
నల్గొండ జిల్లాలో నిర్మితమవుతోన్న కిష్టరాయనిపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ భూ నిర్వాసితులు సోమవారం.. ఎస్హెచ్ఆర్సీని ఆశ్రయించారు. ప్రాజెక్టు ప్రారంభించి ఏళ్లు గడుస్తున్నా సరైన రీతిలో పరిహారం చర్యలు చేపట్టలేదని బాధితులు వాపోయారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు తరహాలో పునరావాసం కల్పిస్తామని చెప్పి ప్రభుత్వం మోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.
నల్గొండ జిల్లా నాంపల్లి మండలం లక్ష్మణాపురం వద్ద నిర్మితమవుతోన్న కిష్టరాయనిపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ భూ నిర్వాసిత బాధితులు.. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించారు. డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తోన్న ఈ రిజర్వాయర్ ద్వారా తమ భూములు, నివాస గృహాలు పూర్తిగా ముంపునకు గురవుతున్నాయని కమిషన్కు బాధితులు వివరించారు. 2015లో ప్రాజెక్టు శంకుస్థాపన సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్.. పూర్తి పరిహారం చెల్లించిన తర్వాతనే రిజర్వాయర్ పనులు చేపడతామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. తమ వద్ద నుంచి సేకరించిన విలువైన సాగు భూమికి.. ఎకరానికి కేవలం రూ. 4.15 లక్షలు మాత్రమే చెల్లించారని తెలిపారు. అది కూడా విడతల వారీగా చెల్లించడంతో... వేరే భూములు కొనుగోలు చేయలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో గ్రామంలో వందలాది రైతులు కూలీలుగా మారే పరిస్థితి వాటిల్లిందని వాపోయారు.
ఏళ్లు గడుస్తున్నా..
ప్రాజెక్టు పనులు ప్రారంభించి ఆరేళ్లు గడుస్తున్నా.. పరిహారం చర్యలు చేపట్టకపోవడం.. ప్రభుత్వం, గుత్తే దారులకు, నిర్వాసితులపై ఉన్న నిర్లక్ష్యానికి అద్దం పడుతోందని బాధితులు విమర్శించారు. ఇప్పటికే పలుమార్లు మల్లన్న సాగర్ ప్రాజెక్టు తరహా పునరావాసం కల్పించాలని కలెక్టర్కు విన్నవించినా ఫలితం లేదని వాపోయారు. పోలీసులు తమపై చేస్తున్న దాడిపై చర్యలు తీసుకొని... రక్షణ కల్పించాలని వేడుకున్నారు. లేనిపక్షంలో గ్రామస్థులకు మూకుమ్మడి ఆత్మహత్యలే శరణ్యమన్నారు. అధికారులు స్పందించి ప్రాజెక్టు పరిసరాల్లోని పోలీసు బలగాలను వెనక్కి పంపించాలని కోరారు. పరిహారం అందేవరకు ప్రాజెక్టు పనులు ఆపి న్యాయం చేయాలని హెచ్ఆర్సీని వేడుకున్నారు.
ఇదీ చదవండి: వినూత్నంగా ఆలోచించారు.. విద్యార్థుల మనసు దోచుకున్నారు.!