతో కూడింది. టెస్టుల్లో కొత్త బంతి ప్రభావం ఎక్కువ కాబట్టి ఎప్పుడు పడితే అప్పుడు బంతిని మార్చరు. 80 ఓవర్ల తర్వాతే కొత్త బంతి తీసుకుంటారు. వన్డేలు, టీ20ల్లో వాడే తెలుపు బంతి మన్నిక తక్కువ. 20-30 ఓవర్లకు మెరుపు పోయి నల్లగా అవుతుంది. బంతి కాస్త దెబ్బతిందనిపిస్తే అంపైర్లు మార్చేస్తారు. డేనైట్‌ టెస్టుల్లో ఎరుపు బంతి వాడితే.. 30-40 ఓవర్ల తర్వాత మెరుపు పోయి నల్లగా మారుతుంది. ఫ్లడ్‌లైట్లలో సరిగా కనిపించదు. అలాగని పరిమిత ఓవర్ల క్రికెట్లో వాడే తెలుపు బంతి వాడితే 2-3 గంటలకు మించి మన్నిక కష్టం. టెస్టుల్లో అసాధారణ పరిస్థితుల్లో తప్ప 80 ఓవర్లలోపు బంతిని మార్చేందుకు వీలుండదు. ఈ కారణంగా పసుపు, నారింజ రంగు బంతులతోనూ ప్రయోగాలు చేసి చివరికి మన్నిక ఉంటూ, పగలైనా రాత్రయినా ఒకేలా కనిపించే గులాబీ బంతిని డేనైట్‌ టెస్టులకు ఎంచుకున్నారు.

Motera
మొతేరా మైదానం

ఈ బంతి వాటిలా కాదు!

ఎరుపు, తెలుపు బంతుల్లాగే గులాబీ బంతిలోనూ కార్క్‌, రబ్బర్‌, ఉన్ని వాడతారు. సీమ్‌ వాటికి భిన్నంగా నలుపు రంగులో ఉంటుంది. ఆటలో ఈ బంతి తీరు వేరే బంతులతో పోలిస్తే భిన్నమే. తొలి 10-15 ఓవర్లలో బాగా స్వింగ్‌ అవుతుంది. అప్పుడు బౌలర్లకు పండగే. కానీ ఈ స్వింగ్‌ ప్రతాపం సీమ్‌ ఉన్నంత వరకే. అది పోయిందంటే..బ్యాట్స్‌మెన్‌కే అనుకూలం. పింక్ బాల్​తో రివర్స్‌ స్వింగ్‌ కష్టమే. అందుకే స్పిన్నర్లకు పెద్దగా ఇష్టముండదు.

నూటికి నూరు మార్కులు

గులాబీ బంతిని ఏ ఉద్దేశంతో తీసుకొచ్చారో అది నూటికి నూరు శాతం నెరవేరింది. ఈ బంతి ఉన్న ప్రతి మ్యాచూ సూపర్‌ హిట్టే. అన్ని దేశాల్లోనూ ప్రేక్షకులు స్టేడియాల్ని నింపేశారు. సాయంత్రం స్టేడియాలకు వచ్చి సేదదీరడం అభిమానులకు మహదానందమే. పైగా ఏమిటీ గులాబీ మహత్యం అంటూ ఈ బంతిపై ప్రత్యేక ఆసక్తితో ప్రేక్షకులు స్టేడియాలకు వస్తున్నారు. డేనైట్ టెస్టులు.. బోర్‌ కొట్టించవు. డ్రాలతో విసుగెత్తించవ్‌! ఇప్పటిదాకా ఈ బంతితో ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ ఫలితాలు రావడం, మ్యాచ్‌లు మూణ్నాలుగు రోజుల్లోనే ముగిసిపోవడం విశేషం.

ఇవీ చూడండి: పింక్ టెస్టుకు భారత్ రెడీ.. ఈ విషయాలు తెలుసుకోండి!

    About us Privacy Policy
    Terms & Conditions Contact us

    • ETV
    • ETV
    • ETV
    • ETV

    Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
    ETV

    INSTALL APP

    ETV

    CHANGE STATE

    ETV

    SEARCH

    ETV

    MORE

      • About us
      • Privacy Policy
      • Terms & Conditions
      • Contact us
      • Feedback

      Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.