
అప్పుల పేరుతో రైతులు, కూలీలు వడ్డీ వ్యాపారుల ఉచ్చులో చిక్కుకుని ఆస్తులు, భూములు పొగొట్టుకుంటున్నారు. అధిక వడ్డీల ఉచ్చులో నలిగిపోతున్నారు. అప్పు కింద తనఖా పెట్టుకున్న భూముల విలువలు పెరగగా.. వాటిపై కన్నేసి తిరిగి ఇవ్వడం లేదు. జరిగిన మోసం అర్థమై తిరిగి భూముల కోసం అధికారుల చుట్టూ, కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. అసలు ఈ వడ్డీ వ్యాపారంపై చట్టాలు ఏం చెబుతున్నాయి.
బ్యాంకులు సకాలంలో పంటరుణాలు ఇవ్వకపోవడంతో రైతులు, కూలీలు వడ్డీ వ్యాపారుల ఉచ్చులో చిక్కుకుని ఆస్తులు, భూములు పొగొట్టుకుంటున్నారు. అధిక వడ్డీల చక్రబంధంతో వ్యాపారులు బాధితుల ఆస్తులను కొల్లగొడుతున్నారు. అప్పు ఇచ్చే ముందు రైతుల భూములనో, ఇతర ఆస్తులనో తనఖా కింద రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. గడువులోగా చెల్లిస్తే ఆ ఆస్తిని తిరిగి వారి పేరిట రిజిస్ట్రేషన్ చేస్తామని బాండ్ పత్రాలపై ఒప్పందాలు రాసిస్తున్నారు. కానీ చక్రవడ్డీలు వేస్తూ అప్పు తీరనివ్వకుండా ఏళ్ల సమయం గడిపేస్తున్నారు. ఈలోగా వారు తనఖా పెట్టుకున్న భూముల విలువలు పెరగడంతో వాటిపై కన్నేసి తిరిగి ఇవ్వడం లేదు. ఒకసారి రిజిస్ట్రేషన్ చేస్తే భూమిని పూర్తిగా అమ్మేసినట్టే అవుతుంది. అయినా అప్పు తీర్చేస్తే తిరిగి వెనక్కి రిజిస్ట్రేషన్ చేస్తామని వ్యాపారి రాసిచ్చే బాండ్ పేపర్‌ను నమ్ముకుని కొద్ది అప్పు కోసం విలువైన భూములను రిజిస్ట్రేషన్ చేసి ఇస్తున్న రైతులు, వ్యవసాయ కూలీలు దారుణంగా నష్టపోతున్నారు. జరిగిన మోసం అర్థమై తిరిగి భూముల కోసం అధికారుల చుట్టూ, కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.
చట్టం ఏం చెబుతోంది?
ఉమ్మడి రాష్ట్రంలోనే తెలంగాణలో తెలంగాణ వడ్డీ వ్యాపార చట్టం (మనీల్యాండరింగ్ యాక్ట్)ను ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. అప్పులపై ఎంత వడ్డీ వసూలు చేయాలో ఈ చట్టంలోని 11(ఇ) నిబంధన చెబుతోంది. దాని ప్రకారం అప్పులిచ్చే వ్యాపారి ముందుగా మండల తహసీల్దార్ వద్ద లైసెన్సు తీసుకోవాలి. అప్పు ఇవ్వడానికి ఆస్తిని తనఖా పెట్టుకుంటే ఏడాదికి రూ.వందకు 9 శాతం (నెలకు రూ.వందకు 75 పైసలు), తనఖా ఏమీ పెట్టకపోతే 12 శాతం (నెలకు రూ.వందకు రూపాయి) చొప్పున వడ్డీ మాత్రమే తీసుకోవాలని ఈ నిబంధన చెబుతోంది. కానీ ఈ చట్టాన్ని, నిబంధనలు తుంగలో తొక్కి రైతులు, కూలీల నుంచి 24 నుంచి 60 శాతం దాకా వడ్డీ వసూలు చేస్తున్నారు. అసలు లైసెన్సు కూడా తీసుకోకుండానే వడ్డీ వ్యాపారాలు చేస్తూ అధిక వడ్డీలతో రైతులను, పేదలను పీడిస్తూ వారి ఆస్తులు కాజేస్తున్నారు. ఈ చట్టం అమలు గురించి కలెక్టర్లు పట్టించుకోకపోవడంతో ఎంతోమంది ఆస్తులు కోల్పోతున్నారు.
