టీకా తీసుకుంటున్నారా... అయితే ఇవి తెలుసుకోండి!
story

కొందరిలో టీకాలు ఎందుకు పనిచేయవు. కొందరి రోగనిరోధక వ్యవస్థ టీకాలకు వేగంగా ఎందుకు స్పందిస్తుంది? ఇందుకు రకరకాల అంశాలు దోహదం చేస్తాయి. వీటిల్లో కొన్ని విషయాల్లో మనమేమీ చేయలేం గానీ అవేంటన్నది తెలుసుకొని ఉంటే అపోహలు తలెత్తకుండా చూసుకోవచ్చు.


కొవిడ్‌-19 టీకా తీసుకున్నాక తొలి రెండు, మూడు రోజుల్లో సూది గుచ్చిన చోట నొప్పి, చలి, తలనొప్పి, వికారం, నిస్సత్తువ, కొద్దిగా జ్వరం వంటి దుష్ప్రభావాలు తలెత్తొచ్చు. రెండో మోతాదు టీకా తీసుకున్నవారిలో, ఇంతకుముందే కొవిడ్‌ బారినపడి కోలుకున్నవారిలో ఇవి ఇంకాస్త ఎక్కువగానూ కనిపిస్తుంటాయి. ఇవన్నీ టీకాకు రోగనిరోధక వ్యవస్థ స్పందిస్తోందనటానికి సూచికలే. అలాగని దుష్ప్రభావాలు తలెత్తనంత మాత్రాన టీకా పనిచేయటం లేదని కాదు. రెండో మోతాదు తీసుకున్నవారిలోనూ కేవలం సగం మందికే చేయి నొప్పి, ప్రతి ఐదుగురిలో ఒకరికి జ్వరం తలెత్తినట్టు బ్రిటన్‌ అనుభవాలు పేర్కొంటున్నాయి. అందువల్ల దుష్ప్రభావాలు కనిపించకపోయినా బాధ పడాల్సిన పనిలేదు. టీకా తీసుకున్నాక 2-3 వారాల తర్వాత దాని ప్రభావం మొదలవుతుంది. కారణమేంటో తెలియదు గానీ కొందరిలో టీకా ఏమాత్రం ప్రభావం చూపకపోవచ్చు. అందుబాటులో ఉన్నవాటిల్లో అత్యంత సమర్థమైన టీకా తీసుకున్నా సుమారు 5% మందిలో అది పనిచేయకపోవచ్చని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. కొన్ని టీకాల విషయంలో 30% మందిలో వీటి ప్రభావం కనిపించటం లేదు. ఎందుకిలా? టీకాలకు రోగనిరోధక వ్యవస్థ ప్రతిస్పందించటంలో వయసు, లింగ భేదం, పేగుల్లోని బ్యాక్టీరియా వంటివి రకరకాల అంశాలు దోహదం చేస్తున్నట్టు ఇన్‌ఫ్లూయెంజా వంటి జబ్బులపై గతంలో నిర్వహించిన అధ్యయనాలు చెబుతున్నాయి.

లింగ భేదం:

చాలారకాల టీకాల విషయంలో మగవారి కన్నా ఆడవారిలో యాంటీబాడీల ప్రతిస్పందనలు ఎక్కువగా ఉంటున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. డెంగీ, హెపటైటిస్‌ ఎ, రేబిస్‌, మశూచి టీకాల వంటివి మహిళల్లో మరింత సమర్థమైన రోగనిరోధక ప్రతిస్పందనలను ప్రేరేపిస్తున్నాయని వివరిస్తున్నాయి. కరోనా టీకా విషయంలోనూ ఇలాంటి ప్రభావమే కనిపిస్తుందా? లేదా? అన్నది ఇంకా తెలియదు.

వయసు:

టీకా ప్రతిస్పందనలు వృద్ధుల్లో తక్కువగా ఉంటాయి. టీకా తీసుకున్నాక పుట్టుకొచ్చే యాంటీబాడీల సంఖ్య కూడా త్వరగా తగ్గుతూ వస్తుంటుంది. వయసుతో పాటు థైమస్‌ క్షీణించటం దీనికి ఒక కారణం కావొచ్చు. వైరస్‌ను మట్టుబెట్టే టి కణాలు పరిపక్వం చెందేది థైమస్‌లోనే. దీని విషయంలో మనం చేయగలిగిందేమీ లేదు.

