
సైన్యంలో చేరాలనేది ఎందరో యువకుల కల. దేశానికి రక్షణగా... సరిహద్దుల్లో పోరాడేందుకు మానసిక, శారీరక దృఢత్వము ఎంతో అవసరం. దీనికోసం నిత్యం కఠోర సాధన చేస్తున్నారు. యువకుల కసరత్తుకు ఆదిలాబాద్ ఇందిరా ప్రియదర్శిని మైదానం వేదికగా నిలుస్తోంది. ఎలాగైనా ఈసారి సైన్యంలో చేరుతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
సైన్యంలో ప్రవేశానికిగాను మార్చి 5నుంచి 24 వరకు హైదరాబాద్‌లోని హకీంపేటలో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ జరగనుంది. ఇప్పటికే ఇందులో పాల్గొనేందుకు అభ్యర్థులు భారీగా దరఖాస్తులు చేసుకున్నారు. అభ్యర్థులకు ఆదిలాబాద్ విశ్రాంత సైనికులు ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. ఇందిరా ప్రియదర్శిని మైదానంలో ఉదయం, సాయంత్రం యువకులు కఠోర సాధన చేస్తున్నారు. ఆయా విభాగాల్లో అర్హతసాధించేలా ముమ్మర కసరత్తులు చేస్తున్నారు.
మాజీల పర్యవేక్షణలో...
మాజీ సైనికుల పర్యవేక్షణలో రాటుదేలుతున్న యువకులు.. ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో ఉన్నారు. ఇతర జిల్లాల వారు ఇక్కడికి వచ్చి శిక్షణ తీసుకుంటున్నారు. ఆర్మీ ర్యాలీని ఆదిలాబాద్ జిల్లాలోనూ నిర్వహిస్తే మరింత ఉపయోగకరంగా ఉంటుందని కోరుతున్నారు.
రాతపరీక్షలోను...
హైదరాబాద్ లాంటి పెద్ద పెద్ద నగరాల్లో ఇచ్చే శిక్షణకు ఏమాత్రం తీసిపోకుండా ఇక్కడ తర్ఫీదునిస్తున్నారు. రన్నింగ్, రేలింగ్, కఠినమైన విన్యాసాలు శిక్షకుల పర్యవేక్షణలో యువకులు అవలీలగా చేస్తున్నారు. శారీరక శిక్షణకే కాకుండా రాతపరీక్షలకు సన్నద్ధమయ్యేలా అభ్యర్థులను తీర్చిదిద్దుతున్నారు. ఆర్మీలో చేరాలనుకుంటున్న అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇస్తున్న విశ్రాంత సైనికులపై స్థానికంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
ఇదీ చూడండి: నేటి నుంచి మొదటి విడత జేఈఈ-మెయిన్