ఎందుకీ అప్పులు..
ఏటా ఏప్రిల్ నుంచి పంటల సాగుకు, ఇతర అవసరాలకు బ్యాంకులు పంటరుణాలు, దీర్ఘకాలిక రుణాలు ఇవ్వాలి. ఈ ఏడాది (2020-21)లో పంటరుణాల కింద రూ. 53 వేల కోట్లను రైతులకు బ్యాంకులివ్వాలనేది లక్ష్యం. కాని 10 నెలలైనా (ఏప్రిల్-జనవరి) ఇంకా రూ. 20 వేల కోట్లను ఇవ్వనేలేదు. పంటల సాగు రైతులు, వృత్తికార్మికులకు ప్రైవేటు వ్యాపారులే దిక్కవుతున్నారు. వ్యాపారులు పేదల ఆస్తులు తనఖా పెట్టుకుని అధిక వడ్డీలకు అప్పులతో పీడిస్తున్నారు. ఇలా నష్టపోతున్నవారిని ఆదుకునేందుకు హైకోర్టు ఆదేశంతో రాష్ట్ర ప్రభుత్వం 2018లో రాష్ట్ర రుణ ఉపశమన కమిషన్‌ను ఏర్పాటుచేసింది. ఈ కమిషన్ తనకు వచ్చే ఫిర్యాదులపై విచారణ జరుపుతుంది. ఆస్తులు వెనక్కి ఇవ్వకపోతే వెంటనే కలెక్టర్లకు చెప్పి ఇప్పిస్తుంది. అప్పు తీసుకున్నవారు తిరిగి కట్టలేకపోతే రూ. 2 లక్షల వరకూ ప్రభుత్వం నుంచి ఇప్పిస్తుంది. కానీ ఈ కమిషన్ గురించి అవగాహన లేక ఇప్పటికి 80 మంది రైతులే ఫిర్యాదులిచ్చారు. వాటిలో అప్పుల పేరుతో వ్యాపారులు ఆస్తులు కాజేసినవే అధికం. ఇద్దరు బాధితులకు చెరో రూ.లక్ష చొప్పున ఇవ్వాలని ప్రభుత్వానికి కమిషన్ తాజాగా సిఫార్సు చేసింది.
రూ.5 లక్షల అప్పు... మూడెకరాల రిజిస్ట్రేషన్
జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం ఉప్పల గ్రామానికి చెందిన నాయికి శంకరన్న అనే రైతు దీనగాథ ఇది. భాస్కర్ అనే వడ్డీ వ్యాపారి వద్ద శంకరన్న రూ.5 లక్షల అప్పు తీసుకున్నారు. నెలకు రూ.వందకు రూ.2 చొప్పున వడ్డీ కట్టాలని అందులో రాశారు. బాకీని రెండేళ్లలోగా తీర్చాలని తనఖా కింద శంకరన్నకున్న 3 ఎకరాల పొలాన్ని భాస్కర్ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. గడువు తీరాక అప్పు పూర్తిగా చెల్లించినా, రూ.5 లక్షలకు బదులు రూ. 10 లక్షలు ఇస్తానని చెప్పినా భాస్కర్ భూమి వెనక్కి రిజిస్ట్రేషన్ చేయకుండా అడ్డం తిరిగాడు. అప్పు గడువు తీరి రెండేళ్లయినా భూమి వెనక్కి రాక ఆవేదనతో శంకరన్న రాష్ట్ర రుణ ఉపశమన కమిషన్’ను ఆశ్రయించారు. ఈ అప్పు పత్రంలో వడ్డీ వ్యాపార చట్టాన్ని పూర్తిగా తుంగలో తొక్కినట్లు స్పష్టంగా తెలుస్తున్నా శంకరన్నకు న్యాయం జరగలేదు.
