
నిరుపేదలకు దక్కాల్సిన భూములు స్థిరాస్తి వ్యాపారానికి అడ్డాగా మారుతున్నాయి. భారీగా పెరిగిన ధరలతో సీలింగ్ భూముల్లో స్థిరాస్తి పంట పండుతోంది. దశాబ్దాల క్రితం ప్రభుత్వం భూములివ్వగా... ఇప్పుడు వాటిని రియల్టర్లు కబ్జా చేశారు. ఇదేంటని ప్రశ్నిస్తే భౌతిక దాడులకు పాల్పడుతున్నారు. అధికారుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేదని ఖమ్మంలో బాధితులు వాపోతున్నారు.
ఖమ్మం చుట్టూ భూముల ధరలకు రెక్కలొచ్చాయి. నగరానికి దాదాపు 20 కిలోమీటర్ల మేర స్థిరాస్తి వ్యాపారం జోరుగా సాగుతోంది. ఇదే అదనుగా.... నిరుపేదలకు ప్రభుత్వమిచ్చిన భూములపై రియల్టర్ల కన్ను పడింది. పేదలు సాగు చేసుకునేందుకు ప్రభుత్వం పంచిపెట్టిన 31 ఎకరాల సీలింగ్ భూములకు.... స్థిరాస్తి వ్యాపారులు నకిలీ పత్రాలు సృష్టించి ప్లాట్లుగా మార్చి విక్రయిస్తున్నారు. బాధితులంతా అధికారుల చుట్టూ తిరుగుతున్నా... ఫలితంలేదని వాపోతున్నారు.
ఖమ్మం అర్బన్ మండలం మల్లెమడుగు రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 194, 195, 198 లో మొత్తం 31.23ఎకరాల సీలింగ్ భూమి ఉంది. 1970లో ఉప్పెర్ల మంగయ్య అనే రైతు తన మిగులు భూమిని ప్రభుత్వానికి ఇచ్చారు. అప్పట్లో 31 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఒక్కొక్కరికి ఎకరం చొప్పున ప్రభుత్వం భూమి కేటాయించింది. ఖమ్మానికి సమీపంలో ఈ భూములు ఉండటంతో విపరీతమైన డిమాండ్ పెరిగింది. కాగా... స్థిరాస్థి వ్యాపారుల కన్నుఈ భూములపై పడింది. ఈ భూముల పక్కనే ఉన్న 200 సర్వే నంబర్‌లోని భూములను కొనుగోలు చేసిన వ్యాపారులు... 198 సర్వే నంబర్‌లోని భూముల్ని పట్టా భూములుగా చూపారు. సుమారు 6 ఎకరాలను ప్లాట్లుగా మార్చారు. అధికారుల అండదండలు పుష్కలంగా ఉండటం వల్ల వారిదే ఇష్టారాజ్యంగా మారిందని బాధితులు అంటున్నారు.
ఖమ్మం జిల్లాలో దాదాపు 8 వేల ఎకరాల సీలింగ్ భూములు ఉన్నాయి. కొన్నిచోట్ల ఈ భూములను పేదలకు పంపిణీ చేయగా... అందులో వారు సాగు చేసుకుంటున్నారు. ఇంకా కొన్ని ప్రాంతాల్లో పేదలకు భూములు పంచినప్పటికీ... పూర్తిగా హక్కు మాత్రం లేదు. ఇంకా కొన్ని ప్రాంతాల్లో సీలింగ్ భూములను ఇతరులకు అమ్ముకున్నారు. అటువంటి ప్రాంతాల్లోనూ అనేక వివాదాలు తలెత్తుతున్నాయి.
పట్టణ ప్రాంతాలు, మండల కేంద్రాలను ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో సీలింగ్ భూముల వ్యవహారం తీవ్ర వివాదాలకు దారితీస్తోంది. రెవెన్యూ అధికారులు చొరవ తీసుకుని సీలింగ్ భూములను కాపాడాలని బాధితులు కోరుతున్నారు. తమ భూములు తమకు ఇవ్వాలంటూ వేడుకుంటున్నారు.
ఇదీ చూడండి: కేసు ఓడిపోయాడని న్యాయవాదిపై హత్యాయత్నం