
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల గెలుపు కోసం గులాబీ పార్టీ వ్యూహాలకు పదును పెడుతోంది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ పట్టభద్రుల స్థానంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. వ్యూహాత్మకంగా పీవీ నర్సింహారావు కుమార్తె సురభి వాణీ దేవిని బరిలోకి దించిన తెరాస.. ఆమె విజయం కోసం ప్రత్యేక కసరత్తు చేస్తోంది. గ్రేటర్ హైదరాబాద్, మహబూబ్‌నగర్ జిల్లా ముఖ్యనేతలతో నేడు తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సమావేశం కానున్నారు.
పట్టభద్రుల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి... ఎత్తులు, పైఎత్తులకు పదును పెడుతోంది. వరంగల్, నల్గొండ, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి పేరును కొన్ని నెలల క్రితం నుంచే ప్రచారం చేసింది. తెజస నుంచి కోదండరాం, భాజపా నుంచి ప్రేమేందర్ రెడ్డి, వామపక్షాల అభ్యర్థిగా జయసారథి, కాంగ్రెస్ నుంచి రాములు నాయక్ పోటీలో ఉన్నారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి కొన్ని రోజులుగా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. పల్లా విజయం నల్లేరుపై నడకేనని తెరాస ధీమా వ్యక్తం చేస్తోంది.
హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ స్థానంపై అధికార పార్టీ... ఆది నుంచి ఆచితూచి పావులు కదుపుతోంది. భాజపా నుంచి సిట్టింగ్ అభ్యర్థిగా రామచంద్రరావు, వామపక్షాల మద్దతుతో మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్, కాంగ్రెస్ నుంచి చిన్నారెడ్డి, తెదేపా తరఫున ఎల్.రమణతో పాటు పలువురు స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉన్నారు. అనేక సామాజిక, రాజకీయ సమీకరణలు చేసిన గులాబీ పార్టీ.. చివరకు వ్యూహాత్మకంగా మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు కుమార్తె వాణిని పోటీకి దించింది. పార్టీ బలంతో పాటు... పీవీ సానుకూల వర్గాలు, వివిధ అంశాలు తోడ్పడుతాయని భావిస్తోంది. గెలుపుపై ధీమాతో ఉన్నప్పటికీ... హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ స్థానంలో పోటీ తీవ్రంగా ఉంటుందని తెరాస భావిస్తోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు, పీఆర్సీపై ఉద్యోగుల్లో అసంతృప్తి, ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ కాకపోవడం వంటివి వ్యతిరేక అంశాలుగా పరిణమించకుండా జాగ్రత్త పడుతోంది.
గెలిపించే బాధ్యత వారిపై...
హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్లో తెరాస ప్రత్యేక వ్యూహాలను సిద్ధం చేస్తోంది. వాణీ దేవిని గెలిపించే బాధ్యతను మంత్రులు, ఎమ్మెల్యేలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ ఇప్పటికే స్పష్టం చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేటీఆర్ కూడా ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉంది. ఇవాళ హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాల ముఖ్య నేతలతో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సమావేశం కానున్నారు.
నేతలకు దిశానిర్దేశం
తెలంగాణ భవన్‌లో ఉదయం 11 గంటలకు జీహెచ్ఎంసీ పరిధిలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్, కార్పొరేటర్లు, ముఖ్య నేతలతో భేటీ కానున్నారు. సాయంత్రం 4 గంటలకు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ప్రజా ప్రతినిధులు, నాయకులతో సమావేశం కానున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణిదేవి కూడా హాజరు కానున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేయనున్నారు. ప్రచారంలో ప్రస్తావించాల్సిన అంశాలు, విపక్షాల ఆరోపణలపై స్పందించాల్సిన తీరుపై కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.
ఇదీ చూడండి: పరిశోధనలకు కేంద్రం ప్రోత్సాహకాలు పెంచాలి.. బయో ఆసియాలో విజ్ఞప్తులు