రైతు ఆత్మహత్య చేసుకున్నా కుటుంబానికి ఆగని వేధింపులు
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలానికి చెందిన లక్ష్మయ్య, వజ్రమ్మ అనే రైతు దంపతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారి వద్ద రూ.లక్షన్నర అప్పు తీసుకున్నారు. అతడు వారి భూమి పత్రాలను తనఖా పెట్టుకున్నాడు. కొంతకాలానికి పంట నష్టాలతో లక్ష్మయ్య ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పు మొత్తం తిరిగి కట్టినా భూమి విలువ పెరిగిందని పత్రాలను వ్యాపారి వెనక్కి ఇవ్వడం లేదు. ఎవరిని అడిగినా సాయం చేయకపోవడంతో వజ్రమ్మ రుణ విముక్తి కమిషన్ చుట్టూ తిరుగుతోంది.
ఆస్తులు కాజేస్తున్నారు: రుణ ఉపశమన కమిషన్
‘అప్పులిచ్చేందుకు తాకట్టు కింద ఆస్తులను రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్న వ్యాపారులు వాటిని కాజేస్తున్నది నిజమే. ఇలాంటి వారిని విచారణకు పిలిచి హెచ్చరించడంతో తప్పయిందని ఒప్పుకొంటున్నారు. చట్టం ప్రకారం రూపాయికి మించి వడ్డీ కట్టాల్సిన అవసరం లేదు. బాధితులెవరైనా కమిషన్‌కు దరఖాస్తు చేస్తే న్యాయం చేస్తాం. పేదలు అప్పులు తీసుకుని వ్యాపారుల వడ్దీల వలలో చిక్కుకుని దారుణంగా మోసపోతున్నారు. బాండు పేపర్లపై దర్జాగా రాసిచ్చి ఆస్తులు కాజేయడం మా కమిషన్ విచారణలో అనేకం గుర్తించాం’ అని రాష్ట్ర రుణవిమోచన ఛైర్మన్, సభ్యులు తెలిపారు.
నెలకు రూ. 2.50 వడ్డీ
ఈ ఫొటోలో కనిపిస్తున్న రూ. 50 బాండ్ పత్రం ఓ పేద రైతు రూ. 5 లక్షలు తీసుకున్న అప్పుపై రాసుకున్న ఒప్పందానిది. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం నవాబ్‌పేట గ్రామానికి చెందిన శ్రీనివాస్‌రెడ్డి అనే రైతు సిద్దిపేట జిల్లాకు చెందిన రాంరెడ్డి అనే వడ్డీ వ్యాపారి వద్ద రూ. 5 లక్షలు అప్పు తీసుకున్నాడు. తనఖా కింద ఎకరం 2 గంటల భూమిని తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. అప్పు కట్టేయగానే భూమిని తిరిగి రిజిస్ట్రేషన్ చేస్తానని రూ. 50 బాండ్ పేపర్‌పై రాసి ఇచ్చిన ఒప్పంద పత్రం ఇదే. కానీ అప్పు కట్టినా భూమి ఇవ్వకపోవడంతో దిక్కుతోచక శ్రీనివాస్‌రెడ్డి రుణ ఉపశమన కమిషన్‌ను ఆశ్రయించాడు. రాంరెడ్డి వడ్డీ వ్యాపారం చేయడానికి రెవెన్యూశాఖ నుంచి లైసెన్సు తీసుకున్నాడా, వడ్డీ వందకు నెలకు రూ. 2.50 చొప్పున వసూలు చేస్తున్నాడా విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని హుస్నాబాద్ తహసీల్దార్‌ను కమిషన్ ఆదేశించింది. రాంరెడ్డి గతంలో రూ. 2.50 చొప్పున వడ్డీకి అప్పులిచ్చేవాడని తహసీల్దార్ సమాధానం కూడా ఇచ్చారు. కానీ నెలకు వందకు 75 పైసలే (9 శాతమే) వడ్డీ వసూలు చేయాలన్న నిబంధనను ఎందుకు అమలుచేయలేదో తహసీల్దార్ స్పష్టంచేయలేదు.