పేగుల్లో బ్యాక్టీరియా:

మన పేగుల్లో రకరకాల బ్యాక్టీరియా ఉంటుంది. ఇది రోగనిరోధక వ్యవస్థనూ ప్రేరేపిస్తుంది. డిఫ్తీరియా, హెపటైటిస్‌ ఎ, ఫ్లూ టీకాల వంటి వాటికి రోగనిరోధక వ్యవస్థ మెరుగ్గా ప్రతిస్పందించటంలోనూ మన పేగుల్లోని బ్యాక్టీరియా పాలు పంచుకుంటున్నట్టు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. కరోనా టీకా విషయంలో ఇవి ఎలాంటి ప్రభావం చూపుతాయన్నది ఇప్పటికైతే తెలియదు. పేగుల్లో బ్యాక్టీరియాను వృద్ధి చేసే ప్రిబయోటిక్‌, ప్రొబయోటిక్‌ పదార్థాలు మేలు చేయొచ్చన్నది నిపుణుల భావన.

గత ఇన్‌ఫెక్షన్‌:

అప్పటికే ఇన్‌ఫెక్షన్‌ బారినపడ్డవారిలో టీకా ప్రతిస్పందన ఎక్కువగా ఉంటున్నట్టు ధనుర్వాతం, డెంగీ వంటి టీకాలపై నిర్వహించిన అధ్యయనాలు చెబుతున్నాయి. కొవిడ్‌-19 బారినపడ్డవారిలోనూ ఇలాంటి ప్రభావమే కనిపిస్తున్నట్టు చూస్తున్నాం. కాకపోతే కరోనా జబ్బు బారినపడ్డవారిలో యాంటీబాడీల ప్రతిస్పందన అందరిలో ఒకే స్థాయిలో ఉండటం లేదు. ఇది ఆయా వ్యక్తులను బట్టి ఆధారపడి ఉంటోంది. ఏదేమైనా సహజంగా పుట్టుకొచ్చే, టీకాతో ప్రేరేపితమయ్యే యాంటీబాడీల ప్రతిస్పందనలు భిన్నంగా ఉండే అవకాశం లేకపోలేదు.

ఇవి కూడదు..

కరోనా టీకా తీసుకోవాలని అనుకుంటున్నారా? అయితే దీన్ని ఇతర టీకాలతో కలిపి తీసుకోకుండా చూసుకోండి. ఫ్లూ, సర్ఫి టీకాల వంటివి తీసుకుంటే 14 రోజుల తర్వాతే కరోనా టీకా తీసుకోవాలి. అలాగే కరోనా టీకా తీసుకున్నాక 14 రోజుల తర్వాతే ఇతర టీకాలు తీసుకోవాలి. వీటి మధ్య ఎడమ ఉండేలా చూసుకోవటం తప్పనిసరి. అలాగే కరోనా టీకా తీసుకోవటానికి 24-48 గంటల ముందు ఐబూప్రొఫెన్‌, అసిటమినోఫెన్‌ వంటి నొప్పి మందులేవీ వేసుకోవద్దు. కొందరు సూది గుచ్చితే నొప్పి పుడుతున్న భయంతో వీటిని ముందుగానే వేసుకుంటుంటారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇవి కరోనా టీకా పనితీరుపై ఎలాంటి ప్రభావం చూపుతాయో తెలియదు. వీటినే కాదు.. ఆస్ప్రిన్‌, యాంటీహిస్టమిన్లనూ ముందుగా వేసుకోవద్దని అమెరికా సీడీసీ సూచిస్తోంది. టీకాకు ముందు ఐబూప్రొఫెన్‌, అసిటమినోఫెన్‌ వంటివి తీసుకుంటే రోగనిరోధక వ్యవస్థ పనితీరు మందగించొచ్చని కాలిఫోర్నియా యూనివర్సిటీ హెచ్చరిస్తోంది కూడా.

  • ఇదీ చూడండి : ఉద్యోగుల విభజనను కోర్టులు చెబితేగానీ చేయరా?
    About us Privacy Policy
    Terms & Conditions Contact us

    • ETV
    • ETV
    • ETV
    • ETV

    Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
    ETV

    INSTALL APP

    ETV

    CHANGE STATE

    ETV

    SEARCH

    ETV

    MORE

      • About us
      • Privacy Policy
      • Terms & Conditions
      • Contact us
      • Feedback

      Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.