పాత అంశాలే కొత్త ఎజెండానా?
పాత

ఏళ్లు దొర్లుతున్నా తెలుగు రాష్ట్రాల్లో నీటి తగాదాలు అపరిష్కృతంగానే ఆవిష్కృతమవుతున్నాయి. వివాదంగా ఉన్న సాగునీటి ప్రాజెక్టులపై త్వరలో జరగబోయే దక్షిణాది రాష్ట్రాల జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలోనూ పలు పాత అంశాలే కొత్త ఎజెండాగా రూపుదిద్దుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టానికి భిన్నంగా చేపట్టినట్లు రెండు రాష్ట్రాలు పరస్పరం ఫిర్యాదు చేసుకొన్న ప్రాజెక్టులు, ప్రధానమంత్రి హామీ ఇచ్చిన ప్రాజెక్టుల గురించి సమగ్రంగా చర్చించే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపాదించిన గుండ్రేవుల, రాయలసీమ ఎత్తిపోతల; తెలంగాణలోని పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతలతోపాటు పోలవరం ప్రాజెక్టు కూడా చర్చకు రావొచ్చు. మార్చి నాలుగున తిరుపతిలో నిర్వహించాలని నిర్ణయించిన ఈ సమావేశం కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అధ్యక్షతన జరగనుంది. దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులందరూ హాజరుకావాల్సి ఉంటుంది. ఇందులో రాష్ట్రాల మధ్య వివాదంగా ఉన్న అంశాలపై చర్చలు జరుగుతాయి. సాగునీటి రంగానికి సంబంధించి ప్రధానంగా నాలుగైదు ప్రాజెక్టులు చర్చకు వచ్చే అవకాశం ఉంది.

  • ఆంధ్రప్రదేశ్‌ తుంగభద్ర నదిపై సుంకేశులకు పైభాగాన గుండ్రేవుల వద్ద 20 టీఎంసీల సామర్థ్యంతో వరద నీటి వినియోగానికి బ్యారేజి నిర్మాణాన్ని ప్రతిపాదించింది. కేసీ కాలువ ఆయకట్టు స్థిరీకరణకు ఈ ప్రాజెక్టును చేపట్టాలని నిర్ణయించింది. సుంకేశుల సామర్థ్యం కేవలం 1.2 టీఎంసీలు మాత్రమేనని, కేసీ కాలువ కింద చివరి ఆయకట్టుకు నీరందడం లేదని, ఇందుకోసం గుండ్రేవుల ప్రాజెక్టు చేపట్టినట్లు ఆంధ్రప్రదేశ్‌ పేర్కొంది. ఈ ప్రాజెక్టు వల్ల కర్ణాటకలో ఒక గ్రామం, తెలంగాణలోని మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఆరు గ్రామాలు, కర్నూలు జిల్లాలో 16 గ్రామాల్లోని 9,345 హెక్టార్ల భూమి ముంపునకు గురవుతుంది. తెలంగాణలో మూడు పూర్తిగా, రెండు పాక్షికంగా, ఆంధ్రప్రదేశ్‌లో ఐదు పూర్తిగా, నాలుగు పాక్షికంగా ముంపునకు గురవుతాయి. 2019లో చెన్నైలో జరిగిన సమావేశంలో ఈ ప్రాజెక్టు డీపీఆర్‌ను తెలంగాణ, కర్ణాటకలకు అందజేయాలని స్పష్టం చేసింది. దీని ప్రకారం డీపీఆర్‌ అందజేశామని, అయితే రెండు రాష్ట్రాల నుంచి ఎలాంటి స్పందన లేదని ఆంధ్రప్రదేశ్‌ పేర్కొంది.
  • శ్రీశైలం నుంచి రోజూ మూడు టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా ఆంధ్రప్రదేశ్‌ చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం గురించి కూడా చర్చ జరగనుంది.
  • తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. పునర్విభజన తర్వాత 90 టీఎంసీలతో పాలమూరు-రంగారెడ్డి, 30 టీఎంసీలతో డిండి ఎత్తిపోతల పథకాలను తెలంగాణ ప్రభుత్వం చేపట్టిందని, వీటి ప్రభావం దిగువన ఉన్న ప్రాజెక్టులపై ఉంటుందని ఆంధ్రప్రదేశ్‌ ఫిర్యాదు చేసింది. కేంద్ర జల సంఘం, అపెక్స్‌ కౌన్సిల్‌ ఆమోదం లేకుండా ఈ ప్రాజెక్టులపై ముందుకెళ్లనీయవద్దని ఆంధ్రప్రదేశ్‌ కోరుతుండగా, ఈ రెండు ప్రాజెక్టులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపాదించినవి తప్ప కొత్తవి కాదని తెలంగాణ పేర్కొంది. ఈ నేపథ్యంలో మళ్లీ దక్షిణాది రాష్ట్రాల సమావేశంలో చర్చకు రానుంది.
  • గోదావరి-కావేరి అనుసంధానంపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. గోదావరిపై జానంపేట వద్ద నీటిని మళ్లించే ప్రతిపాదన వల్ల తెలంగాణకు 39.05 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్‌కు 107.71 టీఎంసీలు, తమిళనాడుకు 83.23 టీఎంసీలు లభ్యమవుతాయి. ఇచ్చంపల్లి నుంచి కావేరి వరకు అనుసంధానం వల్ల తెలంగాణకు 65.79 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్‌కు 80.69 టీఎంసీలు, తమిళనాడుకు 83.27 టీఎంసీలు లభ్యవవుతాయని జాతీయ జల అభివృద్ధి సంస్థ పేర్కొంది. దీనిపై 2019 నాటి సమావేశంలో చర్చ జరగింది. మళ్లీ ఇప్పుడూ జరిగే అవకాశాలు ఉన్నాయి.
  • పోలవరం ప్రాజెక్టుకు జాతీయహోదా ఇచ్చినప్పటికీ కేంద్రం నుంచి వచ్చే నిధులపై సందిగ్ధం ఏర్పడింది. ఇప్పటివరకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రూ.17,130 కోట్లు ఖర్చు చేయగా, ఇందులో జాతీయ ప్రాజెక్టు కింద కేంద్రం ఇచ్చింది రూ.12,400 కోట్లు. కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ ఈ ప్రాజెక్టు వ్యయాన్ని రూ.55,548.87 కోట్లకు సిఫార్సు చేసింది. ఆర్థిక శాఖ నియమించిన అంచనాల సవరింపు కమిటీ రూ.47,725.74 కోట్లకు ఆమోదించింది. చివరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ రూ.20,298.61 కోట్లు మాత్రమే ఇస్తామని పేర్కొంది. ఇది ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టానికి వ్యతిరేకమని.. రూ.55,656.87 కోట్లకు ఆమోదించాలని ఆంధ్రప్రదేశ్‌ కోరుతోంది.
  • రెండు తెలుగు రాష్ట్రాలు పరస్పరం ఫిర్యాదు చేసుకొన్న ప్రాజెక్టులతోపాటు కర్ణాటక, తమిళనాడు, కేరళకు చెందిన అంశాలపై కూడా చర్చ జరగనుంది.

ఇదీ చూడండి: వాళ్లకు ఓటుతో గుణపాఠం చెబుదాం: బండి సంజయ్​

    About us Privacy Policy
    Terms & Conditions Contact us

    • ETV
    • ETV
    • ETV
    • ETV

    Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
    ETV

    INSTALL APP

    ETV

    CHANGE STATE

    ETV

    SEARCH

    ETV

    MORE

      • About us
      • Privacy Policy
      • Terms & Conditions
      • Contact us
      • Feedback

      Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.